ఓటీఎస్‌.. ఫెయిల్‌

ABN , First Publish Date - 2022-11-30T00:13:08+05:30 IST

ప్రభుత్వం ఆర్భాటమే తప్పా.. ఉమ్మడి జిల్లాలో ఓటీఎస్‌ అమలు తుస్‌ మంది. గతంలో ప్రభుత్వ పథకాల కింద ఇల్లు నిర్మించుకున్న పేదల ఇళ్లకు హక్కు పత్రం (రిజిస్ట్రేషన పత్రాలు) కల్పిసాం.. అందరిలాగానే.. తమ ఇళ్లకు బ్యాంకులో రుణం కూడా తీసుకోవచ్చనని ప్రభుత్వం బాధిత ప్రజలను నమ్మించింది

ఓటీఎస్‌.. ఫెయిల్‌
జిల్లా గృహనిర్మాణ శాఖ కార్యాలయం

డబ్బులు చెల్లించినా అందని పత్రాలు

ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విఫలం

పత్రాల కోసం లబ్ధిదారులు ఎదురుచూపులు

అనంతపురం సిటీ ప్రభుత్వం ఆర్భాటమే తప్పా.. ఉమ్మడి జిల్లాలో ఓటీఎస్‌ అమలు తుస్‌ మంది. గతంలో ప్రభుత్వ పథకాల కింద ఇల్లు నిర్మించుకున్న పేదల ఇళ్లకు హక్కు పత్రం (రిజిస్ట్రేషన పత్రాలు) కల్పిసాం.. అందరిలాగానే.. తమ ఇళ్లకు బ్యాంకులో రుణం కూడా తీసుకోవచ్చనని ప్రభుత్వం బాధిత ప్రజలను నమ్మించింది. వీటికితోడు ఆయా ప్రాంతాల వారీగా వార్డు కార్యదర్శులు, మున్సిపల్‌, గ్రామ పంచాయతీ, సచివాలయం తదితర సిబ్బంది తమ పరిధిలో పెద్దఎత్తున ఓటీఎస్‌ పథకం ప్రచారం చేసి చాలా మందితో నగదు కూడా వసూలు చేశారు. మరికొందరు లబ్ధిదారులు అష్టకష్టాలు పడి డబ్బులు చెల్లించారు. అయితే నగదు చెల్లించిన తరువాత పత్రాలు ఇవ్వకుండా అధికారులు కార్యాలయాలు చుట్టూ తిప్పుకోవడం పలు విమర్శలకు తావిస్తోంది. రోజులు కాదు.. నెలలు కాదు.. ఏకంగా ఏడాదికిపైగా డబ్బులు చెల్లించినా ఇప్పటికి హక్కు పత్రాలు అధికారులు అందించకపోవడం బాధిత లబ్ధిదారులను కలవరపెడుతోంది. ఇంతకు తమకు పత్రాలు వస్తాయా..? లేదా..? అన్న ఆందోళన చెందుతున్నారు. మరికొందరైతే ఓటీఎస్‌ విషయంలో అధికారులు, ప్రభుత్వం వ్యహరిస్తున్న తీరుతో నగదు చెల్లించకుండా మిన్నుకుండిపోయారు. మొత్తంగా అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటీఎస్‌ అమలు తీరు పూర్తిస్థాయిలో అధ్వానంగా తయారైంది. ఇదిలా ఉండగా.. నగదు చెల్లించిన లబ్ధిదారులు హక్కు పత్రాలు కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

రెండు జిల్లాల్లో 2.96 లక్షల ఇళ్ల గుర్తింపు...

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1983 నుంచి 2011 వరకు గృహ నిర్మాణశాఖ కింద రుణం తీసుకుని నిర్మించిన ఇళ్ల సంఖ్య 2,96,755 ఉన్నట్టు అధికారిక లెక్కలు చెప్తున్నాయి. ఓటీఎస్‌ కింద ప్రభుత్వం సూచించిన ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రూ.10వేలు, పురపాలక ప్రాంతాల్లో రూ. 15 వేలు, నగరపాలక సంస్థల్లో రూ. 20 వేలు చొప్పున నగదును ఆయా లబ్ధిదారులు ఏకకాలంలో చెల్లిస్తే సంబంధిత గృహాలకు రిజిస్ట్రేషన్లు చేసి పూర్తిస్థాయి యాజమాన్య పత్రాలు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా అవసరమైతే లబ్ధిదారులు ఓటీఎస్‌ పత్రాలతో తమ ఇంటిపై బ్యాంకులో రుణాలు తెచ్చుకోవచ్చు.. అత్యవసరమైతే విక్రయించుకోవచ్చని ప్రకటించింది. తద్వారా కొందరు లబ్ధిదారులు ముందుకురాగా... అధికారులు, ప్రభుత్వ వైఖరితో చాలా మంది లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు.

