అయ్యో.. పాపం..

ABN , First Publish Date - 2022-06-08T05:15:38+05:30 IST

ఇంటిల్లిపాదీ సాయంత్రం 4 గంటల వరకు సంతోషంగా ఉన్నారు. బంధువులతో ఇల్లంతా సంబరంగా మారింది.

అయ్యో.. పాపం..

చెరువులో మునిగి ఇద్దరు బాలుర మృతి

అన్నాచెల్లెళ్ల పిల్లలే.. ఆస్పత్రి వద్ద మిన్నంటిన రోదనలు 

పీఎం నిర్వహించకూడదంటూ అడ్డుకున్న బంధువులు 

హిందూపురం టౌన, జూన 7: ఇంటిల్లిపాదీ సాయంత్రం 4 గంటల వరకు సంతోషంగా ఉన్నారు. బంధువులతో ఇల్లంతా సంబరంగా మారింది. అప్పటి వరకు ఆనందంగా గడిపిన ఆ కుటుంబం ఒక్కసారిగా విషాదంలో మునిగిపోయింది. సూగూరు చెరువులో మునిగి, ఇద్దరు బాలురు మరణించడం ఆ ఇంట అంతులేని శోకాన్ని నింపింది. పట్టణంలోని ఇందిరానగర్‌కు చెందిన విజయ్‌కుమార్‌, దీప దంపతుల రెండో కుమారుడు వంశీ (12), విజయ్‌కుమార్‌ సోదరి షాన్బా, రాజా దంపతుల ఏకైక కుమారుడు కార్తికేయ(9) మంగళవారం సాయంత్రం 4 గంటల సమయంలో వేలు, అశ్వినితో కలిసి సూగూరు చెరువు వద్దకెళ్లారు. వంశీ, కార్తికేయ ఈత కొట్టేందుకు దుస్తులు వేలు, అశ్విని చేతికిచ్చి చెరువులోకి దిగారు. కొద్దిసేపటికే వారు మునిగిపోతుండటం చూసిన వేలు, అశ్విని సమీపంలో వాలీబాల్‌ ఆడుతున్న యువకులకు తెలిపారు. వారు అక్కడికి వెళ్లి చెరువులోకి దిగి, ఇద్దరినీ బయటకు తీశారు. తాగిన నీటిని కక్కించేందుకు ప్రయత్నించారు. అప్పటికే వారి కుటుంబ సభ్యులకు సమాచారం చేరడంతో వారు చెరువు వద్దకు చేరుకుని, వెంటనే ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలురు మృతిచెందినట్లు నిర్ధారించారు. బంధువులు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకుని, బోరున విలపించారు. విజయ్‌కుమార్‌, షాన్బా అన్నచెల్లెళ్లు. ఈ రెండు కుటుంబాలు కొంతకాలం క్రితం బెంగళూరుకు వలస వెళ్లి, జీవనం సాగిస్తున్నాయి. బంధువుల ఇంట్లో శుభకార్యానికి హాజరయ్యేందుకు రెండురోజుల క్రితం హిందూపురానికి వచ్చారు. బుధవారం వారు బెంగళూరుకు వెళ్లాల్సి ఉంది. ఇంతలో ఘోరం జరిగిపోయింది.


పోస్టుమార్టంను అడ్డుకున్న బంధువులు

చిన్నారుల మృతదేహాలను ఎమర్జెన్సీ వార్డు నుంచి పోస్టుమార్టం గదికి తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. బంధువులు అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోస్టుమార్టం నిర్వహించరాదని పోలీసులతో వాదనకు దిగారు. టూటౌన సీఐ సూర్యనారాయణ ఆస్పత్రికి చేరుకుని, బంధువులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా వారు ససేమిరా అన్నారు. చేయకూడదంటూ వేడుకున్నారు. ఆ మేరకు కుటుంబ సభ్యుల నుంచి రాయించుకుని, మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని సీఐ తెలిపారు. దీనిపై కేసు నమోదుచేసి, దర్యాప్తు చేపడతామన్నారు.


Updated Date - 2022-06-08T05:15:38+05:30 IST