పైసలిస్తే ఏమైనా చేసుకోవచ్చు

ABN , First Publish Date - 2022-10-02T05:22:08+05:30 IST

ఆయన అధికార పార్టీ చోటా నాయకుడు. భార్య పదవిని అడ్డుపెట్టుకుని అందినకాటికి దండుకుంటున్నాడు.

పైసలిస్తే ఏమైనా చేసుకోవచ్చు
డి-పట్టా స్థలంలో ఏర్పాటు చేసిన సెల్‌ టవర్‌

ఆయన పంచాయతీ..!

పైసలిస్తే ఏమైనా చేసుకోవచ్చు

ప్రభుత్వ స్థలంలో సెల్‌ టవర్‌

రియల్టర్ల నుంచి ముడుపులు

ఓ ప్రజా ప్రతినిధి భర్త తీరిది..!

అనంతపురం రూరల్‌, అక్టోబరు 1: ఆయన అధికార పార్టీ చోటా నాయకుడు. భార్య పదవిని అడ్డుపెట్టుకుని అందినకాటికి దండుకుంటున్నాడు. పైసలిస్తే చాలు ఏ పనైనా చేసిపెడుతున్నాడు. ప్రభుత్వ స్థలాలు తన సొంతం అన్నట్లు ప్రైవేట్‌ కంపెనీల వినియోగానికి ఇచ్చేస్తున్నాడు. ప్రజలు ఇబ్బంది పడతారని తెలిసినా లెక్కచేయడు. నగరానికి సమీపంలోని కురుగుంటలో ఆయన రాజ్యం నడుస్తోంది. 


ఇలా దందా..

ఫ కురుగుంట పంచాయతీలోని 90, 92, 93 సర్వే నెంబరులో ప్రభుత్వం గతంలో ఇంటి స్థలాలు మంజూరు చేసింది. ఆ స్థలాల్లో లబ్ధిదారులు ఇళ్లను నిర్మించుకోవాలి. కానీ స్థలం పొందిన ఓ వ్యక్తి సెల్‌ టవర్‌ నిర్మాణానికి ప్రైవేట్‌ కంపెనీతో ఒప్పదం కుదుర్చుకున్నాడు. సెల్‌ టవర్‌ నిర్మాణానికి పంచాయతీ తీర్మానం తప్పని సరి. అదీ.. ప్రైవేటు స్థలం అయితేనే అనుమతి ఇస్తారు. కానీ ఆ ఊరిలో ఇవేవీ అడ్డురాలేదు. ఆ ప్రజాప్రతినిధిని భర్తను  కంపెనీ ప్రతినిధులు, స్థలం పొందినవ్యక్తి సంప్రదించారు. రూ.5 లక్షల వరకు ముడుపులు తీసుకుని, ఆయన అనుమతి ఇచ్చారని గ్రామంలో చర్చసాగుతోంది. 

ఫ నగరానికి సమీపంలో ఉన్న ఈ పంచాయతీలో లే ఔట్లు వేయాలంటే ఆయన వద్ద ‘అనుమతులు’ తీసుకోవాలి. ఆయనను సంతృప్తిపరిస్తే ప్రభుత్వ నిబంధనలు పాటించాల్సిన పనేలేదు. లే ఔట్లు వేయాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం పంచాయతీకి ఎకరాకు 10 సెంట్ల స్థలం కేటాయించాలి. కానీ ఆ నాయకుడికి పైసలిస్తే.. ఆ పది సెంట్లను వదలకపోయినా పరవాలేదని అంటున్నారు. 


బెదిరింపులు

నిబంధనలకు విరుద్ధంగా సెల్‌ టవర్‌ నిర్మిస్తున్నారని గ్రామానికి చెందిన కొందరు స్పందనలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పనులను నిలిపివేయాలని అధికారులు ఆదేశించారని తెలిసింది. కానీ ఆ నాయకుడు ఖాతరు చేయలేదని సమాచారం. అయితే టవర్‌ నిర్మించే స్థలం పక్కనున్న ఇంటివారు అడ్డుకోవడంతో కాస్త వెనక్కు తగ్గినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆ నాయకుడు అధికారులకు ఫిర్యాదు చేసినవారిని బెదిరించే ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలుస్తోంది. 


నోటీసులు ఇచ్చాం..

ప్రభుత్వ స్థలాల్లో టవర్‌ నిర్మాణానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు. స్థలం ఇచ్చింది ఇల్లు కట్టుకోవడానికేగాని, టవర్లు, ఇతర నిర్మాణాలకు కాదు. ఇంటి పట్టా పొందిన వ్యక్తికి నోటీసులు ఇచ్చాం. పట్టా రద్దు చేస్తామని హెచ్చరించాము. టవర్‌ నిర్మాణానికి ఎవరి నుంచి అనుమతి తీసుకున్నారో చెప్పాలని ఆ కంపెనీవారికీ నోటీసులు ఇచ్చాము. 

- శ్రీధర్‌ కుమార్‌, తహసీల్దారు, అనంతపురం


నిలుపుదల చేయించాం..

వైఎస్సార్‌ కాలనీలో సెల్‌ టవర్‌ నిర్మాణానికి కంపెనీ ప్రతినిధులు అర్జీ పెట్టుకున్నారు. అనుమతి ఇవ్వకముందే టవర్‌ నిర్మాణం ప్రారంభించారు. విషయం తెలుసుకుని పనులను నిలుపుదల చేయించాము. ప్రైవేట్‌ స్థలంలో నిర్మించుకోవాలని, ప్రభుత్వ స్థలంలో కుదరదని వారికి తెలియజేశాము. 

- ఎర్రిస్వామి,  పంచాయతీ కార్యదర్శి, కురుగుంట

Updated Date - 2022-10-02T05:22:08+05:30 IST