నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు

ABN , First Publish Date - 2022-11-25T00:20:31+05:30 IST

‘మిస్టర్‌ ప్రకాష్‌... నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై ఎమ్మెల్యే చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌

మా నాయకుడిని విమర్శించే స్థాయా నీది..?

రాప్తాడు ఎమ్మెల్యేపై సీపీఐ జాఫర్‌ ఫైర్‌

అనంతపురం, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): ‘మిస్టర్‌ ప్రకాష్‌... నీ తాటాకు చప్పుళ్లకు ఎవరూ భయపడరు’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డిని సీపీఐ జిల్లా కార్యదర్శి జాఫర్‌ హెచ్చరించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణపై ఎమ్మెల్యే చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గురించి మాట్లాడే ముందు నీ స్థాయి ఏమిటో తెలుసుకో’ అని ఎమ్మెల్యేకి సూచించారు. క్రిమినల్‌ రికార్డుతో జైలుకెళ్లిన చరిత్ర నీదని మండిపడ్డారు. పీఏబీఆర్‌ కోసం పోరాటం చేసి జైలు కెళ్లిన చరిత్ర రామకృష్ణదని అన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీతతో కలిసి నడిస్తే మీకు శంకర గిరి మాన్యాలే అని ఎమ్మెల్యే సోదరులను హెచ్చరించారు. స్వగ్రామం తోపుదుర్తికి వెళ్లేందుకు కమ్యూనిస్టు పార్టీ, రామకృష్ణ సహకారం తీసుకున్న విషయాన్ని మరిచిపోవద్దని సూచించారు. నిబద్ధత కలిగిన కమ్యూనిస్టు పార్టీ నాయకులం తాము అని అన్నారు. ఎమ్మెల్యే హోదాలో తోపుదుర్తికి తారురోడ్డు వేసిన ఘనత రామకృష్ణదే అని అన్నారు. ఆ విషయం తెలియకపోతే నీ తండ్రి ఆత్మారామిరెడ్డిని అడిగి తెలుసుకో అని ఎమ్మెల్యేకి సూచించారు. ప్రభుత్వాస్పత్రిలో సైకిల్‌ స్టాండ్‌ కాంట్రాక్ట్‌, మున్సిపాలిటీలో సుంకం వసూలు టెండర్‌ తీసుకున్న మీరు మాట్లాడుతారా అని మండిపడ్డారు. ఇక ఊరూరా నీ చరిత్ర చాటుతామని ఎమ్మెల్యేని హెచ్చరించారు. 12 వేల మందికి ఇంటి స్థలాలు ఇప్పించిన ఘనత రామకృష్ణదని అన్నారు. ‘జగనన్న ఇళ్ల ఇనచార్జ్‌ నువ్వే కదా. నీకు కంకర, ఇసుక ఎక్కడ నుంచి వస్తుందో లోతుగా పరిశీలిస్తాం’ అని అన్నారు. కరపత్రాలతో నీ చరిత్ర ప్రజలకు చాటుతామని అన్నారు. శిల్పా లేపాక్షిలో నీరు బయటకు పోకుండా అడ్డుపడుతున్నదెవరో అందరికీ తెలుసునని అన్నారు. చేతనైతే జాకీ పరిశ్రమను వెనక్కు తెప్పించాలని సవాలు విసిరారు. 6500 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ వెనక్కుపోతే సిగ్గుగా లేదా అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు. డబ్బు కోసం ఎమ్మెల్యే బెదిరించినందుకే జాకీ పరిశ్రమ వెళ్లిపోయిందని జిల్లా ప్రజానీకానికి తెలుసునని అన్నారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు మరొకరిపై విమర్శలు చేయడం మంచిది కాదని హితవు పలికారు. కియ అనుబంధ పరిశ్రమలు రాకపోవడానికి వైసీపీ కారణం కాదా..? అని ప్రశ్నించారు. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో సహనం కోల్పోయి మాట్లాడుతున్నారని అన్నారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా తాము ఏర్పాటు చేసిన సభలకు నువ్వు రాలేదా..? అని ఎమ్మెల్యేని ప్రశ్నించారు. అప్పట్లో పరిటాల కుటుంబీకులు తమను విమర్శించలేదే అని అన్నారు. సమావేశంలో పార్టీ ముఖ్య నాయకులు నారాయణస్వామి, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-11-25T00:20:35+05:30 IST