నిందితులతో సన్మానమా..?

ABN , First Publish Date - 2022-04-24T06:50:38+05:30 IST

జిల్లాలో కొందరు పోలీసుల నిర్వాకంతో ఆ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటోందని పీఏసీ చైర్మన, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

నిందితులతో సన్మానమా..?

నాయకుల కాళ్లకింద పోలీసుల ఫొటోలా..?

ఆత్మగౌరవం లేదా..? బాధ కలగడం లేదా..?

వ్యవస్థ సిగ్గుపడేలా కొందరు పోలీసుల తీరు

పీఏసీ చైర్మన పయ్యావుల కేశవ్‌ ఫైర్‌


అనంతపురం ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొందరు పోలీసుల నిర్వాకంతో ఆ వ్యవస్థ సిగ్గుతో తలదించుకుంటోందని పీఏసీ చైర్మన్, ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను అడ్డుకున్నా రిలయన్స మార్టుకు నిప్పు పెట్టి, దోపిడీ చేశారని ఎర్రిస్వామిరెడ్డి, విశ్వేశ్వరరెడ్డిపై నాటి సీఐ నరసింగప్ప ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని గుర్తు చేశారు. ఆ కేసు నిందితులతో ప్రస్తుతం డీఎస్పీ హోదాలో ఉన్న నరసింగప్ప సన్మానం చేయించుకున్నారని విమర్శించారు. ‘మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి ఈ టెక్నిక్‌ తెలియదనుకుంటా... ఇక్కడ కొందరు పోలీసు అధికారులు, అధికార పార్టీ నాయకులు తామంతా కలిసిపోయామని వేదికల ద్వారా చాటుతుంటే... ఆయన కోర్టులోకి పోయి డాక్యుమెంట్లు కొట్టేయడం ఎందుకు..?’ అని ఎద్దేవా చేశారు. గతంలో తమపై కేసులు పెట్టిన అధికారికి నిందితులే పోస్టింగ్‌ ఇప్పించారని ఆరోపించారు. పరిస్థితులు ఇలా ఉంటే, కోర్టులు ఏంచేస్తాయి..? కోర్టుల్లోని డాక్యుమెంట్లు ఏంచేస్తాయి..? అని ప్రశ్నించారు. నిందితులతో వేదికను ఎలా పంచుకుంటారు..? నియమ నిబంధనలు పాటించరా..? అని నిలదీశారు. ప్రజల రక్షణ కోసం పోలీసు వ్యవస్థ ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని విధులు నిర్వర్తించాల్సిన అవసరం ఉందని అన్నారు. పోలీసు స్టేషన్లల్లో అధికార పార్టీ నాయకులు తిష్ట వేసి, ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. ఇందుకు కొందరు పోలీసులు వంతపాడుతున్నారని ఆరోపించారు. పోలీసు స్టేషన్లలో సీసీ కెమెరాలు పెట్టాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని, ఆరునెలల్లోనే అమలు పరుస్తామని స్వయంగా డీజీపీ చెప్పారని, ఏడాదైనా ఆచరణకు నోచుకోవడం లేదని అన్నారు. ఉరవకొండ పోలీసు స్టేషన నుంచే సీసీ కెమెరాలు ఏర్పాటు ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కోర్టు ధిక్కారం కేసు ఫైల్‌ చేస్తామని స్పష్టం చేశారు. ఉరవకొండ వైసీపీ నాయకుడి జన్మదినాన్ని పురస్కరించుకొని ఫ్లెక్సీలు, పోలీసులు శుభాకాంక్షలు చెప్పినట్లు పత్రికలో ప్రకటన వేశారని, దీనిపై పోలీసులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. అందులో పోలీసుల ప్రమేయం లేకపోతే, ఫ్లెక్సీ ఏర్పాటు చేసినవారు, ప్రకటన ఇచ్చినవారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. ఫ్లెక్సీలో ఒక పార్టీకి నాయకుడి కాళ్ల కింద పోలీసుల  ఫొటోలు వేసుకోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని ప్రశ్నించారు. పోలీసు అధికారులకు ఈ విషయంలో బాధ కలగలేదా..? అని చురక అంటించారు. ఒక స్కూల్‌ కుర్రాడిని ‘నువ్వు ఏం అవుతావు..?’ అని అడిగితే... పోలీసు అవుతానని  గర్వంగా చెబుతున్నారని, పోలీసు డ్రస్‌ వేసుకున్న హోంగార్డు, కానిస్టేబుళ్లకు ఉన్న ఆత్మగౌరవం కూడా ఆ శాఖ అధికారులకు లేదా..? అని నిలదీశారు. పోలీసు వ్యవస్థ అంటే తమకు చాలా గౌరవం ఉందని, కొందరు పోలీసు అధికారుల వ్యవహార శైలి కారణంగా ఆ వ్యవస్థకే చెడ్డపేరు వస్తోందని అన్నారు. ఇప్పటికైనా తీరు మార్చుకొని, బాధ్యతగా విధులు నిర్వర్తించాలని కోరారు. లేదంటే న్యాయ వ్యవస్థ తలుపులు తట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. 

Updated Date - 2022-04-24T06:50:38+05:30 IST