పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోతుల.. కత్తి

ABN , First Publish Date - 2022-09-30T05:45:12+05:30 IST

రాయలసీమ పశ్చిమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి పేర్లను పీడీఎఫ్‌ పక్ష ఉపనాయకుడు కేఎస్‌ లక్ష్మణ్‌రావు గురువారం ప్రకటించారు.

పీడీఎఫ్‌ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోతుల.. కత్తి
ఐక్యత చాటుతున్న నాయకులు


పీడీఎఫ్‌ పక్ష ఉపనేత కేఎస్‌ లక్ష్మణ్‌రావు


అనంతపురం, సెప్టెంబరు 29(ఆంధ్రజ్యోతి): రాయలసీమ పశ్చిమ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోతుల నాగరాజు, కత్తి నరసింహారెడ్డి పేర్లను పీడీఎఫ్‌ పక్ష ఉపనాయకుడు కేఎస్‌ లక్ష్మణ్‌రావు గురువారం ప్రకటించారు. నగర శివారులోని ఓ కల్యాణమండపంలో గురువారం ఎమ్మెల్సీ అభ్యర్థుల పరిచయ కార్యక్రమాన్ని నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అభ్యుదయ, ప్రజా, ఉపాధ్యాయ, సామాజిక సంఘాల నాయకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో శాసనమండలి ఏర్పాటైన తరువాత, ప్రజాస్వామిక గొంతుకలు ఉండాలన్న ఉద్దేశంతో పీడీఎఫ్‌ ఏర్పాటు చేశామని లక్ష్మణ్‌రావు అన్నారు. అప్పటి నుంచి పీడీఎఫ్‌ తరుపున ప్రజా సమస్యలను శాసనమండలిలో వినిపిస్తున్నామని అన్నారు. ఈ ఎన్నికల్లో పీడీఎఫ్‌ తరుపున పట్టభద్రుల స్థానానికి పోతుల నాగరాజు, ఉపాధ్యాయ స్థానానికి కత్తి నరసింహారెడ్డి పోటీ చేస్తున్నారని అన్నారు. వారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. శాసనసభలో వ్యక్తిగత దూషణలు తప్ప.. ప్రజా సమస్యలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు చర్చించే పరిస్థితులు లేకపోవడం విచారకరమని అన్నారు. పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మాత్రమే ప్రజా సమస్యలను మండలిలో గట్టిగా వినిపిస్తున్నారని అన్నారు. అందుకే పీడీఎఫ్‌ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

  పీడీఎఫ్‌ అభ్యర్థులకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ఉంటుందని  సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గఫూర్‌ అన్నారు. వారి విజయానికి పూర్తిస్థాయిలో కృషి చేస్తామని అన్నారు. అధికార, ధనబలంతో గెలిచేందుకు కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థులకు ప్రజాబలం ఉందని అన్నారు. వీరి విజయానికి సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.

 పీడీఎఫ్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకుంటానని పట్టభద్రుల స్థానం అభ్యర్థి నాగరాజు అన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు నిర్వహించే వారిని ప్రభుత్వం నిర్బంధిస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ శాఖల్లో అనేక ఖాళీగా ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయడంలేదని అన్నారు. వెనుకబడిన ప్రాంతాల సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. తమ అభ్యర్థిత్వానికి మద్దతు తెలుపుతున్న ఉపాధ్యాయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలన్నింటికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని అన్నారు. 

  ఆరేళ్లుగా ప్రజా, ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై పీడీఎఫ్‌తో కలిసి పనిచేశానని ఉపాధ్యాయ స్థానం అభ్యర్థి కత్తి నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఈ పోరాటాన్ని మరింత ముందుకు తీసుకు వెళతానని అన్నారు. పీడీఎఫ్‌ అభ్యర్థులుగా ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో నిలిచిన తమను బలపరచాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు సురేష్‌, కార్యదర్శి లక్ష్మణ్‌రాజు, లింగన్న, ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తిమ్మన్న, జిల్లా నాయకులు సూరీడు, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగమణి, ప్రధాన కార్యదర్శి నాగేంద్రకుమార్‌, సీఐటీయూ నాయకులు రాంభూపాల్‌, ఏఐటీయూసీ నాయకులు జాఫర్‌, ఐద్వా రాష్ట్ర నాయకులు సావిత్రి, రాజేశ్వరి, ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు పద్మావతి, జనవిజ్ఞాన వేదిక నాయకులు  పాల్గొన్నారు.


Updated Date - 2022-09-30T05:45:12+05:30 IST