లలితాబాయికి ఆగస్టు నుంచి పింఛన

ABN , First Publish Date - 2022-07-19T05:23:07+05:30 IST

గిరిజన మహిళ లలితాబాయికి పింఛన మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండ్రోజుల క్రితం మండలంలోని శెట్టిపల్లి తండాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు తనకు 11 నెలలుగా పింఛన ఆపేశారని లలితాబాయి చెప్పుకునే ప్రయత్నం చేసింది.

లలితాబాయికి ఆగస్టు నుంచి పింఛన

పెనుకొండ రూరల్‌, జూలై 18: గిరిజన మహిళ లలితాబాయికి పింఛన మంజూరుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రెండ్రోజుల క్రితం మండలంలోని శెట్టిపల్లి తండాలో ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమాన్ని చేపట్టిన ఎమ్మెల్యే శంకర్‌నారాయణకు తనకు 11 నెలలుగా పింఛన ఆపేశారని లలితాబాయి చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆయన పట్టించుకోకుండా వెళ్లిపోవడంతో లలితాబాయి ఆగ్రహంతో తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే. ఇది సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడం, రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారడంతో అప్పటికప్పుడు అధికార యంత్రాంగం లలితాబాయి దరఖాస్తు చేసుకున్న పింఛన ప్రతిపాదనను ముందుకు కదిలించారు. ఆగస్టు నుంచి ఆమెకు పింఛన మంజూరు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ శివశంకరప్పను వివరణ కోరగా.. లలితాబాయికి గతంలో పింఛన వస్తుండేదనీ, ఇటీవల సర్వేలో ఆమెకు వయసు తక్కువగా ఉండటంతో ఆపేశారన్నారు. ప్రస్తుతం వితంతు పింఛన కోసం దరఖాస్తు చేసుకోవడంతో స్పెషల్‌ ఐడీ వచ్చిందన్నారు. రెండ్రోజుల్లో పింఛన ఐడీ వస్తుందనీ, ఆగస్టు నుంచి ఆమెకు వితంతు పింఛన అందజేస్తామని ఎంపీడీఓ చెప్పుకొచ్చారు.

Updated Date - 2022-07-19T05:23:07+05:30 IST