చెక్కులు ఇచ్చేదే లేదు.. దిక్కున్న చోట చెప్పుకో..

ABN , First Publish Date - 2022-07-18T07:08:24+05:30 IST

‘చెక్కులు ఇచ్చేదే లేదు... నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను.. దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ మండలంలోని చెదళ్ల గ్రామ సర్పంచ రెచ్చిపోయాడు.

చెక్కులు ఇచ్చేదే లేదు..  దిక్కున్న చోట చెప్పుకో..

మీరే పనులు చేశారని గ్యారెంటీ ఏమిటీ.?

రెచ్చిపోయిన సర్పంచ 

బుక్కరాయసముద్రం, జూలై 17: ‘చెక్కులు ఇచ్చేదే లేదు... నా ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాను.. దిక్కున్న చోట చెప్పుకో’ అంటూ మండలంలోని చెదళ్ల గ్రామ సర్పంచ రెచ్చిపోయాడు. టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు సంబంధించి ఇటీవల గ్రామ పంచాయతీ అకౌంట్‌ డబ్బులు జమ అయ్యాయి. అప్పట్లో పనులు చేపట్టిన సర్పంచ, ఎంపీటీసీ బిల్లుల కోసం ప్రస్తుత సర్పంచ శ్రీనివాసుల రెడ్డిని ఆశ్రయించారు. దీంతో ఆయన మీరే పనులు చేశారని గ్యారెంటీ ఏమిటీ.? పనులకు సంబంధించిన చెక్కులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పాడని బాధితులు ఆరోపించారు. 2015 నుంచి 2018 సంవత్సరాల్లో ఎనఆర్‌జీఎస్‌, ఎస్‌డీఎఫ్‌ పథకం కింద  చెదళ్ల గ్రామంలో అప్పటి సర్పంచ గుర్రప్ప, ఎంపీటీసీ సభ్యుడు నారాయణస్వామి రూ.65 లక్షల వరకు పనులు చేపట్టారు. నాలుగేళ్లుగా బిల్లులు రాకపోవడంతో అప్పుల పాలయ్యారు. ప్రస్తుతం కోర్టు ఆదేశాలు మేరకు ప్రభుత్వం అందుకు సంబంధించి బిల్లులను గ్రామ పంచాయతీ అకౌంట్లలోకి జూలై 4న జమ చేసింది. అప్పటి నుంచి బిల్లులకు సంబంధించి చెక్కులను ఇవ్వకుండా సర్పంచ, పంచాయతీ కార్యదర్శి వేధింపులకు గురిచేస్తున్నారు. 


ఎమ్మెల్యే చెప్పిందంట..: బాధితులు

బిల్లులు ఇవ్వొద్దని ఎమ్మెల్యే చెప్పిందనీ, అందువలన ఇచ్చేది లేదని సర్పంచ చెప్పాడని బాధితులు గుర్రప్ప, నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లులు కోసం అధికారుల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నామన్నారు.  చేసిన పనులకు సంబంధించి ఎం బుక్స్‌, వర్క్‌ ఆర్డర్స్‌ అన్ని తీసుకెళ్లి  బిల్లులు ఇవ్వాలని పంచాయతీ కార్యదర్శి ప్రసాద్‌ను అడిగామన్నారు. నా చేతుల్లో ఏమి లేదు.. అంతా సర్పంచదే అని చెప్పారన్నారు. దీంతో వారు ఎంపీడీఓ తేజోత్సను ఆశ్రయించినా పట్టించుకో లేదన్నారు. గతంలో బిల్లులు పడినప్పుడు కూడా ఇవ్వకుండా వేధింపులకు గురి చేశారు.. తిరిగి మరోసారి ఇలాగే సతాయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Read more