-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Lepakshi Hub is a direct fight for farmers-NGTS-AndhraPradesh
-
లేపాక్షి హబ్ రైతుల కోసం ప్రత్యక్ష పోరాటం
ABN , First Publish Date - 2022-09-08T05:39:29+05:30 IST
జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ బాధిత రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యక్ష పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ పేర్కొన్నారు.

మాధవ్ న్యూడ్ వీడియోపై
ఎస్పీ మాటలు విడ్డూరం : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ
అనంతపురం విద్య, సెప్టెంబరు 7 : జిల్లాలోని లేపాక్షి నాలెడ్జ్ హబ్ బాధిత రైతులకు న్యాయం జరిగేలా ప్రత్యక్ష పోరాటం చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామ కృష్ణ పేర్కొన్నారు. లేపాక్షి ప్రాంతంలోని రూ.10 వేల కోట్ల విలువైన 8,844 వేల ఎకరాలను రూ.500 కోట్లకు కొల్లగొట్టాలని చూస్తున్నా రంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. లేపాక్షి నాలెడ్జ్ హబ్ రైతులను సమీకరించి, న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కమ్యూనిస్టు పార్టీ అండగా ఉంటుందని, వారి తరపున ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని ప్రకటించారు. బుధవారం జిల్లాకు వచ్చిన ఆయన సీపీఐ నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా 3వ సారి ఎంపిక కావడంతో సీపీఐ రాష్ట్ర కార్యవర్గసభ్యులు జగదీష్, జిల్లా కార్యదర్శి జాఫర్ ఇతర నాయకులు ఆయనను సత్కరించారు. 24వ జాతీయ మహాసభల నేపథ్యంలో ఆ పార్టీ ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కార్యదర్శి శ్రీరాములు అధ్యక్షతన సీపీఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్రం నాశనమైందన్నారు. సీఎం తాడేపల్లి ప్యాలెస్ దాటి రావడం లేదని ఆగ్రహం చేశారు. ముఖ్యమంత్రి తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారన్నారు. బీజేపీతో ఉంటేనే జగన్‌కు సీఎం కుర్చీ ఉంటుందని, లేదంటే అథోగతేనంటూ ఎద్దేవా చేశారు. పోలవరం పూర్తి చేస్తామని గొప్పలు చెప్పారని, ఇద్దరు నీళ్ల మంత్రులు మారినా...ఇసుమంతైనా పనులు ముందుకు సాగడం లేదని చురకలంటించారు. ప్రధాని మోదీ పాలనకు చరమ గీతం పాడాలంటే... అన్ని రాజకీయ, ప్రజా సంఘాలు ఏకం కావాలని, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు వేగవంతం చేయాల్సి ఉందన్నారు. అక్టోబర్ 14 నుంచి 18 వరకూ జరిగే జాతీయ మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపుచ్చారు. ఎంపీ మాధవ్‌వీడియోను దేశమంతా ఒరినల్ అంటుంటే...ఎస్పీ ఫక్కీరప్ప ఫేక్ వీడియో అంటూ మీడియా ఎదుట ప్రకటించడం విడ్డూరంగా ఉందని విమర్శలు గుప్పించారు. కార్యకమంలో ఆ సంఘం జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, సీనియర్‌నాయకులు రమణ, జిల్లా కార్యవర్గసభ్యులు సంజీవప్ప, రాజారెడ్డి, పలు నియోజకవర్గ కార్యదర్శులు రామకృష్ణ, గోపాల్, నాగార్జున, మల్లికార్జున, నారాయణస్వామి, రంగయ్య, ఇతర నాయకుల కేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.