గ్రాంట్‌కు గండం

ABN , First Publish Date - 2022-03-18T06:52:30+05:30 IST

లేక లేక.. వచ్చాయన్న ఆశ కూడా తీరకుండానే నిధులు ఆవిరయ్యేలా ఉన్నాయి. వాళ్లను... వీళ్లను పట్టుకుని తెచ్చుకున్న పనులు సైతం జరుగుతాయో లేదోనన్న భయం పట్టుకుంది.

గ్రాంట్‌కు గండం

మండలాలకు రూ.18.99 కోట్ల నిధులు

జడ్పీటీసీలు, కో-ఆప్షన్‌ సభ్యులకు పనులు

ముంచుకొస్తున్న గడువు

ఇసుక, సిమెంటు కొరతతో సతమతం

వెంటాడుతున్న బిల్లుల చెల్లింపు భయం 

నెలాఖరులోపు 

ప్రారంభించకుంటే నిధులు వెనక్కే..


అనంతపురం విద్య, మార్చి 17: లేక లేక.. వచ్చాయన్న ఆశ కూడా తీరకుండానే నిధులు ఆవిరయ్యేలా ఉన్నాయి. వాళ్లను... వీళ్లను పట్టుకుని తెచ్చుకున్న పనులు సైతం జరుగుతాయో లేదోనన్న భయం పట్టుకుంది. సిమెంటు, ఇసుక కొరత వీడటం లేదు. గడువు కూడా నెలలు, ఏండ్లు లేదు. ఉన్నదల్లా కేవలం 14 రోజులే. దీంతో జడ్పీటీసీలు, కో ఆప్షన్‌ సభ్యులకు గడువు గండం పట్టుకుంది. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌) గ్రాంట్‌ కింద మండలాలకు రూ.18.99 కోట్ల నిధులు ఇచ్చారు. ఆ నిధులతో చేపట్టిన పనులకు గడువు గండం పొంచి ఉంది. నెలాఖరులోపు పనులు చేయకుంటే నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు అప్రమత్తం కాకున్నా... అధికారులు స్పందించకున్నా.. కోట్ల నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదం లేకపోలేదు. చాలామంది జడ్పీటీసీలు తమ మండలానికి ఇచ్చిన నిధులను సొంత పల్లెలు, ఊళ్లకే అధికంగా కేటాయించడం విమర్శలకు దారితీస్తోంది. ఇదెక్కడి ‘సొంత ప్రేమ’ అంటూ మండిపడుతున్నారు.


మండలానికి రూ.20 లక్షల నుంచి..

జడ్పీ పాలకవర్గం ఏర్పడిన తర్వాత మండలాల వారీగా నిధులు కేటాయించారు. వేలాది గ్రామాలు, పల్లెల్లో అనేక సమస్యలున్నాయి. దీంతో గ్రామాల్లోనే కాకుండా, బీసీ, ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సీసీ రోడ్లు, కాలువలకు భారీగా ప్రతిపాదనలు వచ్చా యి. దీంతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ గ్రాంట్‌ కింద మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులను భారీగా కేటాయించారు. జిల్లా వ్యాప్తంగా మండలాలకు ఏకంగా 18.99 కోట్లు కేటాయించారు. చాలా మండలాలకు రూ.19 లక్షల నుంచి రూ.30 లక్షల వరకూ మంజూరు చేశారు. కొన్నింటికి రూ.60 లక్షలు కూడా ఇచ్చారు. అనంతపురం, నార్పల, ధర్మవరం మండలాలకు రూ.60 లక్షలు, ఆత్మకూరు రూ.57.80 లక్షల పనులు కేటాయించారు. అగళి, బొమ్మనహాళ్‌, బుక్కపట్నం, చిలమత్తూరు, గోరంట్ల, గార్లదిన్నె, గుంతకల్లు, గుత్తి, కదిరి, కంబదూరు, కనగానపల్లి, కణేకల్లు, కొత్తచెరువు, పుట్టపర్తి, రొద్దం, సోమందేపల్లి, ముదిగుబ్బ, నల్లచెరువు, నల్లమాడ, ఓడీసీ, పెద్దపప్పూరు, పెనుకొండ, పెద్దవడుగూరు, పుట్లూరు, రామగిరి, రొళ్ల, శింగనమల, తాడిపత్రి, ఉరవకొండ, యల్లనూరు మండలాలకు రూ.30 లక్షల పనుల చొప్పున కేటాయించారు. మిగతా వాటికి అంతకన్నా తక్కువే ఇచ్చారు. గోరంట్ల, గాండ్లపెంట కో-ఆప్షన్‌ సభ్యులకు వరుసగా రూ.30 లక్షలు, రూ.22 లక్షల పనులు ఇచ్చారు.


