ఆస్తిపన్ను రాయితీకి వారం రోజులే గడువు

ABN , First Publish Date - 2022-04-24T05:55:11+05:30 IST

పురపాలక సంఘం పరిధిలో ఆస్తిపన్ను చెల్లించే వారికి రాయితీ గడువు ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 30తో గడువు ముగియనుంది.

ఆస్తిపన్ను రాయితీకి వారం రోజులే గడువు
మున్సిపాలిటీలో ఆస్తి పన్ను చెల్లిస్తున్న దృశ్యం


ఇప్పటివరకు రూ.1.21 కోట్ల వసూలు 


హిందూపురం టౌన, ఏప్రిల్‌ 23: పురపాలక సంఘం పరిధిలో ఆస్తిపన్ను చెల్లించే వారికి రాయితీ గడువు ఏడు రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈనెల 30తో గడువు ముగియనుంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను పన్ను ఒకేసారి చెల్లించిన వారికి రాయితీ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. ఆస్తి పన్ను వార్షిక అద్దె ప్రాతిపదిక విధానం నుంచి మూలధన విలువలోకి మార్చిన తరువాత ప్రజలపై పన్నుభారం పెరిగింది. గత యేడాది నుంచి ఈ విధానంలో చెల్లించాలని ప్రకటించడంతో పట్టణ వాసులపై భారం పడింది. రెండో ఏడాది ఈసారి కూడా 15 శాతం పెంచారు. ఇప్పటివరకు ఎక్కువ మంది చెల్లించకపోవడంతో రిబేట్‌ ఉపశమనం కలిగించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగానికి కౌంటర్లు ఏర్పాటు చేశారు. ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. మరోవైపు  పన్ను పెరుగుదలపై సచివాలయాలకు అందుతున్న రివిజన పిటీషన్ల సంఖ్య కూడా పెరుగుతున్నది. ఏప్రిల్‌ 22 నాటికి రూ.10.50 కోట్ల పన్ను వసూలు లక్ష్యం విధించారు. ఇప్పటివరకు రూ.1.21 కోట్లు మా త్రమే చెల్లించారు. గత యేడాదితో పోల్చితే స్వ ల్పంగా పెరిగినట్లు అధికారులు పేర్కొంటున్నా రు. రాయితీ సద్వినియోగంపై విస్తృత ప్రచారం కల్పించాల్సిన అవసరం ఉంది. పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన లేకపోవడంతో చెల్లింపు లు మందగించినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు మొత్తం 3200 అసెస్మెంట్‌లకు రూ.1.21 కోట్లు చెల్లించినట్లు లెక్కలు చూపుతున్నారు. మిగిలిన ఏడు రోజుల్లో కనీసం రూ.70లక్షలు వసూలు కావచ్చని అధికారులు భావిస్తున్నారు. 


రాయితీపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.. 

 వెంకటేశ్వర్‌రావు, కమిషనర్‌ 

ఆస్తి పన్ను రాయితీపై విస్తృత ప్రచారం చేస్తున్నాం. పట్టణంలో ఫ్లెక్సిలు ఏర్పాటు చేసి సచివాలయ సిబ్బంది ద్వారా తెలియజేస్తున్నాం.  ఆటో ద్వారా పట్టణమంతా ప్రచారం కల్పిస్తున్నాం. ప్రజలు మున్సిపల్‌ ఆస్తిపన్ను రాయితీని సద్వినియోగం చేసుకోవాలి.

Updated Date - 2022-04-24T05:55:11+05:30 IST