కంచేలు

ABN , First Publish Date - 2022-05-24T05:41:29+05:30 IST

కొత్తగా ఏర్పాటైన శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకతో పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. అత్యధికంగా వర్షాఽధార భూములే కనిపిస్తాయి.

కంచేలు

రోజురోజుకీ పెరుగుతున్న ధరలు

కొనుగోలుకు ఎగబడుతున్న బడా రియల్టర్లు

రైతులకు దళారులతో గాలం

వేలాది ఎకరాలు ఇప్పటికే హస్తగతం

కంచెలు ఏర్పాటు చేస్తున్న వైనం 



కియ పరిశ్రమ ఏర్పాటైంది. బెల్‌, నాసెన ఏర్పాటు దిశగా చర్యలు మొదలయ్యాయి. పుట్టపర్తి జిల్లా కేంద్రమైంది. జాతీయ రహదారిని విస్తరిస్తున్నారు. హంద్రీనీవా కాలువ పనులు జరుగుతున్నాయి. ఇలా కొత్త జిల్లా అంతటా భూములకు డిమాండ్‌ భారీగా పెరుగుతోంది. క్యాష్‌ చేసుకునేందుకు రియల్టర్లు  వాలిపోతున్నారు. బడా వ్యాపారులు వచ్చేస్తున్నారు. ఎక్కడైనా సరే.. ఇంత భూమి కొందామని తాపత్రయ పడుతున్నారు. దళారుల సాయంతో శోధిస్తున్నారు. రైతులకు గాలం వేసి.. భూములు ఎడాపెడా కొనేస్తున్నారు. ఇప్పటికే వేల ఎకరాలు వ్యాపారుల వశమయ్యాయి. వాటికి కంచెలు వేసేస్తున్నారు..


పుట్టపర్తి, ఆంధ్రజ్యోతి

కొత్తగా ఏర్పాటైన శ్రీసత్యసాయి జిల్లా కర్ణాటకతో పొడవైన సరిహద్దును పంచుకుంటోంది. అత్యధికంగా వర్షాఽధార భూములే కనిపిస్తాయి. ఏడాదిలో నాలుగైదు మంచి వర్షాలు కురిస్తే తప్ప పంటలు పండే పరిస్ధితి లేదు. ఫలితంగా ఎక్కువశాతం బీడు భూములే దర్శనమిస్తాయి. అతివృష్టి, అనావృష్టి వల్ల పంట చేతికి అందక రైతులు అప్పులు మూటగట్టుకుంటున్నారు. పంట పెట్టాలంటేనే జంకాల్సిన పరిస్థితి జిల్లా రైతన్నది.


పారిశ్రామికాభివృద్ధికి శ్రీకారం

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి చేయాలన్న ముందుచూపుతో ఎన్టీఆర్‌ 1985లో తూమకుంట పారిశ్రామిక వాడకు శ్రీకారం చుట్టారు. టీడీపీ హయాంలో కియ పరిశ్రమతోపాటు అనుబంధ సంస్థలను పెనుకొండకు తీసుకొచ్చారు. జాతీయ రహదారి పాలసముద్రం వద్ద కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన బెల్‌, నాసెన వచ్చాయి.దీనికితోడు హంద్రీనీవా పరిధిలో మడకశిర ఉప కాలువతోపాటు జీడిపల్లి నుంచి పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాల మీదుగా మారాల, చెర్ల్లోపల్లి వద్ద రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటుతోపాటు 44వ జాతీయ రహదారిని ఆరు వరుసలకు విస్తరణ, జిల్లా మీదుగా గ్రీనఫీల్డ్‌ హైవే మంజూరుతోపాటు పలు రహదారుల విస్తరణకు ప్రతిపాదనలు చేశారు. ఈ నేపఽథ్యంలో కర్ణాటకతోపాటు తెలంగాణ, ఏపీలోని పలు జిల్లాల రియల్టర్లు, బడా వ్యాపారులు వ్యవసాయ భూములపై కన్నేశారు. ఇప్పటికే పట్టణాలు దాటి ప్రస్తుతం మారుమూల గ్రామాల్లో పాగా వేసే స్థాయికి వచ్చింది. రైతుల నుంచి భూములు కొనుగోలు చేయడం, వాటికి చుట్టూ కంచె ఏర్పాటు చేసి భద్రం చేస్తున్నారు. ఇలా జిల్లావ్యాప్తంగా గ్రామీణ, ప్రధాన రహదారుల్లో ఎటుచూసినా ఎక్కువభాగం భూములు బడావ్యాపారుల చేతుల్లోకి వెళ్లి, కంచెల నడుమ దర్శనమిస్తున్నాయి. పదేళ్ల కిందట ఉమ్మడి జిల్లాలోకి అడుగుపెట్టిన కర్ణాటక, ఢిల్లీ, పంజాబీల నుంచి వివిధ రాష్ట్రాల రియల్‌ వ్యాపారులు కొత్త జిల్లాలో పాగా వేశారు. తాజాగా భూముల అన్వేషణ మరింత పెంచారు.


