ప్రేమించా మరి

ABN , First Publish Date - 2022-02-19T06:27:15+05:30 IST

ఆమెది గుంతకల్లు. వయసు 33. అతనిది ప్రకాశం జిల్లా ఒంగోలు. వయసు సుమారు 22. ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత చదువులకు వెళ్లాడు. ప్రాంతాలే కాదు.. వయసుల మధ్య కొంత దూరం ఉంది.

ప్రేమించా మరి

పెళ్లి చేయాలని సఖి సెంటర్‌లో యువతి గొడవ

ఆమెది గుంతకల్లు. వయసు 33. అతనిది ప్రకాశం జిల్లా ఒంగోలు. వయసు సుమారు 22. ఇప్పుడిప్పుడే డిగ్రీ పూర్తి చేసి, ఉన్నత చదువులకు వెళ్లాడు. ప్రాంతాలే కాదు.. వయసుల మధ్య కొంత దూరం ఉంది. ఫేస్‌బుక్‌ ఇద్దరినీ కలిపింది. దూరాలను చెరిపేసి దగ్గర చేసింది. ప్రేమ చిగురించింది. వీడియో చాటింగ్‌లు చేసుకున్నారు. కొన్నాళ్లు బాగా నడిచింది. ఇటీవల అతను ముఖం చాటేశాడు. దీంతో ఆమె ప్రియుడి కోసం ఒంగోలు వెళ్లి విచారించింది. పైచదువులకు విజయనగరం వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో నిరాశగా తిరిగొచ్చింది. తాను మోసపోయానని భావించింది. తనకు న్యాయం చేయాలని జిల్లా కేంద్రంలోని సర్వజన వైద్యశాలలో ఉన్న సఖి సెంటర్‌కు శుక్రవారం వచ్చింది. ఆమె సమస్యను తెలుసుకున్న సఖి సెంటర్‌ మేనేజర్‌ శాంతామణి, సిబ్బంది కౌన్సెలింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. వయసులో చిన్నవాడైన వ్యక్తితో ప్రేమను ఊహించుకోవడం సరికాదని సర్దిచెప్పారు. కానీ ఆమె వినిపించుకోలేదు. ‘అతన్ని నన్ను కలపమంటే.. వదిలేయమంటారే..’ అని పట్టరాని కోపంతో ఊగిపోయింది. ఆ తరువాత దూషించడం మొదలు పెట్టింది. చనిపోతానని బెదిరించింది. దీంతో సఖి సెంటర్‌ సిబ్బంది ఆమె తల్లిదండ్రులను పిలిపించారు. వారిద్వారా చెప్పించినా వినుకోలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయాలని, ఆ అబ్బాయిని పిలిపించి విచారిస్తారని సిబ్బంది సూచించారు. అందుకు ఆమె ఒప్పుకోలేదు. ఆ అబ్బాయిపై కేసు పెట్టకూడదని, కొట్టకూడదని అంది. తనతో పెళ్లి మాత్రం చేయించాలని కోరింది. దీంతో దిక్కుతోచని సఖి సెంటర్‌ సిబ్బంది దిశ పోలీస్‌ స్టేషన డీఎస్పీ శ్రీనివాసులుకు సమాచారం ఇచ్చారు. ఆయన వచ్చి, విషయం అడిగి తెలుసుకున్నారు. అప్పటికీ ఆమె మొండిపట్టు వీడలేదు. చేసేదిలేక గుంతకల్లు పోలీసులకు సమాచారం అందించారు. వారువచ్చి ఆమెను వాహనంలో గుంతకల్లుకు తీసుకెళ్లారు.

- అనంతపురం వైద్యం

Read more