-
-
Home » Andhra Pradesh » Ananthapuram » gorantla item-NGTS-AndhraPradesh
-
గర్భిణికి పురిటి నొప్పులు
ABN , First Publish Date - 2022-09-27T05:54:33+05:30 IST
మండలంలోని వడిగేపల్లి పంచాయతీ పరిధి వి.గొల్లపల్లిలో 400 మందికి పైబడి జనాభా ఉంది. పెద్ద ఊరే. అయినా రోడ్డు మాత్రం లేదు. అక్కడక్కడా రాళ్లు తేలిన మట్టిరోడ్డే దిక్కు.

రోడ్డుపై ఇరుక్కున్న అంబులెన్స
గంటన్నరపాటు ప్రసవ వేదన
గోరంట్ల
మండలంలోని వడిగేపల్లి పంచాయతీ పరిధి వి.గొల్లపల్లిలో 400 మందికి పైబడి జనాభా ఉంది. పెద్ద ఊరే. అయినా రోడ్డు మాత్రం లేదు. అక్కడక్కడా రాళ్లు తేలిన మట్టిరోడ్డే దిక్కు. ఇక ఆ ఊరిలోకి కనీసం 108 వాహనం కూడా రాదు. ఊరి బయట వరకే వస్తుంది. రోగులు అత్యవసరమైనా.. అక్కడి వరకు నడుచుకుంటూ వెళ్లి, 108 వాహనం ఎక్కాల్సిన దుస్థితి నెలకొంది. గ్రామానికి చెందిన జయచంద్ర భార్య జయలక్ష్మి గర్భిణి. సోమవారం పురిటినొప్పులు వచ్చాయి. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లాలి. 108 వాహనానికి ఫోన చేశారు. గ్రామ సమీపం వరకు వాహనం రావాల్సి ఉంది. అక్కడే రోడ్డుపై ఆంజనేయస్వామి ఆలయం వద్ద వడిగేపల్లి చెరువు కాలువ ఉంది. దానిపై కల్వర్టు లేకపోవడంతో తాత్కాలికంగా బండరాళ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఉదయం 10.00 గంటల ప్రాంతంలో 108 వాహనం గ్రామ సమీపంలోకి చేరుకుంది. చెరువు కాలువ దాటుతుండగా.. దానిపై వేసిన బండరాయి విరిగిపోవడంతో 108 వాహనం అందులో ఇరుక్కుంది. జయలక్ష్మిని కుటుంబ సభ్యులు వాహనం వద్దకు తీసుకొచ్చారు. విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్దఎత్తున అక్కడికి చేరుకున్నారు. పక్కూరి నుంచి జాకీ తెప్పించి, వాహనాన్ని అతికష్టమ్మీద బయటకు తీసుకొచ్చారు. ఇలా దాదాపు గంటన్నర గడచిపోయింది. అప్పటివరకు గర్భవతి జయలక్ష్మి ప్రసవ వేదనతో విలవిల్లాడింది. అప్పటికే ఆలస్యమవడంతో ఆమెను గోరంట్ల ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హిందూపురానికే తీసుకెళ్లారు.