కష్టం చేసి.. లంచం ఇవ్వాలా?

ABN , First Publish Date - 2022-07-23T05:56:08+05:30 IST

‘కష్టపడి ఉపాధి పనులు చేస్తున్నాం. మా కూలి డబ్బులను ఇచ్చేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లంచం అడుగుతున్నాడు

కష్టం చేసి.. లంచం ఇవ్వాలా?
డ్వాక్రా రుణం సమస్యను ఎమ్మెల్యేకి వివరిస్తున్న పొదుపు మహిళ రత్నమ్మ

ఎమ్మెల్యేని నిలదీసిన ఉపాధి కూలీలు
సొంతపార్టీవారి నుంచీ పద్మావతికి ప్రశ్నల వర్షం
దిక్కుతోచక.. గడప గడప నుంచి
అర్ధంతరంగా వెనక్కు..
బుక్కరాయసముద్రం, జూలై 22:
‘కష్టపడి ఉపాధి పనులు చేస్తున్నాం. మా కూలి డబ్బులను ఇచ్చేందుకు ఫీల్డ్‌ అసిస్టెంట్‌ లంచం అడుగుతున్నాడు. కష్టం చేసి లంచం ఇవ్వాలా..?’ అని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతిని ఉపాధి కూలీలు నిలదీశారు.  గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కేకే ఆగ్రహారం పంచాయతీ పరిధిలోని సంజీవపురం గ్రామంలో ఎమ్మెల్యే శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఉపాధి కూలీలు ఎమ్మెల్యేని కలిశారు. ‘పనికి వెళ్లిన ఒక్కో కూలీ నుంచి రూ.300 వరకూ ఫీల్డ్‌ అసిస్టెంట్‌ నందీశ్వర్‌ అక్రమంగా వసూలు చేస్తున్నాడు’ అని గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి, అమర్‌నాథ్‌రెడ్డి, వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. ప్రశ్నించిన కూలీలకు పనులు కల్పించడం లేదని వాపోయారు. లంచం ఇవ్వని వారికి బిల్లులు పెండింగ్‌లో పెట్టాడని ఎమ్మెల్యేకి వివరించారు. కూలీల ప్రశ్నలతో ఎమ్మెల్యే దిక్కుతోచని స్థితిని ఎదుర్కొన్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పి ముందుకు వెళ్లారు. తమ సంఘం తరపున బ్యాంకు రుణం తీసుకుని తిరిగి చెల్లించామని, అయినా రుణం ఉన్నట్లు చూపుతున్నారని రత్నమ్మ అనే పొదుపు మహిళ ఎమ్మెల్యేకి తెలిపారు. గ్రామంలో డ్వాక్రా సంఘాల సమస్యల గురించి యానిమేటర్‌లు పట్టించుకోవడం లేదని అన్నారు.

కష్టపడేవారికి గుర్తింపు ఏదీ ?
గడప గడపలో ఎమ్మెల్యే పద్మావతికి సొంత పార్టీవారి నుంచే నిలదీతలు ఎదురవుతున్నాయి. గ్రామంలో ఉపాధి హమీ పథకం కింద చెట్లకు నీరు పోసినా ఇంతవరకూ బిల్లులు ఇవ్వడం లేదని, సొంత పార్టీ వారే అడ్డుకుంటున్నారని వైస్‌ సర్పంచ రాజు, ఆయన సోదరుడు చిన్నరాజు ఎమ్మెల్యే వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ కోసం రూ.వేలు ఖర్చు పెట్టామని, అయినా తమకు గ్రామ సచివాలయంలో ఒక్క పని కూడా జరగడం లేదని వాపోయారు. పార్టీకోసం కష్టపడిన తమకు అన్యాయం జరిగిందని అన్నారు. కాగా, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ కారణంగా పార్టీకి చెడ్డపేరు వస్తోందని, తొలగించాలని కొందరు వైసీపీ నాయకులే ఎమ్మెల్యేని కోరడం గమనార్హం. గ్రామంలోని పలువురు వైసీపీ నాయకులు వివిధ సమస్యలపై ఎమ్మెల్యేని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే అసంతృప్తితో గడప గడపను సగంలోనే ముగించి వెనుదిరిగారు.

Read more