కుంటపై కన్నేశారు..!

ABN , First Publish Date - 2022-11-07T23:49:13+05:30 IST

రూ.కోట్ల విలువచేసే కుంట కబ్జాకోరల్లో చిక్కుకుంది.

కుంటపై కన్నేశారు..!

- కోట్ల విలువైన భూమిలో రెవెన్యూ కుటుంబం పాగా

- చింత వనంలో ప్లాట్లకు ప్లాన

- అది కుంటే అంటున్న ఇరిగేషన అధికారులు

- డైక్లాట్‌లో లేదంటున్న రెవెన్యూ వర్గాలు

హిందూపురం/గోరంట్ల, నవంబరు 7: రూ.కోట్ల విలువచేసే కుంట కబ్జాకోరల్లో చిక్కుకుంది. ఓ రెవెన్యూ అధికారి కుమారుడు, మరో ముగ్గురు కలిసి, చింతవనంలోనే ప్లాట్లకు ప్లాన వేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరాలుగా ఉన్న కుంటను కబ్జా చేసేందుకు మాస్టర్‌ ప్లాన వేశారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒకప్పుడు ఊరిలోని పశువులకు గ్రాసం, నీరు ఇచ్చిన కుంట ను ఇప్పుడు కబ్జారాయుళ్లు మింగేస్తున్నారు. అది కుంటేనని నీటి పారుదల శాఖాధికారులు నొక్కి వక్కాణిస్తుంటే.. రెవెన్యూ వర్గాలు మాత్రం డైక్లాట్‌లో కుంటేలేదని చెబుతుండడం గమనార్హం. ఏకంగా చెక్కుబందులు మార్చి, హద్దులు చెరిపి, కుంటను కాజేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భూమి విలువ పెరగడంతో..

గోరంట్ల మండలం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోంది. నూతన రహదారుల ఏర్పాటు, ఉన్నవాటి విస్తరణతో మండలంలో భూముల ధరలకు రెక్కలొచ్చాయి. మండలంలోని సాములపల్లి సమీపాన గల వెంకటప్ప కుంటపై పక్కన పొలం కొనుగోలు చేసినవారి కన్ను పడింది. 14.61 ఎకరాల్లో కుంట విస్తరించి ఉంది. ఇక్కడ ప్రస్తుతం భూమి విలువ ఎకరా రూ.1.5కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు పలుకుతోందంటే అతిశయోక్తికాదు. అలాంటి భూమిని కొంతమంది హద్దులు చెరిపి కబ్జాకు పాగా వేశారు. కుంట భూమిని మిలిటరీ జవానుకు ఎలా ఇచ్చారనీ, దానిని ఓ రెవెన్యూ అధికారి కుటుంబ సభ్యులు ఎలా కొనుగోలు చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విలువైన భూమి కావడంతోనే హద్దులు చెరిపి కుంటలోకి మట్టితోలి, చదును చేస్తున్నారని ఆ గ్రామ రైతులు ఆరోపిస్తున్నారు.

చెక్కుబందులు సడలించి..?

సాములపల్లి సమీపాన సర్వే నెంబరు 153-2లోని 4.5 ఎకరాల భూమికి గతంలో ప్రభుత్వం.. మిలిటరీ రిటైర్డ్‌ ఉద్యోగి పొప్పనపల్లి తాండాకు చెందిన రవికుమార్‌ నాయక్‌కు పట్టా ఇచ్చింది. రవికుమార్‌ నాయక్‌కు డి పట్టా నెంబరు 26/1420తో 2010 డిసెంబరు 24న కేటాయించింది. దీనిని ఆయన 2022 ఫిబ్రవరి 8న బుక్కరాయమసముద్రం మండలం సిద్దరాంపురానికి చెందిన లక్ష్మీరెడ్డి కుమారుడు శ్రీరామిరెడ్డి, అనంతపురం నివాసి గతంలో ఇక్కడ పనిచేసిన తహసీల్దార్‌ రామాంజినేయరెడ్డి కుమారుడు కేదరినాథ్‌రెడ్డి, నల్లమాడ మండలం రాగానిపల్లికి చెందిన క్రిష్ణారెడ్డి కుమారుడు జనార్దనరెడ్డికి విక్రయించారు. ఆ భూమికి సంబంధించి చెక్కుబందుల ప్రకారం తూర్పున డొంక ఆంజనేయులు, నారాయణరెడ్డి పొలాలు, పడమర కుంట, ఉత్తరాన కదిరి-హిందూపురం ప్రధాన రహదారి, దక్షిణాన బండ ఉన్నట్లు రిజిస్ట్రేషన పత్రాల్లో పొందుపరిచారు. ఆ భూమి కొనుగోలు చేసిన వ్యక్తుల పలుకుబడి, అధికారం ఉపయోగించి చెక్కుబందులు సడలింపు చేసుకుని, వారికి ఇచ్చిన భూమి కాకుండా చదునుగా ఉన్న కుంట ప్రాంతానికి మట్టిని తోలి చదును చేసేందుకు యత్నించారు. వారికి గతంలో ఇచ్చిన రికార్డుల ప్రకారం దక్షిణం వైపు బండ ఉంది. ప్రస్తుతం వారు చదును చేయడానికి మట్టితోలిన ప్రాంతంలో దక్షిణం వైపు కుంట ఉంది. ఇక్కడే అనుమానాలు తలెత్తుతున్నాయి. వారు మట్టితోలిన ప్రాంతంలో చింతచెట్లు నాటిన ఆనవాళ్లున్నాయి. అలాంటపుడు ఇక్కడ పట్టా ఎలా ఇచ్చారన్నది ప్రశ్నార్థకం. వారికి ఇచ్చిన భూమికాకుండా దిగువ ప్రాంతమైన కుంటలోకి ప్రవేశించి, కబ్జాకు యత్నిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని రైతులు వాపోతున్నారు.

