హలో ఏసీబీ ఇక్కడ..!

ABN , First Publish Date - 2022-12-10T00:42:10+05:30 IST

ఆయనొక ఇనస్పెక్టర్‌. అవినీతి నిరోధక శాఖలో సీఐ స్థాయి అధికారి. ఆయన పేరు చెబితే ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. తమను ఎక్కడ పట్టుకుంటాడో.. అని కాదు..! తమ అక్రమ ఆస్తుల వివరాల కూపీలాగి, ప్రభుత్వానికి నివేదిస్తారనీ కాదు..! తమ అవినీతి ఆయన దృష్టిలో పడితే.. భారీగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుందని..! ఇదీ అసలు విషయం. ఆయన అవినీతిని నిరోధించరు. వీలైతే ప్రోత్సహిస్తారు. ‘మీరు తినండి.. నాకు తినిపించండి..’ అంటారు.

హలో ఏసీబీ ఇక్కడ..!

ఏమిటి సంగతి..? బాగా తింటున్నారటా..!

అవినీతిపరులకు ఆయనంటే హడల్‌

పట్టుకుంటారని కాదు.. పీక్కుతింటారని..!

అవినీతి అధికారులే ఆదాయ వనరు

ఏసీబీ సీనియర్‌ ఇనస్పెక్టర్‌ దందా

వసూళ్ల కోసం నలుగురు పీసీలు

అనంతపురం క్రైం, డిసెంబరు 9: ఆయనొక ఇనస్పెక్టర్‌. అవినీతి నిరోధక శాఖలో సీఐ స్థాయి అధికారి. ఆయన పేరు చెబితే ప్రభుత్వ శాఖల్లో అవినీతికి పాల్పడే అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతాయి. తమను ఎక్కడ పట్టుకుంటాడో.. అని కాదు..! తమ అక్రమ ఆస్తుల వివరాల కూపీలాగి, ప్రభుత్వానికి నివేదిస్తారనీ కాదు..! తమ అవినీతి ఆయన దృష్టిలో పడితే.. భారీగా ముడుపులు ఇవ్వాల్సి వస్తుందని..! ఇదీ అసలు విషయం. ఆయన అవినీతిని నిరోధించరు. వీలైతే ప్రోత్సహిస్తారు. ‘మీరు తినండి.. నాకు తినిపించండి..’ అంటారు. అవినీతి అధికారుల జాబితాను సిద్ధం చేసుకుని మరీ వసూళ్లకు దిగుతాడు. అధికారుల అవినీతిపై బాధితులు చేసే ఫిర్యాదులు ఆయనకు ఆదాయ వనరులు. ఫిర్యాదులు వస్తే వల విసిరి పట్టుకోవాల్సిందిపోయి.. తన వలలో వేసుకుంటున్నాడు. వసూళ్ల కోసం ప్రత్యేకంగా సిబ్బందిలో నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఆ శాఖలో సీనియర్‌ కావడంతో ఆయన హవా బాగా నడుస్తోందని సమాచారం. గతంలో ఒకసారి ఇక్కడ పనిచేసిన ఈ సారు.. మళ్లీ అదేపనిగా ఇక్కడికే వచ్చారు.

ఇంజనీర్‌పై ఫిర్యాదు చేస్తే..

ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైల్‌పై సంతకం కావాలన్నా, పని కావాలన్నా ముడుపులు ఇవ్వాల్సిందే. చాలాచోట్ల ఇదే పరిస్థితి. ఇలాంటి కార్యాలయాలపై ఏసీబీలో పనిచేసే సీనియర్‌ ఇనస్పెక్టర్‌ ప్రత్యేక దృష్టి సారిస్తారట. ఏసీబీ టోల్‌ ఫ్రీ నెంబరు-14400కు అక్రమాలపై బాధితుల నుంచి సమాచారం, ఫిర్యాదులు వస్తుంటాయి. వ్యవసాయ విద్యుత కనెక్షన కోసం ఓ రైతు విద్యుత శాఖ ఇంజనీర్‌ను కలిస్తే.. ఆయన రూ.50 వేలు లంచం అడిగారట. దీంతో ఆ రైతన్న నేరుగా ఈ ఇనస్పెక్టర్‌కు ఫిర్యాదు చేశాడు. తొలుత ఆయన ‘అయ్యో... అవునా...?’ అంటూ మొత్తం విషయం విన్నారట. నాలుగు రోజుల పాటు రైతును తన కార్యాలయానికి తిప్పించుకున్నట్లు సమాచారం. ఆ తరువాత నేరుగా సంబంధిత ఇంజనీర్‌తో బేరం పెట్టేశారట. ‘నేరుగా ఫిర్యాదు వచ్చింది.. ఏమిటి పరిస్థితి..?’ అని దబాయించారని తెలిసింది. దెబ్బకు ఆ ఇంజనీర్‌ దిగొచ్చి లక్షల్లో ముట్టజెప్పినట్లు సమాచారం. ఇలాంటి ఫిర్యాదులు ఆయనకు బాగా కలిసొస్తున్నట్లు తెలుస్తోంది. రెండేళ్లుగా ఏసీబీ దాడులు, రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకోవడాలు లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

మీ చిట్టా చాలానే ఉందే..

