పాగా కోసం పావులు

ABN , First Publish Date - 2022-11-30T00:23:56+05:30 IST

పాఠశాలల్లో ఉండటం ఇష్టంలేక.. కొందరు ఉపాధ్యాయులు ఫారిన్‌ సర్వీస్‌ పోస్టుల్లోకి వచ్చేందుకు పైరవీలు మొదలు పెట్టారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సు లేఖలతో హడావిడి చేస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న నాలుగు అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టుల్లోకి వచ్చేందుకు అనేక యత్నాలు చేస్తున్నారు.

పాగా కోసం పావులు
ప్రాజెక్టు కార్యాలయం

సమగ్రశిక్షలో నాలుగు ఖాళీలు

అధికార పార్టీ నేతల సిఫార్సులు

ఫారిన సర్వీస్‌ కోసం టీచర్ల యత్నం

దరఖాస్తుదారులకు నేడు ఇంటర్వ్యూలు

అనంతపురం విద్య, నవంబరు 29:

పాఠశాలల్లో ఉండటం ఇష్టంలేక.. కొందరు ఉపాధ్యాయులు ఫారిన్‌ సర్వీస్‌ పోస్టుల్లోకి వచ్చేందుకు పైరవీలు మొదలు పెట్టారు. సమగ్రశిక్ష ప్రాజెక్టులో పాగా వేసేందుకు పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సు లేఖలతో హడావిడి చేస్తున్నారు. ప్రాజెక్టులో ఉన్న నాలుగు అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టుల్లోకి వచ్చేందుకు అనేక యత్నాలు చేస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు అధికార పార్టీ మంత్ర దండాన్ని అడ్డుపెట్టుకుని అడుగులు వేస్తున్నారు. గతంలో అడ్డగోలుగా పలు పోస్టులను భర్తీ చేశారు. లేఖల హడావిడి చూస్తుంటే.. ఈసారి కూడా అదే జరిగేలా కనిపిస్తోంది. ఇటీవల దరఖాస్తుల స్ర్కూటినీ పూర్తి చేశారు. ప్రాజెక్టులోకి రావడానికి 50 ఏళ్లు నిండిన వారు అనర్హులు. అయినా కొందరు 50 ఏళ్ల పైబడిన నలుగురు దరఖాస్తు చేశారు. అర్హుల జాబితాలో చేర్చాలని వైసీపీ ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి చేయించారని సమాచారం. అయినా అధికారులు వారిని జాబతా నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. కానీ సిఫార్సు లేఖల సందడి మాత్రం కొనసాగుతోంది.

నాలుగు పోస్టులపై కన్ను

అనంతపురం సమగ్రశిక్ష ప్రాజెక్టులో ఇటీవల 4 అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ పోస్టు లు ఖాళీ అయ్యాయి. పనిచేస్తున్న వారి ఫారిన్‌ సర్వీస్‌ గడువు ముగియడంతో వారిని మాతృశాఖకు తిరిగి పంపించారు. ఖాళీ అయిన అసిస్టెంట్‌ ఏఎంఓ (జనరల్‌), అసిస్టెంట్‌ సీఎంఓ, అసిస్టెంట్‌ ప్రొగ్రామింగ్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ అలెస్కో పోస్టుల భర్తీకి ఇటీవల దరఖాస్తులు కోరారు. ఈ నెల 5వ తేదీ వరకూ స్వీకరించారు. ఖాళీగా ఉన్న 4 పోస్టులకు 72 దరఖాస్తులు వచ్చాయి. వాటిని ప్రధానోపాధ్యాయులతో స్ర్కూటినీ చేయించారు. ఆ సమయంలో పైరవీకారులు ఒత్తిడి చేయించారని సమాచారం.

వచ్చేందుకు పట్టు

ప్రాజెక్టులో ఉన్న 4 పోస్టులను దక్కించుకునేందుకు అధికార పార్టీకి అనుకూలంగా ఉండే ఉపాధ్యాయులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇద్దరు టీచర్లకు రెండు పోస్టులు ఇప్పించేందుకు అధికార పార్టీ అనుబంధ ఉపాధ్యాయ సంఘం నా యకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఆ ఇద్దరిలో గతంలో ఒకసారి ప్రయత్నం చేసి, విఫలమైన నాయకుడు సైన్స్‌ సెంటర్‌లో ఏడాది పనిచేసి, మళ్లీ స్కూల్‌కు వెళ్లాడు. ఇప్పుడు ఆ నాయకుడు ప్రాజెక్టులో ఒక పోస్టు కోసం విశ్వప్రయత్నాలు చేసి, మళ్లీ భంగపడినట్లు సమాచారం. పలువురు ఎమ్మెల్యేల వద్ద పీఏగా పని చేసిన ఓ ఉపాధ్యాయుడు, ఎలాగైనా ప్రాజెక్టులోకి అడుగు పెట్టాలని భారీగా పైరవీలు చేస్తున్నట్లు ఆ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే వైసీపీ ప్రజాప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున సిఫార్సు లేఖలు అందినట్లు తెలుస్తోంది.

అర్హులకు ఇస్తారా..?

ప్రాజెక్టులో పనిచేసే టీచర్ల వయసు 50 ఏళ్లలోపు ఉండాలి. మొదట 50 ఏళ్లు పైబడిన నలుగురు టీచర్లు కూడా దరఖాస్తులు చేశారు. అధికార పార్టీ అండతో ప్రాజెక్టులోకి రావాలని వీరు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ పాచిక పారలేదు. గతంలో సమగ్రశిక్ష ప్రాజెక్టులో పలు పోస్టులను భర్తీ చేశారు. అప్పట్లో అడ్డగోలుగా నియామకాలు చేపట్టారు. అప్పటి కలెక్టర్‌, ఇతర ఉన్నతాధికారులు సైతం నిబంధనలను పాటించలేదు. నిబంధనలకు విరుద్ధంగా సెక్టోరియల్‌ పోస్టుల్లో స్కూల్‌ అసిస్టెంట్స్‌ను నియమించారు. ఇప్పుడు మరోసారి అదే జరుగుతుందా అన్న చర్చ మొదలైంది. పోస్టుల భర్తీకి బుధవారం ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఇంటర్వ్యూ పేరిట తతంగం నడిపి, అధికార పార్టీ నేతల జపం చేసే వారికి ఇస్తారా..? అర్హతలు, ప్రతిభ ఉన్న వారికి అవకాశం ఇస్తారా అన్నది తేలాల్సి ఉంది.

Updated Date - 2022-11-30T00:23:56+05:30 IST

Read more