వరుణ్‌ వైపు పోలీసుల చూపు

ABN , First Publish Date - 2022-10-12T05:23:25+05:30 IST

రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన వైసీపీనేత చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య జరిగి నాలుగు రోజులవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు.

వరుణ్‌ వైపు పోలీసుల చూపు
రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని పరామర్శిస్తున్న మంత్రిపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

- ‘పురం’ వైసీపీ నేత రామకృష్ణారెడ్డి హత్య కేసు

- చౌళూరుకు చెందిన యువకుడిపై అనుమానాలు

- సెల్‌ వాడకపోవడంతో దర్యాప్తులో మందగమనం 

- పోలీసుల అదుపులో కొందరు యువకులు?

- సరిహద్దు ప్రాంతంలో జల్లెడపడుతున్న పోలీసులు

హిందూపురం, అక్టోబరు 11: రాష్ట్రంలోనే సంచలనం రేకెత్తించిన వైసీపీనేత చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణ హత్య జరిగి నాలుగు రోజులవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. హత్యజరిగిన రాత్రే పోలీసులు నాలుగు బృందాలుగా విడిపోయి దర్యాప్తు చేస్తున్నారు. అయినప్పటికి ఇంతవరకు ఎలాంటి సమాచారం బయటకు వెల్లడికాలేదు. హత్య జరిగిన రోజు ప్రత్యక్షంగా ముగ్గురు, పరోక్షంగా ముగ్గురు పా ల్గొన్నట్లు మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించినా వారిలో ఏ ఒక్కరినీ ఇంతవరకు పోలీసులు అదుపులోకి తీసుకోలేదు. రామకృష్ణా రెడ్డి కుటుంబ సభ్యులు అనుమానిస్తున్న చౌళూరు వాసి వరుణ్‌పైనే పోలీసులు దృష్టి సారిస్తున్నారు. వరుణ్‌పై కర్ణాటకలో ఇప్పటికే 25 కేసులు, ఆంధ్రప్రదేశలో మరో రెండు కేసులు ఉన్నాయి. వీటిలో హత్యకేసులు కూడా ఉన్నాయి. పోలీసులు వరుణ్‌పైనే దృష్టి సారిస్తున్నారు తప్పా ఇతర కోణాల్లో దర్యాప్తు చేయడం లేదన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అనుమానిత వరుణ్‌ సెల్‌ఫోన వాడకపోవడంతో అతడిని పట్టుకోవడంలో పోలీసులకు కత్తిమీద సాములా తయారైంది. సెల్‌ఫోన ఉంటే సిగ్నల్‌ ఆధారంగా పట్టుకునేవారు. అది లేకపోవడంతో పోలీస్‌ విచారణ వేగవంతంగా జరగడం లేదు.


పోలీసుల అదుపులో యువకులు? 


రామకృష్ణారెడ్డిని హత్య చేయడంలో అనుమానిత నిందితుడికి ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు యువకులను సోమవారం అర్ధరాత్రి దాటాక అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే హత్య చేయడానికి రెండు మూడు రోజులు ముందుగానే రెక్కీ నిర్వహించి అదే ప్రాంతంలో మకాం వేసినట్లు విచారణలో ఉన్న యువకులు చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. వీరు కేవలం భోజనం, ఇతర సౌకర్యాలు మాత్రమే కల్పించామని, ఇతరాత్ర వ్యవహారాలు తమకు తెలియవంటూ పోలీసులవద్ద వెల్లడించినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా రామకృష్ణారెడ్డి హత్యకేసులో వరుణ్‌తో పాటు చౌళూరు గ్రామానికి చెందిన మహేష్‌ అనే వ్యక్తి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. అతడి ఆచూకీ కోసం కూడా పోలీస్‌ బృందాలు వెంటాడుతున్నాయి. 


సరిహద్దు ప్రాంతంలోనే వరుణ్‌? 


పోలీసులు అనుమానిస్తున్న వరుణ్‌ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇందుకు కారణం హత్య జరిగిన రోజు, మరుసటి రోజు వరుణ్‌ దొంగలించిన పల్సర్‌వాహనాన్ని తాకట్టు పెట్టేందుకు మూడు గ్రామాల్లో తిరిగాడు. ఆ దిశగా కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు.  సరిహద్దు ప్రాంతంలోనే ఉంటూ తన స్థావరాలను  వరుణ్‌ మార్చుకుంటూ వెళ్తున్నాడన్న అనుమానాలను పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆచూకీ కనుగొనడం పోలీసులకు కష్టంగా మారింది. 


దోషులను వదిలే ప్రసక్తేలేదు : మంత్రి

  హిందూపురం: చౌళూరు రామకృష్ణారెడ్డి దారుణహత్య వెనుక దోషులు ఎంతటివారైనా వదిలే ప్రసక్తేలేదని రాష్ట్ర అటవీశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చౌళూరుకు వచ్చిన ఆయన రామకృష్ణారెడ్డి తల్లి లక్ష్మీనారాయణమ్మ, భార్య జ్యోత్స్న, సోదరి మధుమతిలతో మాట్లాడారు. అనంతరం పెద్దిరెడ్డి మాట్లాడుతూ పార్టీకోసం రామకృష్ణారెడ్డి ఎంతగానో కష్టపడ్డాడన్నారు. ఆయన హత్య తనను కలిచి వేసిందన్నారు. దీని వెనుక ఎంతటివారున్నా వదిలే ప్రసక్తే లేదన్నారు. కేసు దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందన్నారు. దోషులను కఠినంగా శిక్షపడేలా ప్రభుత్వం చూస్తుందన్నారు. ఈ హత్యవెనుక ఎవరున్నారనేది త్వరలోనే బయటపడుతుందన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు శంకర్‌నారాయణ, సిద్దారెడ్డి, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ఘని, రాష్ట్ర ఆగ్రోస్‌ చైర్మన నవీననిశ్చల్‌, నాయకులు కొండూరు వేణుగోపాల్‌రెడ్డి, మోహనరెడ్డి, జనార్దనరెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన ఇంద్రజ, వైస్‌ చైర్మన బలరాంరెడ్డి, జబీ తదితరులు పాల్గొన్నారు. 



Updated Date - 2022-10-12T05:23:25+05:30 IST