ఇంటర్వ్యూలు... దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2022-12-10T00:29:21+05:30 IST

మూడు చక్రాల వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ అబ్దుల్‌ రసూల్‌ తెలిపారు.

 ఇంటర్వ్యూలు...  దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, డిసెంబరు 9: మూడు చక్రాల వాహనాల కోసం దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులకు ఈ నెల 13, 14వ తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమశాఖ ఏడీ అబ్దుల్‌ రసూల్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశా రు. వాహనాల ఎంపిక ప్రక్రియను పెన్నార్‌భవన పక్క నున్న బీసీ స్టడీ సర్కిల్‌లో ఏర్పాటు చేసినట్లు తెలి పారు. 13వ తేదీ ఉదయం 10 గంటలకు అనంత పురం, తాడిపత్రి, రాప్తాడు, శింగనమల నియోజకవర్గ పరిధిలో దరఖాస్తులు చేసుకున్న వారికి, 14న ఉదయం 10 గంటలకు ఉరవకొండ, రాయదుర్గం, గుంతకల్లు, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోధరఖాస్తులు చేసుకున్న దివ్యాంగులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఒరిజినల్‌ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు.

హాస్టళ్ల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

అనంతపురం విద్య : సమగ్రశిక్ష స్టేట్‌ డైరెక్టర్‌, జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లాలో సీజనల్‌ హాస్టళ్ల నిర్వహణకు ఆసక్తి ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలు (ఎన్‌జీవో) నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ తిలక్‌ విద్యాసాగర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడేళ్లకు పైగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న, రిజిస్టరైన ఎన్‌జీవోలు తాము సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రాంతంలో తల్లిదండ్రులు వలస వెళ్లగా ఇక్కడే ఉన్న పిల్లల వివరాలతో ఈ నెల 13వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు పంపాలన్నారు. దరఖాస్తుతో పాటు తమ సంస్థ రిజిస్ట్రేషన్‌ వివరాలు, గత మూడేళ్ల ఆదాయ వ్యయాల వివరాలు, మూడేళ్లుగా చేస్తున్న కార్యక్రమాల వివరాలు (ఫొటోలతో) ఆడిట్‌ నివేదిక, సంస్థ కార్యవర్గ సభ్యుల నివేదిక, పిల్లల వివరాలు, వారి ఆఫీస్‌ ఫర్నిచర్‌, కార్యాలయ నిర్వహణ వివరాలతో దరఖాస్తులు అందజేయాలని ఆదేశించారు.

ఆశా కార్యకర్తల నియామకానికి నోటిఫికేషన

అనంతపురం టౌన : జిల్లాలో ఖాళీగా ఉన్న ఆశా కార్యకర్త పోస్టుల భర్తీకి జిల్లా వైద్యశాఖ సిద్ధమైంది. నియామకాలకు జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆమోదం తెలిపారు. దీంతో జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ యుగంధర్‌ ఆశా కార్యకర్తల నోటిఫికేషనను అధికారికంగా వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 94 ఆశా పోస్టులను భర్తీ చేస్తున్నామన్నారు. ఇందులో అర్బన పీహెచసీలలో 9 పోస్టులు ఉండగా, రూరల్‌ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో 85 పోస్టులు ఉన్నాయని డీఎంహెచఓ తెలిపారు. ఈ నెల 11వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. 10వ తరగతి పాసై తెలుగు రాయడం, చదవడం వచ్చి ఉండాలన్నారు. గతంలో ఆశా కార్యకర్తగా పనిచేసి ఉంటే ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అభ్యర్థులు ప్రస్తుత నివాస ధ్రువీకరణ పత్రం, ఆధార్‌ కార్డు, 10వ తరగతి మార్కులు సర్టిఫికెట్‌ కాపీలు దరఖాస్తుకు జత చేసి ఇవ్వాలన్నారు. ఈ పోస్టులకు సంబంధించి వివరాలు వెబ్‌సైట్‌లో ఉంచామన్నారు. వెబ్‌సైట్‌లోనే దరఖాస్తు నమూనాలు డౌనలోడ్‌ చేసుకొని, పూరించి సర్టిఫికెట్లు జతచేసి ఆయా ప్రాంతాల పరిధిలో ఉన్న పీహెచసీ వైద్యులకు అందజేయాలన్నారు.

రేపు ఎస్‌సీఈఆర్టీ పోస్టులకు డైట్‌లో పరీక్షలు

అనంతపురం విద్య : ఎస్‌సీఈఆర్టీ నిర్వహించే స్టేట్‌ అసెస్మెంట్‌ సెల్‌ రిక్రూట్‌మెంట్‌ టెస్టు-2022 పోస్టులకు దరఖాస్తు చేసిన ఉపాధ్యాయులకు ఈనెల 11న పరీక్షలు నిర్వహించనున్నట్లు డీఈఓ వెంకట క్రిష్ణారెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థుల హాల్‌ టికెట్లు విడుదల చేసినట్లు ఆయన పేర్కొన్నారు. బుక్కపట్నం డైట్‌ కళాశాలలో 11న ఉదయం 9 గంటలకు జరిగే పరీక్షలకు ఉపాధ్యాయులు హాజరుకావాలన్నారు. ఉపాధ్యాయులకు పంపిన హాల్‌టికెట్లను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు పరిశీలించాలని ఆయన ఆదేశించారు.

Updated Date - 2022-12-10T00:29:22+05:30 IST