గలీజ్‌

ABN , First Publish Date - 2022-09-27T04:54:24+05:30 IST

అధికార పార్టీ నేతలు ఇసుక రీచలలో కాసుల వేట సాగిస్తున్నారు.

గలీజ్‌
బుక్కరాయసముద్రం స్టాక్‌ పాయింట్‌ వద్ద ఇసుక తరలిస్తున్న సిబ్బంది

- ఇసుక రీచలలో కాసుల వేట

- సబ్‌లీజ్‌లో...సబ్‌లీజ్‌

- విచ్చలవిడిగా అక్రమ రవాణా

- ప్రకటనలకే ఇసుక ధరల నిర్ణయం 

- పేరుకే పారదర్శకత...అంత పారదోలడమే

- శ్రుతి మించిన అధికారపార్టీ మాజీప్రజాప్రతినిధి ఆగడాలు 

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 26: అధికార పార్టీ నేతలు ఇసుక రీచలలో కాసుల వేట సాగిస్తున్నారు. ఇసుకను విచ్చలవిడిగా అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. అధికారపార్టీ నేతల ఇసుక దందా ఆగడాలకు అటు పోలీసులు, ఇటు రవాణా, మైన్స అధికారులు దాసోహమవుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఇసుక అక్రమ రవాణా మరింత సాగుతోందనే చర్చ సాగుతోంది. ఇక ఇసుక బుక్‌ చేసుకుందామని సాధారణ ప్రజలు ఆనలైన వెబ్‌సైట్‌ తెరిచి చూస్తే త్వరలో అందుబాటులోకి వస్తుంది వేచి ఉండు అనే మెసేజ్‌ తప్పా ఓపెన కావడం లేదు. 


అధికారికంగా 10రీచలు... అనధికారికంగా లెక్కలేనన్ని!


  జిల్లాలో అధికారికంగా 10 ఇసుక రీచలను గుర్తించారు.  జేపీ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ఇసుక మైనింగ్‌ చేస్తోంది. కంబదూరు మండలం చెన్నంపల్లిలో అక్కడ సర్పంచ అధికారపార్టీకి సంబంధించిన వ్యక్తి కాకపోవడం తో ఇసుక రీచను అధికారపార్టీకి చెందిన నేతలే యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం పెన్నానదిలో నీరు ప్రవహిస్తుండటంతో మైనింగ్‌ ఆపారు. కణేకల్లు మండలం రచ్చుమర్రి, బ్రహ్మసముద్రం మండలం అంజయ్యదొడ్డి, యల్లనూరు చింతకాయమంద, బెళుగుప్ప మండలం నరసాపురం, తాడిపత్రి మండలం ఆలూరు, వంగనూరు, యల్లనూరు మండలం చిలమకూరు, పామిడి మండలం తంబలపల్లిలో ఇసుక రీచలలో నీరు ఉన్నా అలాగే తవ్వుకుంటున్నారు. యల్లనూరు మండలం లక్షుంపల్లిలో ఇసుక రవాణా యఽథేచ్ఛగా సాగుతోంది. జిల్లాలో 10 రీచలలో మాత్రమే ఇసుక తవ్వుకోవడానికి అనుమతిచ్చా రు. అయితే ఇవి కాకుండా లెక్కలేనన్ని చోట్ల ఇసుక తవ్వ కాలు ఇష్టానుసారంగా సాగుతున్నాయి. ఇసుక అక్రమ రవాణాతో అధికారపార్టీ నేతలు రూ.కోట్లు సొమ్ము చేసుకుంటున్నారు. స్టాక్‌ పాయింట్లలో నో స్టాక్‌ అని బోర్డు పెట్టి ఇసుకను అక్రమంగా తరలించేస్తున్నారు. బుక్కరాయసముద్రం వద్ద వేల టన్నుల ఇసుక పనికి రానిదని గుర్తించి అలాగే వదిలేశారు. ఆ ఇసుకదిబ్బలో పిచ్చిమొక్కలు పెరిగాయి. జిల్లాలో ఇసుక రవాణా అక్రమంగా, అస్తవ్యస్తంగా సాగుతోందని చెప్పడానికి ఇవి నిదర్శనంగా నిలుస్తున్నాయి. 


