అవ్వా తాతలపై జగన ప్రతాపం

ABN , First Publish Date - 2022-12-30T00:09:05+05:30 IST

పింఛన్ల రీ సర్వే పేరుతో సీఎం జగన అవ్వాతాతలపై ప్రతాపం చూపుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ విమర్శించారు.

అవ్వా తాతలపై జగన ప్రతాపం

జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌

అనంతపురం రూరల్‌, డిసెంబరు 29: పింఛన్ల రీ సర్వే పేరుతో సీఎం జగన అవ్వాతాతలపై ప్రతాపం చూపుతున్నారని జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్‌ విమర్శించారు. గురువారం మండలంలోని ఎ.నారాయణపురంలో పింఛనదారులకు నోటీసులు ఇవ్వడం తెలుసుకున్న ఆయన బాధితులతో పలకరింపు కార్యక్రమాన్ని చేపట్టారు. ఆయన మాట్లాడుతూ సీఎం జగన అనుచిత నిర్ణయాలతో రాష్ట్రంలో సామాజిక భద్రత కరువైందని మండిపడ్డారు. వలంటీర్ల ద్వారా ప్రతి నెల ఒకటో తారీఖు వేకువ జాము నుంచే పింఛన్లు పంపిణీ చేస్తున్నామని ప్రగల్భాలు పలికిన స్థానిక ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారన్నారు. 15ఏళ్లుగా పింఛన్లు అందుకుంటున్న వారు ఇప్పుడు ఏవిధంగా అనర్హులు అవుతారో సమాధానం చెప్పాలన్నారు. కొడుకులు, కోడళ్లపై ఆధారపడకుండా తమ మందులు, ఇతరత్ర ఖర్చులకోసం ఎంతో పొదుపుగా ఈ పింఛన డబ్బులు వాడుకునేవారని ఆ కాస్త చేయూతను కూడా ప్రభుత్వం దూరం చేసే కుట్ర పన్నిందని దుయ్యబట్టారు. పింఛనదారులకు అండగా పార్టీ ఉంటుందన్నారు. పోరాటలు చేస్తామన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఈశ్వరయ్య, నగర అధ్యక్షులు బాబురావు, జనసేన నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:09:06+05:30 IST