వ్యవసాయ భూముల వేట

పదిహేనేళ్ల కిందటే ఉమ్మడి జిల్లాలో పంజాబీలు, బెంగళూరు, ఢిల్లీ, హర్యానా, కర్ణాటక ప్రాంతాల నుంచి వచ్చిన రియల్టర్లు ఇక్కడ దళారులను నియమించుకుని ఇప్పటికే వేలాది ఎకరాలు కొనుగోలు చేశారు. అప్పట్లో ఎకరా రూ.12వేలకు కొనుగోలు చేయగా.. అవే భూములు నేడు ఎకరా రూ.30 లక్షల నుంచి రూ.50 లక్షలు దాటి.. రూ.కోట్లు పలుకుతున్నాయి. ఇలా రొద్దం, సోమందేపల్లి, పరిగి, పెనుకొండ, గోరంట్ల, చెన్నేకొత్తపల్లి, రామగిరి, మడకశిర, కనగానపల్లి మండలాల్లో 60 వేల ఎకరాలకుపైగా భూములను  రైతుల నుంచి కారుచౌకగా కొనుగోలు చేశారు. ఇందులో ప్రధానంగా రొద్దం మండలంలోని జక్కలచెరువు, నారనాగేపల్లి, కంబాలపల్లి, శాపురం, పెద్దిపల్లి, చోళేమర్రి, ఎల్‌జిబి నగర్‌ ప్రాంతాల్లో 3 వేల ఎకరాలు కొనుగోలు చేశారు. ఈ భూముల్లో ప్రస్తుతం ప్లాట్లు వేసి, అధునాతన సౌకర్యాలు కల్పించి సెంటు రూ.2 లక్షల చొప్పున విక్రయిస్తున్నారు. పరిగి మండలంలో వన్నంపల్లి, పైడేటిలో 130 ఎకరాలు, సోమందేపల్లి మండలం పందిపర్తి వద్ద కంట్రీక్లబ్‌ కోసం పదేళ్ల క్రితమే 900 ఎకరాలు కొనుగోలు చేశారు. చిలమత్తూరు, గోరంట్ల, లేపాక్షి, మడకశిర, అమడగూరు, తనకల్లు, నల్లచెరువు, కదిరి, నల్లమాడ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములు రైతుల నుంచి రియల్‌ చేతుల్లోకి వెళ్లిపోయాయి. చిలమత్తూరు మండలంలో సగం భూములు రైతుల చేజారిపోయాయి. నాలుగేళ్ల క్రితం నుంచి పెనుకొండలో కియ కార్లతోపాటు అనుబంధ సంస్థల రాక, పాలసముద్రం వద్ద నాసెన, బెల్‌, కొడికొండ చెక్‌పోస్టు నుంచి అగళి వరకు జాతీయ రహదారి విస్తరణ, పెనుకొండ, హిందూపురం, పట్టపర్తి, మడకశిర, కదిరి నియోజకవర్గాల్లో పలు చెరువులకు హంద్రీనీవా జలాల రాకతో రియల్‌ భూం వచ్చింది. ఈ నేపఽథ్యంలో తెలుగు రాష్ర్టాలు, తమిళనాడు, కర్ణాటకతోపాటు దక్షిణ కొరియన్లు సైతం భూములు కొనుగోలు చేస్తున్నారు. మారుమూల ప్రాంతంలో ఎకరం రూ.20 లక్షలు మొదలుకుని పట్టణ, పారిశ్రామిక ప్రాంతాల్లో మూడు, నాలుగు కోట్ల వరకు కొనుగోలు చేశారు. ఇలా పెనుకొండ, సోమందేపల్లి, రొద్దం, లేపాక్షి, చిలమత్తూరు, హిందూపురం, మడకశిర, పుట్టపర్తి, గోరంట్ల, ధర్మవరం, బత్తలపల్లి, కదిరి, కొత్తచెరువు ప్రాంత రహదారుల్లో అత్యధిక భాగం వ్యవసాయ భూములు బడావ్యాపారుల చేతుల్లోకి వెళ్లిపోయి, కంచెలతో దర్శనమిస్తున్నాయి.


