విన్నారా.. ఈ కథను..!

ABN , First Publish Date - 2022-10-01T05:45:14+05:30 IST

అధికార పార్టీ నాయకులా.. మజాకానా.. తాము కొనుగోలు చేసిన భూమికి రోడ్డు కోసం ఏకంగా కొండను తొలిచేశారు.

విన్నారా..  ఈ కథను..!
కొండను తొలచిన దృశ్యం

అధికార పార్టీ అండతో బరితెగింపు

తామే వేయించామంటూ రెవెన్యూ అధికారుల కలరింగ్‌

ఎక్స్‌కవేటర్‌ యజమానులు స్వచ్ఛందంగా వేశారట..!


పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి


అధికార పార్టీ నాయకులా.. మజాకానా.. తాము కొనుగోలు చేసిన భూమికి రోడ్డు కోసం ఏకంగా కొండను తొలిచేశారు. రోడ్డు వేసేసుకున్నారు. అడ్డు వచ్చిన అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తూ పావుగా వాడుకుంటున్నారు. అది ఎంతలా అంటే.. ఆ రోడ్డు తామే వేయించామని అధికారులు చెప్పుకునేలా. పుట్టపర్తి పరిధిలోని బీడుపల్లి పొలంలో కొండను తొలచి, రోడ్డు వేయడం, అధికారులు ఆ నెపాన్ని తమపై వేసుకోవడం ఓ కట్టుకథను తలపిస్తోందని స్థానికులు చర్చించుకుంటున్నారు.


అధికార పార్టీ నాయకులా.. మజాకా..

పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయడంతో చుట్టూ భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇటీవల ప్రభుత్వ, కొండగుట్ట, పోరంబోకు భూముల పక్కనే ఉన్న భూములను కొనుగోలు చేసి, సర్కారీ వాటిని కలిపేసుకునే మాఫియా పుట్టుకొచ్చింది. ఈ నేపథ్యంలో పుట్టపర్తి నగర పంచాయతీ పరిధి సూపల్‌స్పెషాలిటీ ఆస్పత్రి ప్రధాన రహదారి నుంచి బీడుపల్లికి వెళ్లే దారిలో సర్వే నెంబరు 5-11లో అసైన్డ భూమి ఉంది. అక్కడే ఉన్న కొండ వెనుక ఇటీవల అధికార పార్టీకి చెందిన సీఎంవోలో పనిచేస్తున్న ఓ మాజీ విద్యాధికారి కుమారుడితోపాటు పుట్టపర్తికి చెందిన ముగ్గురు రియల్టర్లు కలిసి 10 ఎకరాలకుపైగా ప్రైవేటు పట్టా భూములను కొనుగోలు చేశారు. ఆ భూముల్లోకి వెళ్లేందుకు దారిలేకపోవడంతో సీఎంవో నుంచి ఒత్తిడి తీసుకొచ్చి, ముందు చిన్నగుట్టను తవ్వి, రోడ్డు ఏర్పాటుకు స్కెచ వేశారు. బీడుపల్లికి వేళ్లే ప్రధాన రహదారి నుంచి కొండను తొలిచారు. కొండను తవ్వే పనులపై బీడుపల్లి వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై అధికార పార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి వద్ద పంచాయితీ నడిచినట్లు తెలుస్తోంది. వెంటనే అధికార పార్టీ ప్రజాప్రతినిధి ఒత్తిడితో రెవెన్యూ అధికారులు రంగం ప్రవేశం చేసి, రోడ్డు పనులకు గ్రీనసిగ్నల్‌ ఇచ్చారు. ఇంకేముంది రాత్రింబవళ్లు పనిచేసి, అర కిలోమీటరు కొండను తొలగించి, రోడ్డు వేసుకున్నారు. ఓ రెవెన్యూ ఇనస్పెక్టర్‌ దగ్గరుండి పనులు చేయించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొండను తవ్వి, రోడ్డు వేయడంతో ఎకరా రూ.లక్షల్లో కొనుగోలు చేసిన భూములు ఇప్పుడు రూ.కోట్లలో పలుకుతున్నాయి. పుట్టపర్తి పరిధిలో ప్రభుత్వ, అసైన్డ, పోరంబోకు, మిగులు భూములు, వాగులు, వంకలు, కొండ, గుట్టల ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు ఇటీవలిగా నోటీసులు జారీ చేస్తున్నారు. ఆ భూములను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిస్తున్నారు. ఏకంగా కొందరు అధికార పార్టీ నాయకులు, రియల్టర్లు కొండనే తవ్వేసి, రోడ్డు వేసుకుంటే చర్యలు చేపట్టాల్సిన రెవెన్యూ అధికారులు తామే వేయించామని మీద వేసుకోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ కొండలను తవ్వేసి, రోడ్లు వేసుకుంటున్నా భూరాబందులకు అధికార యంత్రాంగం సహకారం అందిస్తుండడం శోచనీయం.


స్వచ్ఛందంగా..!

కొండను తవ్వేసి, రోడ్డు వేయడం వెనుక పెద్ద తతంగమే నడిచిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైవేటు వ్యక్తులు కొండను తవ్వేసి, రోడ్డు ఏర్పాటు చేస్తే రెవెన్యూ అధికారులు తామే వేసినట్లు కలరింగ్‌ ఇస్తున్నారని చర్చ సాగుతోంది. ఇటీవల కొండ పక్కన మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్‌కు 50 సెంట్లు కేటాయించినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎంఐజీ లేఔట్‌కు ప్రతిపాదన పంపామంటున్నారు. ఈ భూమిలోకి వెళ్లేందుకు దారి లేకపోవడంతో కొందరు ఎక్స్‌కవేటర్‌ యజమానులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి, రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు వెనకేసుకొస్తుండడం గమనార్హం. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లతోనే అధికారులు తమపై నెపం వేసుకున్నట్లు తెలుస్తోంది.


ఎక్స్‌కవేటర్ల యజమానులే రోడ్డు వేశారు..

బీడుపల్లి పొలం సర్వే నెంబరు 5-11లో 8.45 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇటీవల మల్టీపర్పస్‌ స్పెషాలిటీ సెంటర్‌కు 50 సెంట్లు కొండ పక్కన కేటాయించాం. ఎంఐజీ లేఔట్‌కు ప్రతిపాదనలు పంపాం. ఈ భూమిలోకి దారికోసం ఓవైపు గుట్టను తవ్వి, రోడ్డు ఏర్పాటు చేశాం. అది కూడా కొందరు ఎక్స్‌కవేటర్‌ 

యజమానులు స్వచ్ఛందంగా వచ్చి, రోడ్డు పనులు చేశారు. రోడ్డు ఏర్పాటులో ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం లేదు. రాజకీయ ఒత్తిళ్లు లేవు.

భాస్కరనారాయణ, తహసీల్దార్‌, పుట్టపర్తి


Read more