-
-
Home » Andhra Pradesh » Ananthapuram » Farmers lives were shattered by the wrath of Vedavati-NGTS-AndhraPradesh
-
ఉగ్ర వేదవతితో రైతు బతుకులు ఛిద్రం
ABN , First Publish Date - 2022-09-10T05:52:11+05:30 IST
నదీ తీరాన్ని నమ్ముకున్నారు. దశాబ్దాలుగా పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. అరకొర దిగుబడులే అయినా.. సేద్యాన్ని వీడలేదు

పంటను మింగిన హగరి
వరదలో కొట్టుకుపోయిన వేల ఎకరాల పంట
అన్నదాతకు రూ.కోట్ల పెట్టుబడులు నష్టం
విపత్తు సాయం అందించాలని వినతి
నదీ తీరాన్ని నమ్ముకున్నారు. దశాబ్దాలుగా పలు రకాల పంటలను సాగు చేస్తున్నారు. అరకొర దిగుబడులే అయినా.. సేద్యాన్ని వీడలేదు. కొందరు వర్షాధారంగా, మరికొందరు బోరుబావులపై ఆధారపడ్డారు. వేదవతి నదిలో ప్రవాహం ఎప్పుడోగానీ ఉండదు. ఉన్నా.. ప్రశాంతంగా ముందుకు సాగుతుంది. పంట పొలాలకు ముప్పు తెచ్చిన సందర్భమే లేదు. ఇది రైతులకు సుమారు రెండు దశాబ్దాల అనుభవం. కానీ అనూహ్యంగా నది ఉగ్రరూపం దాల్చింది. అనుకోని వరదకు వేలాది ఎకరాల్లో పంటలు కొట్టుకుపోయాయి. అన్నదాతలకు తీరని నష్టం జరిగింది. రూ.కోట్ల పెట్టుబడులు గంగపాలయ్యాయి. పంట పొలాల్లో వరదనీటిని చూసి అన్నదాతలు కన్నీరు పెడుతున్నారు. వేదవతి హగరి నదిపై నిర్మించిన భైరవానతిప్ప ప్రాజెక్టు నుంచి ఊహించని రీతిలో 65 వేల క్యూసెక్కుల నీరు ఒక్కసారిగా నదికి వదిలారు. దీంతో పరివాహక ప్రాంతంలో పంటలన్నీ కొట్టుకుపోయాయి.
- రాయదుర్గం
ఇక్కడే నష్టం
బ్రహ్మసముద్రం, కణేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో వరదనీరు పంటలను నాశనం చేసింది. బ్రహ్మసముద్రం మండలంలో పోలేపల్లి, గుండిగానిపల్లి, వేపులపర్తి, అజ్జయ్యదొడ్డి, బుడిమేపల్లి, కన్నేపల్లి, గుడిపల్లి, యనకల్లు, తీటకల్లు, రాయదుర్గం మండలంలో మల్కాపురం, కెంచానపల్లి, వేపరాల, జుంజురాంపల్లి, కణేకల్లు మండలంలో రచ్చుమర్రి, గంగలాపురం, కళేకుర్తి, మాల్యం, కణేకల్లు, నాగేపల్లి, తుంబిగనూరు, బ్రహ్మసముద్రం, ఉడేగోళం, బెణకల్లు, బిదరకుంతం, గరుడచేడు, బొమ్మనహాళ్ మండలంలో హోన్నూరు, హరేసముద్రం, గోవిందవాడ, కందేపల్లి, సింగేపల్లి, బొల్లనగుడ్డం తదితర గ్రామాలలో పంటలు నాశనమయ్యాయి.
పంటలను కప్పేసిన బురద
వరి, మొక్కజొన్న, పత్తి, టమోటా సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు. బొల్లనగుడ్డం, గంగలాపురం గ్రామాలలో ఇళ్లల్లోకి నీరు చేరింది. వరద దెబ్బకు వ్యవసాయ బోర్లు ఇసుకతో మూసుకుపోయాయి. రెండు వేలకు పైగా విద్యుత స్తంభాలు నేలకొరిగాయి. రైతులకు ఎకరానికి కనీసం రూ.పదివేల దాకా పెట్టుబడి నష్టం కలిగింది. పత్తి, మొక్కజొన్న పంటలను బురద, ఇసుక కప్పేసింది. విద్యుత ట్రాన్సఫార్మర్లు చాలా చోట్ల నీట మునిగాయి.