దళారులతో రైతుకు గాలం

పరిశ్రమల ఏర్పాటు నేపథ్యంలో జిల్లాలోని భూములపై పలు రాష్ట్రాలకు చెందిన రియల్టర్లు కన్నేశారు. ఈ నేపథ్యంలో దళారులతో గాలం వేసి, మంచి ధర ఇప్పిస్తామని పట్టణ, గ్రామీణ రహదారుల వెంబడి ఉన్న భూములను కొనేస్తున్నారు. పెనుకొండ, చిలమత్తూరు, హిందూపురం, కదిరి, బుక్కపట్నం, మడకశిర సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయాలు వ్యవసాయ భూములను కొనే రియల్టర్లు, దళారులతో కిటకిటలాడుతున్నాయి. రైతుల వద్దకు నేరుగా రియల్టర్లు రాకున్నా.. దళారులే భూముల ధరల ఒప్పందం కుదుర్చుకుని, కమీషన్ల రూపంలో భారీగా నొక్కేస్తున్నారు. ఆరంభంలో తక్కువకు రైతుల నుంచి కొనుగోలు చేసిన భూములను చదును చేసి, ముళ్ల కంచె వేసి, బోరుబావులు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి గ్రామంలో పదుల సంఖ్యలో దళారులు పుట్టుకొచ్చి, రైతుల నుంచి భూములను సేకరించి రియల్టర్లకు కట్టబెడుతున్నారు. నగరాలకు చెందిన పెద్దపెద్ద రియల్టర్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో కారుచౌకగా దొరికే భూములపై కన్నేసి, వేలాది ఎకరాలను కూడగట్టుకుంటున్నారు. పరిశ్రమల రాకతోపాటు, పండ్లతోటల సాగుకు అనువైన భూములు కావడంలో భవిష్యత్తులో వీటి ధరలు నగరాలతో సమానంగా పలికే అవకాశాలున్నాయి. కొందరు దళారులు ఏకంగా రైతుల నుంచి విక్రయం అగ్రిమెంట్లు పొంది, తిరిగి రియల్టర్లకు అమ్మేస్తున్నారు. ఇలాగే కొనసాగితే జిల్లాలో భూములన్నీ ఇతర ప్రాంతాల వారి చేతుల్లోకి వెళ్లి, రైతులంతా కూలీలుగా మారే పరిస్థితులు దాపురించే ప్రమాదం ఉంది.


రైతుల్లో ఆవేదన

గ్రామీణ ప్రాంతాల్లో సైతం భూముల విలువలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. నాడు రూ.వేలల్లో ఉన్న భూములు నేడు రూ.లక్షల్లోకి చేరిపోయాయి. భవిష్యత్తులో పారిశ్రామిక కారిడార్‌గా అవతరిస్తుందన్న ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇప్పటికే జిల్లాకు గాలిమరలు, సోలార్‌, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేటు పరిశ్రమలు వస్తున్నాయి. జిల్లా పునర్విభజన తరువాత కొత్త జిల్లా భూములపై కర్ణాటక రియల్‌ వ్యాపారులు మక్కువ చూపుతున్నారు. ఐదారేళ్లుగా వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరుగుతున్నాయి. కళ్లెదుటే నాడు రూ.లక్షలు పలికిన భూములు నేడు రూ.కోట్లు చేస్తున్నాయి. దీంతో భూములు పొగొట్టుకున్న రైతులు ఆవేదన చెందుతున్నారు.


Updated Date - 2022-05-24T05:41:29+05:30 IST