రెవెన్యూ కుటుంబం పాగా..

అక్కడ పనిచేసిన రెవెన్యూ అధికారి కుటుంబ సభ్యులు సదరు భూమిని ఈ ఏడాది ఫిబ్రవరిలో కొనుగోలు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. రోడ్డుకు ఆనుకుని ఉండటంతోపాటు పారిశ్రామికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతోంది. హిందూపురం-కదిరి ప్రధాన రహదారి ఉండటంతోపాటు అర కిలోమీటరు దూరంలో 44వ నెంబరు జాతీయ రహదారి ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూమి విలువ పెరుగుతుందనే ఉద్దేశంతో కొనుగోలు చేసినట్లు తెలుసోంది. వారు కొనుగోలు చేసిన 4.5 ఎకరాల్లో 1.5 ఎకరాల్లో బండ ఉంది. దీంతో వారు ఆ బండ ప్రాంతాన్ని వదిలేసి, పక్కనే ఉన్న కుంటలోకి చొరబడినట్లు తెలుస్తోంది. అందులో మట్టి తోలి, కుంటను చదును చేసి, తాము కొనుగోలు చేసిన భూమిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. కుంటలోని 14.61 ఎకరాల్లో మూడెకరాలకుపైగా తమదని రికార్డులు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈలెక్కన ఇక్కడ ఎకరా రూ.1.5 కోట్లు పలుకుతుందనుకున్నా.. మూడెకరాలకు రూ.5 కోట్లయినా దోచుకోవచ్చన్న ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

చింత వనం భూమిలో ప్లాట్లు

20 ఏళ్ల క్రితం ఉమ్మడి అనంతపురం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సోమే్‌షకుమార్‌ అప్పట్లో ఈ కుంటలో చింతతో నిశ్చింత కార్యక్రమం కింద చింతచెట్లు నాటించారు. ఇప్పటికీ చింతచెట్లు ఈ కుంటలో ఉన్నాయి. అలాంటి భూమిని ప్లాట్లుగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు. కొన్ని చింతచెట్లను నరికి, కాల్చేసినట్లు సమాచారం. ఇక్కడ చింతచెట్లు ఉంటే ఎవరైనా ప్రశ్నిస్తారన్న ఉద్దేశంతో వాటిని ఒక్కొక్కటిగా నరికేసి, ఆనవాళ్లు లేకుండా చేయడానికి ప్రయత్నించారని సాములపల్లి గ్రామస్థులు అంటున్నారు.

అది కుంటే...

డైక్లాట్‌లో అక్కడ కుంట లేదని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. అసెస్మెంట్‌ ల్యాండ్‌ అంటున్నారు. ఇరిగేషన అధికారులు మాత్రం దానిని వెంకటప్ప కుంట అనీ, చిన్నకుంట అని కూడా పిలుస్తారని పేర్కొంటున్నారు. తమ వద్ద ఉన్న సమాచారం ప్రకారం అది కుంటేనని స్పష్టం చేస్తున్నారు. ఆ సర్వే నెంబరులో 14.61 ఎకరాలు కుంట భూమి ఉందనీ, అదే మొత్తంలో కుంట కింద ఆయకట్టు భూమి కూడా ఉందన్నారు.ఏళ్లుగా గ్రామ సమీపాన వెంకటప్ప కుంట ఉందని సాములపల్లి వాసులు చెబుతున్నారు. తమ చిన్నతనం నుంచి ఆ కుంటలో నీరు ఉందనీ, ఇప్పుడు కూడా వర్షం వస్తే కుంటలోకి నీరు చేరుతోందని గ్రామానికి చెందిన వృద్ధులు వివరిస్తున్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా మరువ ఉన్నచోట రంధ్రం పెట్టడంతో నీరు నిల్వ ఉండట్లేదని చెబుతున్నారు. పశువులకు ఎండాకాలంలో కూడా ఆ కుంటలో నీరు దొరికేవని గ్రామస్థులు అంటున్నారు.

రెవెన్యూ అధికారులకు నివేదిక పంపుతాం..

-గోపి, ఇరిగేషన డీఈ, పెనుకొండ

సాములపల్లి సమీపాన గల కుంటలో మట్టి తోలి చదును చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. వారు పట్టా ఉందని చెబుతున్నారు. ఒకవేళ పట్టా ఇచ్చి ఉన్నా పంటలు పెట్టుకోవడానికి తప్ప.. వ్యవసాయేతర పనులకు కేటాయించే అవకాశం లేదు. అలాంటపుడు మట్టిని ఎందుకు తోలారో తెలియడం లేదు. దీనిపై రెవెన్యూ అధికారులకు నివేదిక పంపుతున్నాం. వారిచ్చే నివేదిక మేరకు తదుపరి చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే ఇరిగేషన ఏఈని పంపి, హద్దుల రాళ్లు నాటించేందుకు ప్రయత్నిస్తున్నాం.

Updated Date - 2022-11-07T23:49:13+05:30 IST

Read more