ఏళ్లుగా జగనన్న ఇళ్ల బిల్లులు పెండింగ్‌

ABN , First Publish Date - 2022-10-09T05:29:50+05:30 IST

జగనన్న ఇళ్లకు సంబంధించి మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉండ టంతో పలువురు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వారికి సైతం బిల్లులు చెల్లించడం లేదు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు పథకంతో పాటు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణపథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు సుమారు నాలుగేళ్లకుపైగా ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో ఉంచడం విమర్శలకు తావిస్తోంది.

ఏళ్లుగా జగనన్న ఇళ్ల బిల్లులు పెండింగ్‌
ఉరవకొండలోని జగనన్న లేఔట్‌ (ఫైల్‌)

 అధికారుల చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణ

అధికారుల ఒత్తిళ్లతో నిర్మాణాలు చేస్తున్న వైనం

బిల్లులు అడిగితే పొంతనలేని సమాధానాలు 

ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్న లబ్ధిదారులు 


అనంతపురం సిటీ : జగనన్న ఇళ్లకు సంబంధించి మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో ఉండ టంతో పలువురు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. గత ప్రభుత్వ హయాంలో మంజూరైన వారికి సైతం బిల్లులు చెల్లించడం లేదు. నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు పథకంతో పాటు ఎన్టీఆర్‌ గృహ నిర్మాణపథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులకు సుమారు నాలుగేళ్లకుపైగా ప్రభుత్వం బిల్లులు పెండింగ్‌లో ఉంచడం విమర్శలకు తావిస్తోంది. బిల్లుల కోసం లబ్ధిదారులు అధికారులు, కార్యాలయాలు చుట్టూ తిరిగితే అదిగో.. ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


తప్పని ఎదురుచూపులు

గత ప్రభుత్వ హయాంలో ఎన్టీఆర్‌ పథకం కింద మంజూరైన 6149 ఇళ్లకు సంబంధించి ప్రస్తుతం బిల్లులు మంజూరు చేయలేదని బాధిత వర్గాలు చెబుతున్నాయి. వివిధ కారణాలతో గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణం పూర్తికాకపోవడంలో బిల్లులు ఆగిపోయాయి. తర్వాత కాలంలో ఇళ్ల నిర్మాణం పూర్తయినా అధికారంలోకి వచ్చిన వైసీపీ ఒక్కరికి కూడా బిల్లులు మంజూరు చేయలేదని తెలిసింది.  సుమారు. రూ. 40 కోట్లుకుపైగా బిల్లులు రావాల్సి ఉందని అధికారిక లెక్కలు చెప్తున్నాయి.  


జగనన్న ఇళ్లదీ అదే దుస్థితి...

పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న నవరత్నాలు- పేదలందరికి ఇళ్లు పథకం కింద మంజూరైన ఇళ్ల పరిస్థితి ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. గత మూడేళ్లుగా  బిల్లులు మంజూరు కావడం లేదని పలువురు లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. మూడేళ్ల కిందట ప్రభుత్వం 67,772 ఇళ్లను మంజూరు చేయగా 15,324 ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. 44832 ఇళ్లు వివిధ నిర్మాణ దశలలో ఉండగా.. ఇప్పటికి 7616 ఇళ్లు ఎలాంటి ప్రారంభానికి నోచుకోకుండా పూర్తిగా పెండింగ్‌లో ఉండిపోయాయి. సకాలంలో బిల్లులు మంజూరు చేయకపోవడమే దీనికి కారణమని బాధిత వర్గాలు ఆరోపిస్తున్నాయి. వీటికితోడు సకాలంలో ఇసుక, సిమెంట్‌ తదితర సామగ్రి కూడా సరఫరా చేయడం లేదని వాపోతున్నారు. ఈ ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు కూడా రూ. 91.80 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉండగా.. తాజాగా రూ.. 70 కోట్లు మంజూరు చేసి ఇంకా రూ.21.80 కోట్లు పెండింగ్‌లో ఉంచినట్లు అధికార లెక్కలు చెప్తున్నాయి. 


అధికారుల ఒత్తిళ్లతోనే..

జిల్లా వ్యాప్తంగా జగనన్న ఇళ్ల నిర్మాణాలు ఆశించిన స్థాయిలో జరగడం లేదు. ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలతో అధికార యంత్రాంగం  లబ్ధిదారులపై వివిధ రూపాలలో ఒత్తిడి పెంచుతోంది. ఇంటి నిర్మాణం చేపట్టకపోతే పట్టా రద్దు చేస్తామంటూ బెదిరిస్తోంది. ఈక్రమంలో కొందరు లబ్ధిదారులు  అప్పులు చేసి మరీ నిర్మాణాలు చేస్తున్నారు. ప్రధానంగా గుంతకల్లు, తాడిపత్రి, ఉరవకొండ,  కూడేరు, అనంతపురం రూరల్‌, కళ్యాణదుర్గం, రాప్తాడు, గార్లదిన్నె, నార్పల తదితర ప్రాంతాలలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉందని సమాచారం. 


బిల్లులు అడిగితే... 

కొందరు లబ్ధిదారులు బిల్లుల కోసం అధికారులు, హౌసింగ్‌ కార్యాలయాలు చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. కానీ బిల్లులు మాత్రం పడటం లేదు. ఎవరైనా కొందరు లబ్ధిదారులు అధికారులను నిలదీస్తే.. పొంతన లేని సమాధానాలు చెబుతూ కాలయాపన చేస్తున్నారని తెలిసింది. కొందరు అధికారులైతే ఏకంగా గత ప్రభుత్వంలో మంజూరైన ఇళ్లకు బిల్లులు రావనీ చెప్తున్నట్లు తెలిసింది. సర్వర్‌ పని చేయలేదు..? ఆధార్‌ అప్‌లోడ్‌ కాలేదు..? అకౌంట్‌ సక్రమంగా లేదు..? అని పొంతన లేని కారణాలను చెబుతున్నారని మండిపడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బిల్లులతో మాకు సంబంధం లేదు.. నిర్మాణాలు చేయాల్సిందేనని అధికారులు లబ్ధిదారులపై ఒత్తిళ్లు పెంచడం విమర్శలకు తావిస్తోంది. 

Read more