ఉమ్మడి సేద్యం.. బీడు భూముల సస్యశ్యామలం

ABN , First Publish Date - 2022-03-23T06:04:52+05:30 IST

కరువు నేలలో మెట్ట సాగును జయించిన అన్నదమ్ముల ఉమ్మడి సేద్యమిది. కాసిన్ని నీటిని ఒడిసిపట్టి బీడు భూమిలో పారించారు.

ఉమ్మడి సేద్యం.. బీడు భూముల సస్యశ్యామలం
కళకళలాడుతున్న మల్బరీ పంట

పరిగి, మార్చి 22: కరువు నేలలో మెట్ట సాగును జయించిన అన్నదమ్ముల ఉమ్మడి సేద్యమిది. కాసిన్ని నీటిని ఒడిసిపట్టి బీడు భూమిలో పారించారు. పచ్చని పైర్లతో సస్యశ్యామలం చేశారు. వీరి కష్టానికి ఆర్డీటీ చేయూతనివ్వడంతో ఉమ్మడి సాగులో ఆదర్శంగా నిలిచారు. పరిగి మండలం యర్రగుంట పంచాయతీ తిరుమలదేవరపల్లికి చెందిన  గుర్రప్ప, పెద్దమారెప్ప, చిన్నమారెప్ప అన్నదమ్ములు. ఈకుటుంబానికి 15 ఎకరాల మెట్ట భూమి ఉంది. ఉన్న భూమిని ముగ్గురూ పంచుకున్నారు. కొన్నాళ్లు మెట్ట సేద్యం చేసి నష్టాలను చూశారు. ఈక్రమంలో ఉమ్మడిగా బోరుబావి తవ్వించి సాగుచేయాలని సంకల్పించారు. బోరు వేస్తే చుక్కనీరు రాలేదు. దీంతో ముగ్గురు అన్నదమ్ములు వెన్నుచూపలేదు. ఉపాధి పనులు, ఇతరత్రా పనులు చేసుకుంటూ కొంత సొమ్మును వెనకేసుకున్నారు. ఇదే పట్టులో ఏకంగా 14 బోర్లు తవ్వించినా గంగమ్మ తల్లి కనికరించలేదు. అప్పటికే రూ.4.50 లక్షల వరకు అప్పులపాలయ్యారు. చివరి ప్రయత్నంగా 15వ బోరులో నీరు ఉబికి వచ్చింది. తమ కష్టాలు తీరుతాయని సంతోషించారు. అంతలోనే సేద్యానికి అడుగుపెట్టేందుకు కొత్తగా కరెంటు కష్టం ఎదురైంది. విద్యుత సరఫరా లేక దిగాలుపడుతున్న తరుణంలో వీరి కష్టాలను చూసిన ఆర్డీటీ ముగ్గురు అన్నదమ్ములకు అండగా నిలిచింది. ఉమ్మడిగా సోలార్‌ పంపుమోటారును ఉచితంగా అందజేసింది. ఇక అంతే... భూమి తల్లిని నమ్ముకున్న అన్నదమ్ములు ఉన్న బోరుబావి నీటిని పంచుకున్నారు. పచ్చని పైర్లు పండించి కడుపునింపుకున్నారు. అప్పటికే ఉన్న అప్పులనూ తీర్చుకున్నారు. కాస్తోకూస్తో మిగిలిన ఇంకాస్త సొమ్ముతో మరో బోరుబావి తవ్వించారు. అందులోనూ నీరు పుష్కలంగా రావడంతో వారి అనందానికి అవధులు లేకుండాపోయాయి. విద్యుత సరఫరా ఉండడంతో రెండు బోర్లలోనూ నీటిని ఉమ్మడిగా సేద్యానికి పారించారు. 4.5 ఎకరాల్లో మామిడి, 7 ఎకరాల్లో మల్బరీ, మిగిలిన భూమిలో మొక్కజొన్న, ఆకుకూరలు, ఇతర పంటలు సాగు చేస్తూ ఉమ్మడి సాగులో అన్నదమ్ములు భళా అనిపిస్తున్నారు. 


ఆర్డీటీని ఎన్నటికీ మరువలేము..

- గుర్రప్ప, రైతు, తిరుమలదేవరపల్లి 

నాడు అప్పులతో బాధపడుతున్న తమ కుటుంబానికి ఆర్డీటీ అండగా నిలిచింది. నీరున్నా సాగు చేయలేని పరిస్థితిలో ఉచితంగా సోలార్‌ మోటార్‌ పంపుసెట్‌ అందించింది. ఆర్డీటీ సహకారంతో పంటలు సాగుచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నాం.  పిల్లలను చదివించుకుంటున్నాం. ఆర్డీటీకి మా కుటుంబం రుణపడి ఉంటుంది. వారి సహకారాన్ని ఎన్నటికీ మరవలేము. 

    

మా కుటుంబాలకు మనోధైర్యమిచ్చింది..

 - ప్రకాశ, రైతు, తిరుమలదేవరపల్లి 

కష్టాల్లో చిక్కుకున్న మా కుటుంబాలకు ఆర్డీటీ సంస్థ మనోధైర్యం నింపింది. ఉమ్మడిగా సాగు చేసేందుకు సహకారం అందించింది. అభివృద్ధిబాటకు పునాదులు వేసింది. నేటికీ వారి సేవలను వినియోగించుకుంటున్నాం.  

Read more