నాలుగు కాదు.. రెండే..!

ABN , First Publish Date - 2022-10-01T05:58:55+05:30 IST

రిజర్వాయర్ల నిర్మాణంపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మాట మార్చారు.

నాలుగు కాదు.. రెండే..!
వేదికపై దర్జాగా వైసీపీ నాయకులు

రిజర్వాయర్లపై నాలుక మడతేసిన ఎమ్మెల్యే తోపుదుర్తి

ఆ రెండింటినైనా కడతారా.. అని రైతుల నిట్టూర్పు

కనగానపల్లి, సెప్టెంబరు 30: రిజర్వాయర్ల నిర్మాణంపై రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌ రెడ్డి మాట మార్చారు. చెన్నేకొత్తపల్లి మండలంలో నిర్వహించిన బహిరంగ సభలో రెండేళ్ల క్రితం నాలుగు రిజర్వాయర్లు నిర్మిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. అదే వేదిక మీద సీఎం జగన వర్చువల్‌ విధానంలో పైలాన ఆవిష్కరించారు. కానీ ఎన్నికలలోపు రెండు రిజర్వాయర్ల నిర్మాణం మాత్రమే చేపడతామని అన్నారు. ఎంపీడీఓ కార్యాలయం వద్ద శుక్రవారం వైఎస్సాఆర్‌ చేయూత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే, రిజర్వాయర్లపై మాట మార్చారు. దీంతో రైతులు విస్తుపోయారు. కనీసం ఆ రెండింటినైనా పూర్తి చేస్తారా.. అని నిట్టూర్చారు. కార్యక్రమానికి వచ్చిన మహిళలు.. తమ సమస్యలపై అర్జీలు ఇచ్చేందుకు ఎమ్మెల్యే వద్దకు వెళుతుండగా, పోలీసులు, సచివాలయ సిబ్బంది అడ్డుకున్నారు. అక్కడే ఉన్న ఎంపీపీ కుంపటి భాగ్యమ్మ భర్త, వైసీపీ నాయకుడు నాగముని జోక్యం చేసుకున్నారు. సమస్యలను తామే పరిష్కరిస్తామని, ఎమ్మెల్యే వద్దకు వెళ్లొద్దని మహిళలతో అన్నారు. వారి చేతిలోని అర్జీలను తీసుకున్నారు. దీంతో మహిళలు అసంతృప్తి వ్యక్తం చేశారు.  స్థానిక నాయకులు పరిష్కరించేలా ఉంటే ఎమ్మెల్యే వద్దకు ఎందుకొస్తామని నిట్టూర్చారు. కార్యక్రమంలో స్టేజ్‌ మీద వైసీపీ నాయకులు కూర్చోగా, కొందరు ఎంపీటీసీలు, సర్పంచలు, మహిళా అధికారులు స్టేజ్‌ కింద కూర్చోవడం విమర్శలకు తావిచ్చింది.


Read more