తప్పని ఎదురు చూపులు..

ఉమ్మడి జిల్లాలో ఓటీఎస్‌ లబ్ధిదారుల సంఖ్య 96,755 మంది ఉన్నట్లు అధికారిక లెక్కలున్నాయి. అయితే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఓటీఎస్‌ అమలు తీరు అంతంత మాత్రంగానే సాగుతోంది. అదీ కూడా అధికార యంత్రాంగం బెదిరింపులతోనే అక్కడక్కడ లబ్ధిదారులు ముందుకువస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో డబ్బులు చెల్లించిన వారిలో ఆందోళన మొదలైంది. నగదు చెల్లించినా పత్రాలు ఇప్పటికి రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికార యంత్రాంగం కూడా అదిగో.. ఇదిగో.. అంటూ కాలయాపన చేస్తున్నారే తప్ప పత్రాలు ఇవ్వడం లేదు. కాగా డబ్బులు చెల్లించినా పత్రాలు రాని వారు మాత్రం ఆయా ప్రాంతాల్లోని తహసీల్దారు, మున్సిపల్‌, వార్డు, గ్రామ సచివాలయాలు చుట్టూ ఇప్పటికి తిరుగుతూనే ఉన్నారు. దీంతో ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగింది. వారిలో అసంతృప్తి ఏకంగా పాలకులను నిలదీసే స్థాయికి చేరింది. అనంతపురం జిల్లాలో ఇటీవల ఆ శాఖ మంత్రి పర్యాటనలో వైసీపీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే నిలదీయమే ఇందుకు నిదర్శనం. ఇలా నగదు చెల్లించినా పత్రాలు కోసం నెలలు తరబడి లబ్ధిదారులకు ఎదురుచూపులు తప్పడం లేదు. అంతేకాకుండా హక్కు పత్రాలు ఎప్పుడూ అందుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికార యంత్రాంగం స్పందించి ఓటీ ఎస్‌ లబ్ధిదారులకు న్యాయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఒత్తిడి చేయడంతో రూ.37 కోట్ల వసూళ్లు

ప్రభుత్వం ప్రకటించిన ఓటీఎస్‌ తీరుపై ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పలు అనుమాలు తలెత్తాయి. ఈ క్రమంలో ఓటీఎస్‌ పథకంపై లబ్ధిదారులకు ఏమాత్రం నమ్మకం లేకుండా పోయింది. నగదు చెల్లించేందుకు ఆసక్తి చూపలేదు. చివరికి అధికార యంత్రాంగం తమదైన శైలిలో బెదిరింపులకు దిగింది. ఓటీఎస్‌ పథకంలో లబ్ధిదారులైన వారందరూ నగదు చెల్లించాలని అధికార యంత్రాంగం (తహసీల్దార్లు, వీఆర్వోలు, సచివాలయ సిబ్బంది) తమదైన శైలిలో బాధిత లబ్ధిదారులపై ఒత్తిడి చేశారు. చివరికి చేసేదేమీ లేక కొంతమంది లబ్ధిదారులు నగదు చెల్లించారు. ఇలా ఇప్పటి వరకు అనంతపురం జిల్లాలో 29,885 మంది నగదు చెల్లించగా... 23,959 మందికి సంబందించి రిజిస్ట్రేషన పక్రియ పూర్తయింది. ఇంకా 5926 మందికి అందించాల్సింది. అదేవిధంగా మరో 10,296మంది నగదు చెల్లించినా ఇప్పటికి తమకు పత్రాలే అందలేదని బాధితులు ఆయా కార్యాలయాలు చుట్టూ తిరుతున్నారు. అలాగే.. శ్రీ సత్యసాయి జిల్లాలో 29,712 మంది నగదు చెల్లించగా.. 22,971 మందికి సంబంధించిన రిజిస్ట్రేషన పక్రియ పూర్తయింది. వీరిలో 6741 మందికి ఇప్పటికి పత్రాలు అందించలేదని తెలిసింది. వీరితో పాటు నగదు చెల్లించిన 11,286 మందికి కూడా ఓటీఎస్‌ పత్రాలు ఇప్పటికి అందించలేదని తెలిసింది. ఇదిలా ఉండగా.. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 59,597 మంది లబ్ధిదారులు రూ. 37 కోట్లు ఓటీఎస్‌ పథకం కింద ప్రభుత్వానికి లబ్ధిదారులు చెల్లించారు.

Updated Date - 2022-11-30T00:13:09+05:30 IST