కౌంటర్‌ దాఖలు చేయండి

ABN , First Publish Date - 2022-02-23T06:17:17+05:30 IST

తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహావిష్కరణ వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది

కౌంటర్‌ దాఖలు చేయండి
కేతిరెడ్డి రామిరెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే పెద్దారెడ్డి అనుచరులు (ఫైల్‌)

అధికారులకు హైకోర్టు ఆదేశం

తాడిపత్రిలో ఎమ్మెల్యే తండ్రి విగ్రహ వివాదం 

హైకోర్టును ఆశ్రయించిన సోమశేఖర్‌ నాయుడు

అనంతపురం, ఫిబ్రవరి 22(ఆంద్రజ్యోతి): తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తండ్రి రామిరెడ్డి విగ్రహావిష్కరణ వివాదం రాష్ట్ర హైకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు, రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను ఉల్ల్లంఘించడంతో పాటు, మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా, జాతీయ రహదారిపై విగ్రహం ఏర్పాటు చేయడాన్ని సవాల్‌ చేస్తూ.. ఆ ప్రాంతానికి చెందిన సోమశేఖర్‌నాయుడు ఇటీవలే హైకోర్టును ఆశ్రయించారు. ఆయన దాఖలు చేసిన పిటిషనను హైకోర్టు మంగళవారం విచారణకు స్వీకరించింది. తాడిపత్రి పట్టణంలోని యాక్సిస్‌ బ్యాంకు సమీపంలో జాతీయ రహదారిపై విగ్రహం ఏర్పాటుకు సంబంధించి కౌంటర్‌ దాఖలు చేయాలని మున్సిపల్‌, ఆర్‌అండ్‌బీ, రెవెన్యూ శాఖల అధికారులను హైకోర్టు ఆదేశించింది. కౌంటర్‌ దాఖలుకు రెండు వారాలు గడువు విధించింది. 


అభ్యంతరం తెలిపినా..

ఎమ్మెల్యే తండ్రి రామిరెడ్డి విగ్రహాన్ని ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయకూడదని తాడిపత్రి మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి అభ్యంతరం తెలిపారు. మున్సిపల్‌ కౌన్సిల్‌ ఆమోదం లేకుండా విగ్రహాన్ని ఎలా ఏర్పాటు చేస్తారని మీడియా వేదికగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేతో పాటు అధికారులనూ ప్రశ్నించారు. జాతీయ రహదారులపై విగ్రహాల ఏర్పాటును సుప్రీంకోర్టు నిషేధించిందని, దీనిపై హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు వెలువరించిందని గుర్తు చేశారు. న్యాయస్థానాల ఉత్తర్వులను ఖాతరు చేయకుండా, ఎమ్మెల్యే తన తండ్రి విగ్రహాన్ని ఏర్పాటు చేయిస్తుండటంతో మున్సిపల్‌ వైస్‌ ఛైర్మనలు, కౌన్సిలర్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ చైర్మనకు కూడా ఇదే అంశంపై వారు ఫిర్యాదు చేశారు. అయినా, ఎమ్మెల్యే అనుచరులు అంతా మా ఇష్టమన్న రీతిలో ముందుకు వెళ్లారు. నిబంధనలకు విరుద్ధంగా విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే, మున్సిపల్‌ చైర్మన్ల మధ్య ‘స్టాచ్యూ ఫైట్‌’ కొనసాగుతోంది. రామిరెడ్డి విగ్రహ ఏర్పాటును అడ్డుకునేందుకు మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌ రెడ్డి, ఆయన అనుచరులు ఎన్ని ప్రయత్నాలు చేసినా, అధికారంలో ఉన్నామనే దర్పంతో ఎమ్మెల్యే అనుచరులు విగ్రహాన్ని ఆవిష్కరించారు. గుట్టుచప్పుడు కాకుండా, విగ్రహంపై కప్పిన ముసుగును తొలగించి, మమ అనిపించారు.


హైకోర్టుకు వివాదం..

కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో జేసీ అనుచరుడు సోమశేఖర్‌నాయుడు హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ అంశంపై కౌంటర్‌ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారం జిల్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది. కోర్టు ఆదేశాల నేపథ్యంలో.. అధికారులు ఇరకాటంలో పడ్డారు. ఏ అంశాల ప్రాతిపదికన కౌంటర్‌ దాఖలు చేయాలన్న చర్చ, సందిగ్ధం వారిలో మొదలైనట్లు తెలుస్తోంది. అటు సుప్రీంకోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన, ఇటు కౌన్సిల్‌ ఆమోదం లేకపోవడంతో వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. హైకోర్టుకు ఏమని కౌంటర్‌ దాఖలు చేస్తారో అన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.


Updated Date - 2022-02-23T06:17:17+05:30 IST