గ్రానైట్‌

ABN , First Publish Date - 2022-11-24T23:55:21+05:30 IST

రాషా్ట్రనికి సరిహద్దుగా ఉన్న మడకశిర ప్రాంతంలో గ్రానైట్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో అక్రమార్కులకు మార్గం మరింత సుగమమైంది.

గ్రానైట్‌
పోలీసుల సమక్షంలో రెచ్చిపోతున్న వైసీపీ నాయకులు

రాత్రి వేళ విలువైన ఖనిజం అక్రమ తరలింపు

పట్టించుకోని అధికారులు

ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి

మడకశిర/మడకశిర టౌన, నవంబరు 24: రాషా్ట్రనికి సరిహద్దుగా ఉన్న మడకశిర ప్రాంతంలో గ్రానైట్‌ అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. ఇటీవలి కాలంలో సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఎత్తివేయడంతో అక్రమార్కులకు మార్గం మరింత సుగమమైంది. దీంతో కర్ణాటకలోని పలు క్వారీలనుంచి గ్రానైట్‌ అక్రమంగా తరలిపోతోంది. జీరో బిల్లులతో వాహనాలు వస్తుండటంతో ప్రభుత్వ ఆదాయానికి లక్షల్లో గండి పడుతోంది. మడకశిర నియోజకవర్గ సమీపంలో ఉన్న గ్రానైట్‌కు దేశవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో దాదాపు 216 క్వారీలు ఉండగా అందులో ప్రస్తుతం 143 క్వారీలు నడుస్తున్నాయి. కలర్‌ గ్రానైట్‌ క్వారీలు 78 నడుస్తున్నాయని, 36 క్వారీలు తాత్కాలికంగా నిలిపివేశారు. బ్లాక్‌ గ్రానైట్‌ క్వారీలు 76 దాకా ఆగిపోయాయి. మడకశిర నియోజకవర్గం వ్యాప్తంగా దాదాపు పెద్ద, చిన్న క్వారీలు 50 దాకా ఉన్నాయి. కర్ణాటక ప్రాంతానికి గ్రానైట్‌ అక్రమంగా తరలిస్తున్నా సంబంధిత శాఖ అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల గుడిబండ ప్రాంతంలో ఉన్న గ్రానైట్‌ క్వారీ నుంచి అక్రమంగా రాత్రి వేళల్లో తరలిపోతున్న లారీలను విజిలెన్స అధికారులు సీజ్‌ చేశారు. గ్రానైట్‌ను లారీల ద్వారా రాళ్లపల్లి, కదిరేపల్లి మీదుగా అదేవిధంగా అగళి, రొళ్ళ మండలాలు కర్ణాటక రాష్ట్రం సరిహద్దు ప్రాంతం కావడంతో గ్రానైట్‌ చాలా సులువుగా అక్రమంగా తరలిపోతోంది. అదేవిధంగా పలు ప్రాంతాల నుంచి హొట్టేబెట్ట, మోరుబాగల్‌ గ్రామాల మీదుగా రాత్రి వేళల్లో గ్రానైట్‌ను కర్ణాటక ప్రాంతానికి తరలిస్తున్నారు. చెక్‌పోస్టు లేకపోవడంతో రాత్రి వేళల్లో గ్రానైట్‌ లారీలు వెళ్తున్నాయి. పర్మిట్లు, వే బిల్లులు లేకుండా జీరో గ్రానైట్‌గా తరలిపోవడంతో ప్రభుత్వానికి భారీగా నష్టం చేకూరుతోంది.

20 దాకా కేసుల నమోదు

అనధికారికంగా, ఎలాంటి బిల్లులు లేకుండా తరలిపోతున్న గ్రానైట్‌ లారీలపై ఇప్పటి వరకు 20 కేసులు నమోదయ్యాయి. మడకశిరలో 7, గుడిబండలో 6, రొళ్ళలో 5, అగళిలో రెండు కేసులు చొప్పున నమోదయ్యాయి. అయినప్పటికీ గ్రానైట్‌ తరలిపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.

క్వారీలపై ప్రత్యేక నిఘా

క్వారీలపై ప్రత్యేక నిఘా ఉంచాం. అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతి రెండు మూడు రోజులకు ప్రొడక్షన వస్తుంది. ఆనలైన ద్వారా ప్రొడక్షనను నమోదు చేస్తారు. కొత్తగా ప్రొడక్షన ద్వారా వచ్చిన బ్లాక్‌లకు నంబర్లు వేసి ఆనలైనలో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా నిబంధనలకు వ్యతిరేకంగా వ్యవహరించే గ్రానైట్‌ క్వారీలపై చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేపట్టి 24 కేసులు నమోదు చేశాం.

- బాలసుబ్రహ్మణ్యం, మైనింగ్‌ శాఖ

Updated Date - 2022-11-24T23:55:26+05:30 IST