సిరుల విరులు

ABN , First Publish Date - 2022-10-04T05:16:34+05:30 IST

బంతిపూల రైతుకు లాభాల పంట పండింది. ఇటీవలి వరకు సరైన ధరలు లేక నష్టాలపాలయ్యాడు. దసరా పండుగ అన్నదాతలకు అసలైన పండుగను తీసుకొచ్చింది.

సిరుల విరులు

విరగబూసిన బంతిపూలు

దసరా నేపథ్యంలో భారీగా పెరిగిన ధరలు

రైతుకు లాభాల పంట

గాండ్లపెంట, అక్టోబరు 3: బంతిపూల రైతుకు లాభాల పంట పండింది. ఇటీవలి వరకు సరైన ధరలు లేక నష్టాలపాలయ్యాడు. దసరా పండుగ అన్నదాతలకు అసలైన పండుగను తీసుకొచ్చింది. బంతిపూల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏకంగా సెంచరీ కొట్టేశాయి. హైదరాబాద్‌లో సెంచరీ దాటేశాయి. ఈసారి దిగుబడి కూడా ఆశాజనకంగా వచ్చింది. దీంతో రైతుకు లాభాలే.. లాభాలు. రూ.లక్షల్లో ఆదాయం అర్జిస్తున్నారు.


రూ.లక్షల్లోనే లాభాలు..

మండలవ్యాప్తంగా రైతులు దాదాపు 80 ఎకరాల్లో బంతిపూలు సాగు చేశారు. నర్సరీల్లో మొక్కలు కొనుగోలు చేసి, నాటారు. కలుపు నివారణ, క్రిమిసంహారక మందులకు కలిపి ఎకరాకు దాదాపు రూ.40 వేలు వెచ్చించారు. పంట కోతకొచ్చింది. తొలి కోత కావడంతో దిగుబడి విపరీతంగా వచ్చింది. ఎకరాకు 3 టన్నులకుపైగా దిగుబడి వచ్చింది. కిలో ప్రస్తుతం మార్కెట్‌లో రూ.100 పలుకుతోంది. తెలంగాణలో అయితే అంతకు ఎక్కువగానే ధరలు దక్కుతున్నాయి. దీంతో పలువురు హైదరాబాద్‌కు పూలను తరలిస్తున్నారు. ఈ రేట్ల ప్రకారం ఎకరా దిగుబడికి రూ.3 లక్షలకుపైగానే వస్తోంది. పెట్టుబడిపోను ఎకరాలో రూ.2.50 లక్షలకుపైగానే లాభం అర్జిస్తున్నారు. మండలంలో పదెకరాల వరకు కూడా బంతిపూలు సాగు చేశారు. వారందరూ రూ.లక్షల్లోనే లాభాలు గడిస్తున్నారు. దీంతో అన్నదాతల ఇళ్లకు అసలైన పండుగ వచ్చింది.


రూ.3 లక్షలకుపైగా లాభం

1.25 ఎకరాలు కౌలుకు తీసుకుని, బంతిపూలు సాగు చేశా. ఎకరాకు రూ.30వేల వరకు  పెట్టుబడి పెట్టా. మంచి సైజులో బంతిపూలు వచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌కు బంతిపూలు తరలిస్తున్నా. అక్కడ కేజీ ధర వంద పలుకుతోంది. ఖర్చులుపోను రూ.3లక్షలకుపైగానే ఆదాయం వస్తుంది.

శ్రీరాములు, రైతు, కటారుపల్లి

Read more