ఎప్పుడూ ఇలా జరగలేదు..
వేదవతి నది మూడు మండలాల్లో సుమారు 50 కి.మీ. పొడవున ప్రవహించి కర్ణాటకలో ప్రవేశిస్తుంది. ఈ ప్రాంతంలో చాలా మంది రైతులు అప్పు చేసి పెట్టుబడి పెట్టారు. వేదవతి నదికి సుమారు 20 ఏళ్లుగా నీరు రాలేదు. దీంతో రైతులు నది సమీపంలో ఎప్పటిలాగానే పంటలను సాగు చేశారు. ఊహించని వరదతో తీవ్రంగా నష్టపోయారు. నదిలో సాధారణంగా ప్రవహించే నీటి నుంచి రైతులకు పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు. కానీ నీటి ఉధృతి కారణంగా వ్యవసాయానికి నష్టం కలిగింది. చాలా వ్యవసాయ కుటుంబాలు అప్పుల పాలయ్యాయి. ప్రభుత్వం విపత్తు కింద పరిగణించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు.

అప్పు మిగిలింది..
నా కూతురి పెళ్లి కోసం అప్పు చేశాను. ఈసారి పంట రాగానే తీరుద్దామని అనుకున్నాను. వరదనీటిలో పంట మొత్తం కొట్టుకుపోయింది. 18 ఎకరాలలో జొన్న, మూడు ఎకరాలలో మిరప, ఒక ఎకరాలో పత్తి, 14 ఎకరాలలో వరి సాగు చేశాను. ఇప్పటి వరకు రూ.4.70 లక్షలు పెట్టుబడి పెట్టాను. వేదవతి హగరి వరద ఉగ్రరూపం వల్ల పంటలను కోల్పోయి అప్పుల పాలయ్యాను. జొన్న, మిరప, పత్తి పంటలు పూర్తిగా నాశనమైపోయాయి. అప్పు తీర్చాలనే ఆశతో ఈసారి కౌలుకు ఎక్కువ భూమి చేశాను.
- సంజప్ప, కౌలు రైతు, హరేసముద్రం
22 ఎకరాలు కౌలుకు తీసుకుని..
ఇతర రైతుల వద్ద 22 ఎకరాలను కౌలుకు తీసుకున్నాను. 12 ఎకరాలలో వరి, పది ఎకరాలలో పత్తి పంటను సాగు చేశాను. పత్తి పంటకు ఎకరాకు రూ.40 వేలు, వరికి ఎకరాకు రూ.20 వేలు పెట్టుబడి పెట్టాను. వేదవతి హగరి ప్రవాహంతో మొత్తం 22 ఎకరాలలో పంట ధ్వంసమైంది. భూ యజమానికి కౌలు, పంటకు పెట్టిన పెట్టుబడి పూర్తిగా నేనే భరించాలి. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.
- వెంకటేశులు, రైతు, బ్రహ్మసముద్రం
విపత్తుగా పరిగణించాలి
గతంలో ఎన్నడూలేని విధంగా వేదవతి హగరి మా పొలాలను ముంచెత్తింది. పత్తి పంట ఇప్పటికే పూత దశ ఉన్నింది. అనుకోకుండా వచ్చిన వరదకు మొత్తం కొట్టుకుపోయింది. మొత్తం నష్టపోయాను. ప్రభుత్వం నష్టపరిహారం అందించాలి. లేకపోతే అప్పుల ఊబిలో కూరుకుపోతాము. ప్రభుత్వం విపత్తుగా పరిగణించి ఆదుకోవాలి.
- కురుబ హనుమంతు, రైతు, బ్రహ్మసముద్రం
వేరుశనగ పోయింది..
మూడు ఎకరాలలో వేరుశనగ సాగు చేశాను. మూడేళ్ల నుంచి సక్రమంగా పంటలు పండక నష్టపోతున్నాను. ఈ ఏడాది చేతికొచ్చిన పంట నోటికి రాకుండాపోయింది. నది నీటిలో మొత్తం కొట్టుకుపోయింది. పెట్టుబడుల కోసం చేసిన అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. మూడేళ్లలో ఒక్కసారి కూడా దిగుబడి సరిగా రాలేదు. వ్యవసాయంపై నమ్మకం కోల్పోతున్నాను. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం అందించాలి.
- తిప్పన్న, రైతు, గోవిందవాడ