పంచాయతీ నిధులపై ప్రభుత్వ కన్ను

ABN , First Publish Date - 2022-09-11T05:37:10+05:30 IST

సర్కారు వింత చర్యలతో స్థానిక పాలన గాడితప్పుతోంది.పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చే కొద్దిపాటి ఆర్థిక సంఘం నిధులనూ స్వాహ చేస్తోంది.

పంచాయతీ నిధులపై ప్రభుత్వ కన్ను
కుణుతూరు గ్రామ సచివాలయం


విద్యుత బిల్లుల పేరుతో మళ్లింపునకు ప్లాన

త్వరలో పంచాయతీలకు ‘ఆర్థిక’ సంఘం నిధులు

ఖాతాల్లో డబ్బుల్లేక పాలకవర్గాల తంటాలు

ధర్మవరం, సెప్టెంబరు 10: సర్కారు వింత చర్యలతో స్థానిక పాలన గాడితప్పుతోంది.పంచాయతీలకు నిధులు ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే అందుకు భిన్నంగా కేంద్రం ఇచ్చే కొద్దిపాటి ఆర్థిక సంఘం నిధులనూ స్వాహ చేస్తోంది. పంచాయతీలకు వచ్చిన నిధులను వచ్చినట్టే ప్రభుత్వ ఇతర ఖాతాలకు మళ్లించుకునేందుకు మాస్టర్‌ ప్లాన వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు నెలల క్రితం ఆర్థికసంఘం నిధులను ప్రభుత్వం సంక్షేమపథకాల పేరుతో మళ్లించుకుంది. ఈ తరుణంలో త్వరలో మళ్లీ రాబోయే పంచాయతీ నిధులను కూడా లాగేసుకుంటుందా? అన్న అనుమానాలను సర్పంచులు వ్యక్తం చేస్తున్నారు.

 ఇటీవలి కాలంలో 15వ ఆర్థిక ప్రణాళికా సంఘం నిధులకు సంబంధించి వచ్చిన ఒక విడుత మొత్తాన్ని విద్యుతబిల్లుల కోసం రాష్ట్ర ప్రభుత్వం జమచేసుకుంది. మూడో విడతనిధులతో మళ్లీ విద్యుత బిల్లులు చెల్లించాలని చెబుతోంది. బకాయులు కట్టకపోతే సరఫరానిలిపివేస్తామని విద్యుతశాఖ నోటీసులు జారీ చేస్తుండటంతో పంచాయతీల్లో కలకలం మొదలైంది. ఒకవైపు విద్యుతచార్జీలతోపాటు మరో వైపు సర్‌చార్జీల పేరుతో మరింత భారాన్ని ప్రభుత్వమే మోపుతోంది. గ్రామ పంచాయతీలకు విద్యుత బిల్లులు గుదిబండగా మారాయి. పంచాయతీల్లోఉన్న నిధులను రాత్రికి రాత్రే మళ్లించడంతో ఖాతాలు ఖాళీ అయ్యాయి. దీంతో పల్లెల్లో కనీసం బ్లీచింగ్‌ చల్లేందుకు కూడా నిధులులేని పరిస్థితి. ఈ నేపథ్యంలో విద్యుత బిల్లులు చెల్లింపు ఉద్యోగులకు సంకటంగా మారింది. శ్రీసత్యసాయిజిల్లాలో 32 మండలాల్లో  466 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వాటిలో కోట్లాధి రూపాయల మేర విద్యుత బకాయిలు ఉన్నాయి. ఇటీవల కాలంలో విద్యుతశాఖ బకాయిలు వసూలు కోసం ఏకంగా సరఫరానే నిలిపివేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. త్వరగా బిల్లులు చెల్లించాలని ఇప్పటికే ఆ శాఖ పంచాయతీలకు నోటీసులు కూడా జారీ చేసింది. అయితే ఆర్థిక సంఘం మూడో త్రైమాసికానికి సంబంధించి నిధులు రాబోతున్న నేపథ్యంలో  గ్రామ పంచాయతీల్లో పెండింగ్‌లో ఉన్న విద్యుత బిల్లులు చెల్లించాలని ఒత్తిడి పెంచడంతో సర్పంచుల్లో ఆందోళ న నెలకొంది.


నాలుగు నెలల క్రితమే జమ

నాలుగు నెలల క్రితం 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల కావడంతో విద్యుత బకాయిల పేరుతో వాటిని జమచేసుకుంది. త్వరలో మూడోవిడత ఆర్థికసంఘం నిధులు రానున్న నేపఽథ్యంలో ఇప్పుడు విద్యుత బకాయిల చెల్లింపు అంశం ప్రాధాన్యతను సంతరించుకుంది. గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులకు కేంద్రం ఇచ్చే ఆర్థిక సంఘం నిధులను స్వాహా చేసి తిరిగి ఇప్పుడు విద్యుత బకాయిలను చూపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.


బిల్లులు కూడా ఇవ్వని పరిస్థితి

ఆయా పంచాయతీల్లో వినియోగించే విద్యుతపై కనీసం బిల్లులు కూడా ఇవ్వకుండా వేలల్లో  బకాయిలు చూపించడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా పంచాయతీల్లో ఏర్పాటుచేసిన మీటర్లకు నెలవారి రీడింగ్‌ తీసి బిల్లులు ఇవ్వాల్సి ఉంది. అయితే వాటిని ఇవ్వడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఆయా గ్రామ పంచాయతీల్లో ఎప్పుడో ఏర్పాటుచేసిన మీటర్ల ఆధారంగా బిల్లులు తీస్తూ లక్షల్లో పెండింగ్‌లో ఉన్నట్టు చూపుతున్నారని పలువురు సర్పంచలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అధికార పార్టీ మద్దతుదారుల్లోనూ మనోవేదన 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఆపార్టీ సానుభూతిపరులే సర్పంచులుగా గెలుపొందారు. పాలకవర్గాల ఏర్పాటు నుంచి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో నూతనంగా ఎన్నికైన సర్పంచుల్లో మరింత ఆందోళన నెలకొంది. పాలకవర్గాలకు ముందు గ్రామపంచాయతీల్లో అధికారుల పాలన ఉండగా ఆ సమయంలో నిధుల మొత్తాన్ని దుర్వినియోగం చేశారు. అనంతరం 14వ ఆర్థిక సంఘం నిధులను రాత్రిరాత్రికే ప్రభుత్వం స్వాహా చేయగా సర్పంచులకు ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది.


రాత్రికిరాత్రే లాగేసుకున్నారు    

15వ ఆర్థిక ప్రణాళికా సంఘం నిధులను కూడా ఈ ఏడాది మార్చిలో రాత్రికిరాత్రే రాష్ట్ర ప్రభు త్వం ఇతర ప్రయోజనాలకు వినియోగించింది. ఈ అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు పెద్దఎత్తున ఆందోళనకు దిగడంతో ఆ నిధులను ప్రభు త్వం తిరిగి పంచాయతీ ఖాతాలకు జమచేసింది. ఆ వెంటనే నిధులను విద్యుతబకాయిలు పేరుతో జమచేసుకుంది. తాజాగా ఇప్పుడు మరోసారి విద్యుత బకాయిలను వెలుగులోకి తెచ్చి త్వరలో పంచాయతీలకు రానున్న 15వ ఆర్థికసంఘం మూడో విడత నిధులను మళ్లించేందుకు ప్రభుత్వం కొత్త ఎత్తుగడ వేసిందనే విమర్శలున్నాయి. 

Updated Date - 2022-09-11T05:37:10+05:30 IST