పేదల బియ్యం పక్కదారి

ABN , First Publish Date - 2022-12-30T00:02:01+05:30 IST

చౌక ధరల దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఈ బియ్యం క్రయవిక్రయాలతో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు.

 పేదల బియ్యం పక్కదారి

విజిలెన్స దాడులలో పట్టుబడుతున్నా ఆగని వైనం

రేషన బియ్యంతో జేబులు నింపుకుంటున్న వ్యాపారస్థులు

ప్రశ్నార్థకంగా తనిఖీలు

గార్లదిన్నె, డిసెంబరు 29: చౌక ధరల దుకాణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పేదలకు సరఫరా చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఈ బియ్యం క్రయవిక్రయాలతో అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. ఈ తంతు సంబంధిత అధికారులకు తెలిసే జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి నెలా ఈ వ్యవహారం యథేచ్ఛగా జరుగుతున్నా అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. వారానికి రెండు సార్లు విజిలెన్స అధికారులు మండలంలో ఏదో ఒకచోట బియ్యం తరలిస్తున్న వాహనాలను పట్టుకుని స్టాక్‌ పాయింట్లకు తరలిస్తున్నారు. గత రెండు నెలల్లోనే 3 సార్లు సుమారు 300 క్వింటాల బియ్యంను సీజ్‌ చేశారు. పదినెలల క్రితం అప్పటి ఎస్‌ఐ కిరణ్‌కుమార్‌రెడ్డి సుమారు 200 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. గార్లదిన్నెతో పాటు ఎర్రగుంట్ల గ్రామాలకు చెందిన కొందరు రేషన బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి బెంగళూరు, బళ్లారి ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యాపారానికి గార్లదిన్నె కేరాఫ్‌ అడ్ర్‌సగా మారింది. రేషన బియ్యంకు మండలంలో ప్రత్యేక గోడౌన్లు సైతం ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయం తెలిసినా అధికారులు తెలియనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. అయితే సంబంధిత అధికారులు నామమాత్రంగా పట్టుకొని కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారని మండల ప్రజలు విమర్శిస్తున్నారు.

విక్రయిస్తే చర్యలు తప్పవు

రాష్ట్ర ప్రభుత్వం చౌక ధరల దుకాణాల ద్వారా పేదలకు రాయితీపై అందజేస్తున్న బియ్యంను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు. ఈ బియ్యం క్రయ విక్రయాలు చేపట్టినట్లు తెలిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. ఈ విషయాలను డీలర్లు మా దృష్టికి తీసుకురావాలి. ఈ వ్యాపారంలో డీలర్ల ప్రమేయం ఉన్నట్లు తెలిస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం.

- ధనలక్ష్మి, సీఎస్‌డీటీ, గార్లదిన్నె

Updated Date - 2022-12-30T00:02:01+05:30 IST

Read more