ఇంటర్వ్యూకు వెళ్తూ.. కానరాని లోకాలకు!

ABN , First Publish Date - 2022-09-14T05:29:18+05:30 IST

ఇంటర్వ్యూ కోసం బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు మృత్యు రూపంలో కబళించింది. నిండా పాతికేళ్లు కూడా లేని వారు పొట్టకూటి కోసం ఊరుకాని ఊరికి వచ్చి మృత్యువు ఒడికి చిక్కారు

ఇంటర్వ్యూకు వెళ్తూ.. కానరాని లోకాలకు!
భార్గవ్‌ (ఫైల్‌)

 సోమందేపల్లిలో బైక్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు..  యువతి, యువకుడు మృతి

సోమందేపల్లి, సెప్టెంబరు 13: ఇంటర్వ్యూ కోసం బైక్‌పై వెళ్తున్న ఇద్దరిని ఆర్టీసీ బస్సు మృత్యు రూపంలో కబళించింది. నిండా పాతికేళ్లు కూడా లేని వారు పొట్టకూటి కోసం ఊరుకాని ఊరికి వచ్చి మృత్యువు ఒడికి చిక్కారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. కూడేరు మండలం మరుట్ల గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమార్తె శ్రావణి(25), వజ్రకరూరు మండలం కందికుంటపల్లికి చెందిన బసవరాజు కుమారుడు భార్గవ్‌(20)లు గత కొంతకాలంగా సోమందేపల్లి సమీపంలోని కియ అనుబంధ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం మరో కంపెనీలో ఇంటర్వ్యూ ఉండటంతో సోమందేపల్లి నుంచి ద్విచక్రవాహనంలో బయలుదేరి వెళ్లారు. సమీపంలోని జాతీయరహదారిపైకి వెళ్తున్న సమయంలో పాలసముద్రం నుంచి పెనుకొండ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ముందునుంచి ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనం నుంచి శ్రావణి, భార్గవ్‌లు కిందకు పడిపోయాడు. వీరిద్దరిపై ఆర్టీసీ బస్సు వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. వీరి పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రావణిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. భార్గవ్‌ను బెంగళూరు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. శ్రావణి అనంతపురంలో చికిత్స పొందుతూ మృతిచెందింది. ఇదిలా ఉండగా రోడ్డుపై పంట నూర్పిడికోసం వేసిన కళ్లాల వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పంట నూర్పిడి కళ్లాలను తప్పిస్తూ ఆర్టీసీ బస్సు పక్క నుంచి వెళ్లడంతోనే ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై సోమందేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.Read more