ప్రకటకలకే పరిమితమైన ఇసుక ధరల నిర్ణయం


జిల్లాలో ఇసుక ధరలను ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ ఆ ధరలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి. ఇందులో మతలబు ఏంటంటే...రవాణా, టోకెన పేరుతో ప్రజలపై అదనపు ఆర్థిక భారం మోపుతున్నారు. ప్రభుత్వం సెబ్‌, టోల్‌ఫ్రీ, హెల్ప్‌లైన అంటూ ఏర్పాటు చేసినా ఇసుక కాంట్రాక్ట్‌ దక్కించుకున్న జేపీ ఏజెన్సీస్‌ మాత్రం నిర్ణయించిన ప్రత్యేక ధరలకే ఇసుకను తరలిస్తున్నారనే విమర్శలు లేకపోలేదు. అధికధరలకు ఇసుక విక్రయిస్తే రూ.2లక్షల వరకు జరిమానా, రెండేళ్ల జైలు శిక్ష అంటూ పెద్ద అక్షరాలతో ప్రభుత్వం ప్రకటనలు ఇస్తూ వస్తోంది. అయితే ఇది ప్రకటనలకే పరిమితమవుతోంది. అధికారపార్టీకి చెందిన నేతలే జేపీ ఏజెన్సీతో కుమ్మక్కై దోచుకుంటున్నా అటు గనులు, భూగర్భ వనరుల శాఖ అధికారుల మాత్రం చూసీ చూడనట్లుగా ప్రేక్షకపాత్ర వహిస్తున్నారు. ఇసుక గరిష్ఠంగా టన్ను రూ.475కు మించరాదని సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వమే ప్రకటన చేసినప్పటికీ అమలు కావడం లేదనేది గట్టిగా వినిపిస్తున్న విమర్శ. ఆనలైనలో బుక్‌చేసుకుంటే ఇసుక వస్తుందని జేపీవీఎల్‌ సంస్థ ప్రకటిస్తున్నప్పటికీ ఆ మేరకు అమలు కావడం లేదనేది ప్రజల వాదన. ప్ర భుత్వం ప్రకటించిన మేరకు టన్నుకు రవాణా, టోకెనతో కలిపి రాయదుర్గం రూ.630, కళ్యాణదుర్గం రూ.475, శింగనమల రూ.845, అనంతపురం అర్బన రూ.790, గుంతకల్లు రూ.785, ఉరవకొండ రూ.730, రాప్తాడు రూ.700, తాడిపత్రి రూ.725గా నిర్ణయించారు. ఈ ధరలు ప్రకటనలకే పరిమితమయ్యాయి.  


భవన నిర్మాణాలు... ప్రభుత్వ పనులు


  జిల్లాలో ప్రైవేటు, ప్రభుత్వ పనులకు ఇసుక అందు బాటులో ఉంది. అయితే సాధారణ ప్రజలకు మాత్రం లభ్యం కావడం లేదు. నాడు-నేడు కింద చేపడుతున్న పనులకు ఇసుక దొరుకుతుంది. అదే పేదోడికి మంజూరైన ఇంటిని నిర్మించుకోవడానికి ఇసుక లభ్యం కావడం లేదు.  ప్రభుత్వ యంత్రాంగం మాత్రం ఏమి పట్టనట్లుగా వ్యవహరిస్తుండంపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు నిర్మాణాలతో పాటు సిమెంట్‌ ఇటుకల తయారీ, ఇతర నిర్మాణాలకు దొరికిన ఇసుక పేదలకు ఎందుకు దొరకడం లేదనేది ఇక్కడ వ్యక్తమవుతున్న ప్రశ్న.


అధికారపార్టీ నేతకు సబ్‌లీజ్‌


జిల్లాలో అధికారపార్టీకి చెందిన మాజీ ప్రజాప్రతినిధికి ఇసుక సబ్‌లీజ్‌ కట్టబెట్టినట్లు తెలుస్తోంది. ఇసుక తవ్వకాల్లో జేపీ వెంచర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ ప్రధాన కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తోంది. టర్న్‌కీ ఎంటర్‌ప్రైజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సబ్‌ కాంట్రాక్టర్‌గా వ్యవహరిస్తోంది. టర్న్‌కీ నుంచి జిల్లాకు చెందిన అధికారపార్టీ మాజీ ప్రజాప్రతినిధి సబ్‌లీజ్‌కు తీసుకున్నట్లు సమాచారం. దీంతో జిల్లాలో అధికారికంగా, అనధికారికంగా ఉన్న ఇసుక రీచలలో సబ్‌లీజ్‌ దక్కించుకున్న అధికారపార్టీ మాజీ ప్రజాప్రతినిధి, అనుచరగణం పాగా వేస్తోంది. అయితే అక్కడక్కడ అధికారపార్టీ నేతలే రివర్స్‌ అవుతున్నారని తెలుస్తోంది. మా అడ్డాకొచ్చి నీ ఆగడాలు ఏంటని నిలదీస్తున్నట్లు సమాచారం. అయితే సాక్షాత్తు సీఎం, ఓ మంత్రి ద్వారానే ఇదంతా జరుగుతోందని తెలుసుకుని పక్కకు తప్పుకుంటున్నారని చర్చ సాగుతోంది. ఇప్పటి వరకు దాదాపు రీచల్లో ఇసుక తవ్వడానికి వీలులేకుండా నీరు ఉండటంతో ఎక్కడా అలాంటి సంఘటనలు ఎదురుకాలేదు. ఇప్పుడిప్పుడే నదులు, వాగులు, వంకల్లో నీరు తగ్గుముఖం పడుతుండటంతో ఇసుక తవ్వకానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో వ్యతిరేకగాలులు వీస్తున్నట్లు తెలుస్తోంది. సబ్‌లీజ్‌లు పెరిగిపోతుండటంతో ఇసుక వినియోగదారుడిపై ఆర్థిక భారం మోపడం ఖాయమని భావిస్తున్నారు.   Read more