సొంతూళ్లకే నిధుల వరద

కొత్తగా ఎంపికైన జడ్పీటీసీలు, వారి మండలాలకు నిధులు కేటాయిస్తే చాలామంది జడ్పీటీసీలు సొంతూళ్లకే వాటిని పారించారన్న విమర్శలూ ఉన్నాయి. కొందరు ఒకే ఊరికి నిధులన్నీ కేటాయించారు. ధర్మవరం మండలానికి రూ.60 లక్షలు కేటాయిస్తే... అన్నీ కామారుపల్లికే పారిస్తున్నారు. పామిడి, పుట్టపర్తి, గుమ్మఘట్ట, పుట్లూరు, గుత్తి, హిందూపురం, ముదిగుబ్బ, ఓబుళదేవరచెరువు, రాయదుర్గం, శెట్టూరు, తాడిపత్రి, ఉరవకొండ, రాప్తాడు తదితర మండలాల్లో వచ్చిన నిధులన్నింటినీ ఒకే గ్రామానికి కేటాయించారు. ఇలా.. జడ్పీటీసీలు సొంత ఊళ్లకు నిధులను పారించారన్న విమర్శలున్నాయి.


ఇసుక, సిమెంటు కష్టాలు

జిల్లావ్యాప్తంగా రూ.18.99 కోట్ల పనులు ముందుకు సాగని పరిస్థితి. ఇసుక, సిమెంటు కొరత ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పీఆర్‌ ఇంజనీరింగ్‌ అధికారుల నుంచి కాంట్రాక్టర్ల వరకూ అందరూ ఇదే మాట చెబుతున్నారు. ఇదే విషయాన్ని జడ్పీటీసీ సభ్యులు సర్వసభ్య సమావేశంలో సైతం అధ్యక్షురాలు, అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఇసుక, సిమెంటు అందుబాటులోకి తెస్తామంటూ అధికారులు సైతం హామీ ఇచ్చారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలానే ఉంది. దీంతో కొన్నిచోట్ల మాత్రమే పనులు ప్రారంభించారు. 10 శాతానికి మించి ఎక్కడా ప్రారంభించలేదు. పనులు చేస్తే.. బిల్లులు వస్తాయో.. లేదోనన్న భయమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తానికి ఈ పనులు మార్చి 31 నాటికి 5 శాతమైనా ప్రారంభించి, ఖర్చు చేయకుంటే... నిధులు వెనక్కు వెళ్తాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్పందించకుంటే నిధుల గండం తప్పేలా లేదు.ప్రతి మండలానికి నిధులు

ప్రస్తుత పాలకవర్గం ఏర్పడిన తర్వాత తొలిసారి జిల్లావ్యాప్తంగా అన్ని మండలాలకు ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌ గ్రాంటు కింద పనులు కేటాయించాం. జడ్పీటీసీలతోపాటు, కో-ఆప్షన్‌సభ్యులకు తమ ప్రాంతాల్లో సీసీ రోడ్డు, కాలువల పనులు ఇచ్చాం. జిల్లావ్యాప్తంగా రూ.18.99 కోట్ల పనులు మండలాలకు ఇచ్చాం. ఇసుక, సిమెంటు కొరత లేకుండా చూడాలనీ, పనులు సకాలంలో ప్రారంభించి పూర్తయ్యేలా అధికారులను కూడా ఆదేశిస్తాం.

- బోయ గిరిజమ్మ, జడ్పీ చైర్‌పర్సన్‌


ఇంజనీర్లు పనులపై శ్రద్ధ పెట్టాలి

మెటీరియల్‌ కాంపోనెంట్‌ పనులు వేగవంతం చేయాలి. కొన్ని మండలాల్లో ఇప్పటికే పనులు ప్రారంభమయ్యాయి. అక్కడక్కడా ఇసుక, సిమెంటు కొరత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యలు అధిగమించి పనులు ప్రారంభించడంతోపాటు, వాటిని సకాలంలో పూర్తయ్యేలా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లపై ఉంటుంది. ఇంజనీర్లు ఆ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.

-  శ్రీనివాసులు, జడ్పీ డిప్యూటీ సీఈఓ

Read more