అవినీతి అధికారుల వివరాలను సేకరించి.. శాఖలవారీగా ఈయన విశ్లేషిస్తారని తెలిసింది. రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ర్టేషన్లు, చెక్‌పోస్టులు, సంక్షేమ హాస్టళ్లు, మున్సిపాలిటీలు, విద్యుత తదితర అవినీతికి ఆస్కారమున్న శాఖలపైనే దృష్టి సారిస్తారట. అవినీతికి పాల్పడే అధికారులు, ఉద్యోగులతో మొదట పరోక్షంగా మాట్లాడతారని సమాచారం. తాను ఫలానా అధికారిని అని చెప్పుకున్న తరువాత, ‘ఏమిటీ.. మీ చిట్టా చాలానే ఉందే.. మరీ ఎక్కువగా చేస్తున్నారట..’ అని మొదలుపెడతారని తెలిసింది. దీంతో అవతలివారిలో గుండె దడ మొదలవుతుంది. మెల్లగా దారిలోకి వచ్చేస్తారని సమాచారం. ఇలా దడ పుట్టించేందుకు నలుగురు కానిస్టేబుళ్లను వినియోగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. అధికారులు, ఉద్యోగుల అవినీతి స్థాయిని బట్టి వసూళ్లు ఉంటాయని, రూ.వేల నుంచి రూ.లక్షల్లో తీసుకుంటారని సమాచారం. ఇక్కడ రెగ్యులర్‌ డీఎస్పీ లేకపోవడంతో అంతా తానై చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

ఏళ్ల తరబడి తిష్ట..

పోలీసు అధికారులు ఏసీబీ, ఇతర శాఖలకు లూప్‌లైన విధానంలో వెళుతుంటారు. తొలుత ఈయన మరో చోట ఏసీబీలోనే పనిచేశారు. అనంతపురంలో 2011 తరువాత నాలుగేళ్ల పాటు పనిచేశారు. అప్పటికే ఎక్కువ సమయం కావడం, ఆరోపణలు రావడంతో బలవంతంగా సాగనంపారు. మళ్లీ ఇక్కడికే వచ్చి దాదాపు రెండున్నరేళ్లు అవుతోంది. ఒకచోట పనిచేసిన అధికారిని మళ్లీ అదేచోటికి పంపడం విమర్శలకు తావిస్తోంది. జిల్లా సరిహద్దులోని మరో జిల్లా పరిధిలో ఈయన స్వగ్రామం ఉంది. దీంతో ఈయన జిల్లాపైనే ఎక్కువ మక్కువ చూపుతున్నట్లు సమాచారం. ఏళ్ల తరబడి తిష్ట వేసినందున అవినీతి అధికారుల జాబితా ఈయనకు సులభంగానే అందుతోందని తెలుస్తోంది. ఇక్కడికి వచ్చే ఫిర్యాదులు, ముఖ్య వ్యవహారాలను కర్నూలులో ఉండే ఇనచార్జ్‌ డీఎస్పీకి పెద్దగా తెలియజేయరని సమాచారం. ఎటూ తేలనివైతేనే చెబుతారట.

అలాచేస్తే లీగల్‌గా ఇరుక్కుంటారు...

అవినీతి నిరోధక శాఖలో ఆరుగురు ఇనస్పెక్టర్లు, ఇద్దరు ఎస్‌ఐలు ఉన్నారు. కొన్ని ఫిర్యాదులు, కేసుల విషయంలో ఎవరైనా ఆసక్తి చూపిస్తే.. ఈయన భయపెడతారట. ‘మీకేం తెలియదు.. అలాంటి విషయాల్లోకి తలదూర్చితే లీగల్‌గా ఇరుక్కుంటారు’ అని హెచ్చరిస్తారని సమాచారం. దీంతో తమకెందుకునే అని మిగతావారు దూకుడు తగ్గిస్తారని తెలుస్తోంది. విలేకరులను ఏసీబీ కార్యాలయంలోకి అసలు రానివ్వరు. ‘వాళ్లే పెద్ద వసూళ్ల రాయుళ్లు. నన్ను కలవొద్దని చెప్పండి..’ అంటారని తెలిసింది. ఏదైనా మాట్లాడి పంపించండి సర్‌ అని సిబ్బంది చెబితే... కసురుకుంటారని, తాను లేనని లేదా బిజీగా ఉన్నానని చెప్పమంటారట.

Updated Date - 2022-12-10T00:42:30+05:30 IST