దాసంపల్లిలో వివాహిత ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-10-03T06:07:18+05:30 IST

మండలంలోని దాసంపల్లిలో వివాహిత విజయలక్ష్మి (55) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది

దాసంపల్లిలో వివాహిత ఆత్మహత్య
విజయలక్ష్మి మృతదేహం

కంబదూరు (కళ్యాణదుర్గం రూరల్‌), అక్టోబరు 2: మండలంలోని దాసంపల్లిలో వివాహిత విజయలక్ష్మి (55) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. కళ్యాణదుర్గం రూరల్‌ ఏఎస్‌ఐ రామాంజనే యులు తెలిపిన మేరకు.. విజయలక్ష్మి భర్త  సోమనాథ్‌ ఏఆర్‌ ఏఎస్‌ఐగా విధులు నిర్వహించేవాడు. ఈయన నాలుగేళ్ల క్రితం గుండెపోటుతో మరణించాడు. వీరికి సురేష్‌ కుమార్‌, మనోజ్‌ ఇద్దరు కుమారులు. భర్త ఉద్యోగరీత్యా అనంతపురంలోనే విధులు నిర్వహిస్తూ అక్కడే ఉండేవారు. భర్త మృతి చెందినప్పటికీ విజయలక్ష్మి కూడా కొన్ని నెలల వరకు కుమారులతో కలిసి అనంత పురంలోనే ఉండేది. అయితే కుమారుల్లో ఒకరు గుండె పోటుతో, మరొకరు రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈక్రమంలో అనంతపురంలోనే ఉంటున్న ఇద్దరు కోడళ్లు పుట్టింటికి వెళ్లిపోయారు. దీంతో కొద్ది రోజుల పాటు అనంతపురంలోనే ఒంటిరిగా ఉన్న విజయలక్ష్మి కాశీకి వెళ్లి ఆత్మహత్యకు యత్నించింది. అయితే  అక్కడి పోలీసులు ఆమెను రక్షించి అనంతపురం పో లీసులకు అప్పగించారు. రెండు నెలల క్రితమే స్వగ్రామైన దాసంపల్లికి వచ్చింది. స్వగ్రామంలో దాసంపల్లిలో మరిది జగన్నాథ్‌తో కలిసి ఉండేది. మానసిక వేదన తాళలేక ఇంటిలోనే పురుగుల మందు తాగి శనివారం రాత్రి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన మరిది జగన్నాథ్‌ ఆదివారం తెల్లవారుజామున 108లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెం దినట్లు  నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. 


Read more