ఏయ్‌ బిడ్డా.. ఇది మా అడ్డా!

ABN , First Publish Date - 2022-10-01T05:55:06+05:30 IST

వేకువ జామున ఇంటి ముందు ముగ్గు వేయాలంటే భయం..! ఒంటరిగా రోడ్డు మీద నడవాలంటే భయం..! కాస్త చీకటి పడితే.. బయట సంచరించే పరిస్థితి లేదు.

ఏయ్‌ బిడ్డా.. ఇది మా అడ్డా!
కమలానగర్‌లో చైన స్నాచింగ్‌ దృశ్యం

నగరంలో గొలుసు దొంగల హల్‌చల్‌

గంట వ్యవధిలో మూడు స్నాచింగ్‌లు

బయటకు వచ్చేందుకు జంకుతున్న మహిళలు

గస్తీ మరిచిన పోలీసులు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 30: వేకువ జామున ఇంటి ముందు ముగ్గు వేయాలంటే భయం..! ఒంటరిగా రోడ్డు మీద నడవాలంటే భయం..! కాస్త చీకటి పడితే.. బయట సంచరించే పరిస్థితి లేదు. నగరంలో దొంగలు రాజ్యమేలుతున్నారు. బైకులపై దర్జాగా వచ్చి.. మెడలోని బంగారు గొలుసులను తెంచుకువెళుతున్నారు. దీంతో అడుగు బయటపెట్టేందుకు మహిళలు వణికిపోతున్నారు. బంగారం పోతే పోయింది.. బలవంతంగా తెంచుతున్న సమయంలో తమ గొంతు తెగితే పరిస్థితి ఏమిటని మహిళలు అందోళన చెందుతున్నారు. అనంతపురం నగరంలో శుక్రవారం ఉదయం వివిధ ప్రాంతాల్లో మూడు చైన స్నాచింగ్‌లు జరిగాయి. ఆరున్నర తులాల బంగారు గొలుసులను దొంగలు తెంచుకువెళ్లారు. నెలన్నర క్రితం నగరంలో వరుస ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు కొన్నిరోజులు గస్తీ ముమ్మరం చేశారు. ఆ తరువాత ఆ ఊసే లేకుండాపోయింది. రెండు నెలల క్రితం వరుసగా నగరంలో 25 చైనస్నాచింగ్‌లు జరిగాయి. పోలీసులు సీరియ్‌సగా తీసుకోవడం లేదని, అందుకే స్నాచర్లకు భయంలేకుండా పోయిందని విమర్శలు వస్తున్నాయి. బహిరంగ ప్రదేశాలు, ప్రధాన రహదారుల్లో చైన స్నాచింగ్‌లు జరగడం గమనార్హం. 


గంట వ్యవధిలో..

- నగరంలో శుక్రవారం ఉదయం వేర్వేరు ప్రాంతాల్లో మూడు చైన స్నాచింగ్‌లు జరిగాయి. కమలానగర్‌కు చెందిన గురుదేవి ఉదయం 6 గంటల సమయంలో శ్రీకంఠం సర్కిల్‌లో బస్సు దిగింది. అక్కడి నుంచి కమలా నగర్‌లోని తన ఇంటికి బయలుదేరింది. బాషా హోటల్‌ సమీపంలో వెళుతుండగా ఇద్దరు బైక్‌పై వేగంగా వచ్చారు. అందులో ఒకడు బైక్‌ దిగి ఆమె వెనుక వెళ్లి.. మెడలోని చైనను లాక్కుని బైక్‌ ఎక్కాడు. ఇద్దరూ కలిసి నింపాదిగా బైక్‌పై పారిపోయారు. తులం బంగారు గొలుసు లాక్కెళ్లినట్లు బాధితురాలు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

- హౌసింగ్‌ బోర్డులోని సాయిబాబా ఆలయం సమీపంలో ఇంటి ముందు శుభ్రం చేస్తున్న ప్రీతి అనే మహిళ మెడలో గొలుసును అగంతకుడు తెంచుకుని పారిపోయాడు. రెండున్నర తులాల బంగారు గొలుసును తెంచుకువెళ్లినట్లు బాధితురాలు వనటౌన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

