పెనం మీద నుంచి.. పొయ్యిలోకి..!

ABN , First Publish Date - 2022-07-05T06:15:56+05:30 IST

విద్యుత శాఖలో ఇటీవల వచ్చిన నిబంధనలు అన్నదాతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి.

పెనం మీద నుంచి.. పొయ్యిలోకి..!


- థర్డ్‌ పార్టీ సర్వే తరువాతే వ్యవసాయ విద్యుత కనెక్షన

- కనెక్షన్ల మంజూరుకు మరింత ఆలస్యం

- రైతులకు సమాధానం చెప్పలేని క్షేత్రస్థాయి సిబ్బంది

- అన్నదాతకు తప్పని నిరీక్షణ


అనంతపురంరూరల్‌, జూలై 4: విద్యుత శాఖలో ఇటీవల వచ్చిన నిబంధనలు అన్నదాతలకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. కొత్త కనెక్షన్ల మంజూరు సర్వేకు విద్యుత పంపిణీ సంస్థ థర్డ్‌ పార్టీని ప్రవేశపెట్టింది. వారి సర్వే తర్వాతే  సర్వీసులు మంజూరు చేయాలని నిబంధన పెట్టింది. అసలే ఏళ్ల తరబడి విద్యుత కనెక్షన్ల కోసం నిరీక్షిస్తున్న రైతులకు ఇది మరింత ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 5వేల దరఖాస్తులు సర్వే చేయాల్సి ఉందని అధికారుల లెక్కలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులకు సమాధానం చెప్పలేక క్షేత్రస్థాయిలోని అధికారులు, ఉద్యోగులు సతమతమవుతూ ముఖం చాటేస్తున్నారు. 


థర్డ్‌ పార్టీ సర్వే తరువాతే అంచనాలు 


సాధారణంగా రైతులు వ్యవసాయ కనెక్షన్ల కోసం మీసేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకుంటారు. ఆ తరువాత క్షేత్రస్థాయిలోని విద్యుత అధికారులు ఆ దరఖాస్తులను పరిశీలిస్తారు. అనంతరం అవసరమయ్యే విద్యుత స్తంభాలు, ఇతరత్ర విద్యుత సామగ్రిపై అంచనా వేసి రైతులకు తెలియజేస్తారు. ఆ తరువాత రైతులు డీడీల రూపంలో డబ్బులు చెల్లిస్తారు. ఈక్రమంలోనే సీనియార్టీ ప్రకారం విద్యుత కనెక్షన మంజూరు చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తి స్థాయిలో జరిగి రైతుకు కనెక్షన ఇచ్చేలోపు రెండు మూడేళ్లు సమయం పడుతోంది. ఇప్పుడున్న నిబంధనలతోనే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో విద్యుత పంపిణీ సంస్థ థర్డ్‌ పార్టీని ఇందులోకి తెచ్చింది. రైతులు దరఖాస్తులు చేసుకున్న తరువాత సర్వీసు కొరకు భూమి పత్రాలు, ఇతరత్ర పత్రాలు ఉన్నాయో లేదా చూడటంతోపాటు థర్డ్‌ పార్టీ సంస్థ సభ్యులు క్షేత్ర స్థాయి పరిశీలన, విచారణ అనంతరం ఒక రిపోర్టు రాసి, ఆ నివేదికను కార్పొరేషన కార్యాల యానికి పంపుతారు. కార్పొరేషన కార్యాలయం నుంచి అను మతులు వచ్చిన తరువాతనే క్షేత్రస్థాయిలోని అధికారులు అంచనా వేస్తారు. ఈ వ్యవహారం మొత్తం పూర్తిస్థాయిలో జరిగే సరికి ఆరు నెలల సమయం పడుతోందని ఆయా వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక అంచనా వేయడం, రైతులు డబ్బులు కట్టడం, వారికి సీనియార్టీ మేరకు కనెక్షన ఇచ్చేలోపు మరింత ఆలస్యం జరుగుతోందని పలువురు క్షేత్రస్థాయిలోని అధికారులు, ఉద్యోగులు వాపోతున్నారు. ఈక్రమంలో కనెక్షనల కోసం కార్యాలయాలకు వచ్చే రైతులకు  సమాధానం చెప్పలేకపోతున్నామని పలువురు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు ఉందని పలువురు రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


5వేలకుపైగా దరఖాస్తులు


ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ సర్వీసుల మంజూరు కోసం సర్వే నిర్వహణను ఓ థర్డ్‌ పార్టీకి అప్పగించినట్లు సమాచారం. ఆ థర్డ్‌ పార్టీ సభ్యులు సర్వే చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారన్న వాదనలు ఆయా వర్గాల నుంచే వినిపిస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో వ్యవసాయ కనెక్షన్ల కోసం వేల దరఖాస్తులు వచ్చాయి. ఇందులో కొన్ని సర్వే నిమిత్తం థర్డ్‌ పార్టీకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే సకాలంలో సర్వే జరగకపోవడంతో దరఖాస్తులు రోజుకు రోజుకు పెరిగిపోతున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 5వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అనంతపురం, కళ్యాణదుర్గం ప్రాంతా ల్లో దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి. ఇవికాక ఉమ్మడి జిల్లాలో 70వేలకు పైగా కొత్త దరఖాస్తులు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి అయ్యే సరికి ఇంకెన్నేళ్లు పడుతోందో మరి. 


పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకే..


వ్యవసాయ కనెక్షన్ల మంజూరులో పూర్తిస్థాయిలో విచారణ చేసేందుకు పంపిణీ సంస్థ థర్డ్‌ పార్టీని ఏర్పాటు చేసింది. జిల్లాలో ఓయాంత సొల్యూషన్స సంస్థ ఇక్కడ పనులు చేస్తోంది. ఎక్కువ శాతం రైతులు దరఖాస్తుల్లో వివరాలు, డాక్యుమెంట్లు ఇతరత్ర వాటిని అప్‌లోడ్‌ చేయడం లేదు. దీంతో థర్డ్‌ పార్టీ వారు రైతుల నుంచి పూర్తి స్థాయిలో డాక్యుమెంట్లు తీసుకుని, దరఖాస్తు చేసుకున్న రైతు పొలం సమీపంలో ఇతరులకు ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి? అక్కడే దరఖాస్తు రైతుకు కనెక్షన ఇచ్చేందుకు వీలుందా..లేదా తదితర వాటిని పరిశీలించి నివేదిస్తారు.  సర్వేకు వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన చేయాలని థర్డ్‌ పార్టీ సభ్యులకు సూచించాం. సర్వే త్వరితగతిన చేయించి ఎస్టిమేషన్లు వేస్తాం. 

Read more