- అశోక్‌ నగర్‌కు చెందిన రెడ్డమ్మ ఆదిమూర్తి నగర్‌ ప్రభుత్వ బాలికల వసతి గృహంలో వాచమనగా పనిచేస్తోంది. వసతి గృహంలో చెత్తను పడేసేందుకు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో బయటకొచ్చింది.  అప్పటికే రోడ్డు పక్కన ఇద్దరు  దుండగులు బైక్‌ మీద ఉన్నారు. వారిలో ఒకడు ఆమె వద్దకు వెళ్లి, మెడలోని మూడు తులాల తాళిబొట్టు గొలుసును తెంచుకువెళ్లాడు. అనూహ్యంగా జరిగిన ఈ పరిణామానికి ఆమె హడలిపోయింది. టూటౌన పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

-చైన స్నాచింగ్‌ ఘటనలపై పోలీసులు ఆరాతీశారు. కమలా నగర్‌, ఆదిమూర్తి నగర్‌లో సీసీ ఫుటేజీని పరిశీలించారు. హౌసింగ్‌ బోర్డులో సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరొచ్చారనే విషయంలో స్పష్టత లేదు. కమలానగర్‌, ఆదిమూర్తి నగర్‌లో చైన స్నాచింగ్‌ ఒకరిపనే అయ్యుంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. 


మహిళలకు  ప్రాణాపాయం

గొలుసు దొంగతనాలు ఎక్కువగా రాత్రి, తెల్లవారుజామునే జరుగుతున్నాయి. తక్కువ మంది సంచరించే ప్రాంతాలు, నిశీధి ప్రాంతాలలో దొంగలు బైకుల మీద మాటువేస్తున్నారు. ఎక్కువ ఘటనల్లో ఇద్దరు కలిసి ఒక బైక్‌లో వచ్చినట్లు స్పష్టమౌతోంది. ఒకరు కిందకు దిగి మహిళల మెడలో గొలుసులను తెంచుకుపోతున్నాడు. మరొకడు బైక్‌పై సిద్ధంగా ఉండి, పారిపోయేందుకు సహకరిస్తున్నాడు. చైన స్నాచింగ్‌లు మహిళలకు ప్రాణాంతకంగా మారుతున్నాయి. గొలుసును  బలంగా తెంచే సమయంలో మహిళలు కింద పడుతున్నారు. ఈ కారణంగా కంఠం తెగే ప్రమాదం ఉంది. చైన స్నాచింగ్‌ను పోలీసులు సీరియ్‌సగా తీసుకోవాలని మహిళలు కోరుతున్నారు.


గస్తీ మరిచారు

పోలీసులు నెలన్నర క్రితం ముగ్గురు చైన స్నాచర్లను అరెస్ట్‌ చేశారు. కొంతకాలం పాటు పోలీసులు తెల్లవారుజామున గస్తీ నిర్వహించారు. ఆ తరువాత మానేశారు. దీంతో చైనస్నాచర్లు రెచ్చిపోతున్నారు. ఆదర్శ కాలనీలో నీరు ప్రగతి పార్కు సమీపంలో నాలుగు రోజుల క్రితం బైక్‌పై వచ్చిన ఇద్దరు ఓ మహిళ మెడలో గొలుసును తెంచేందుకు ప్రయత్నించారు. ఆమె అప్రమత్తమై దూరంగా జరగడంతో ముందుకు వెళ్లిపోయారు. ఫోర్త్‌ టౌన పరిధిలో 20 రోజుల క్రితం ఓ మహిళ మెడ నుంచి రెండు తులాల బంగారు గొలుసును తెంచుకువెళ్లారు. నగర శివారులోని ఓ కాలనీలో, ఇంటి అడ్రస్‌ అడిగిన మహిళను చెన స్నాచర్‌ టార్గెట్‌ చేశాడు. ఇల్లు చూపిస్తానని తీసుకువెళ్లి.. చీకటిగా ఉన్న ప్రాంతంలో ఆమె మెడలోని మూడు తులాల బంగారు గొలుసును తెంచుకుని ఉడాయించాడు. 

Read more