ప్రభుత్వ భవనాల ఆలనాపాలన కరువు

ABN , First Publish Date - 2022-10-04T05:28:20+05:30 IST

పాడైన ప్రభుత్వ భవనాలను బాగు చేసుకోలేక ప్రైవేట్‌ భవనాల కు అద్దెలు కడుతూ వసతిగృహాలు నిర్వహిస్తోంది జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ. ఎకరాల్లో భూములు... విశాలమైన భవంతులు ఉన్నప్పటికీ వాటికి ఆలనాపాలనా కరువవడంతో ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయాయి.

ప్రభుత్వ భవనాల ఆలనాపాలన కరువు
పెచ్చులూడిపోయి నిరుపయోగంగా మారిన డైనింగ్‌ హాల్‌

నిరుపయోగంగా మారిన వైనం

ప్రైవేట్‌ భవనాల్లో ఎస్సీ వసతిగృహాల నిర్వహణ 

పట్టించుకోని రాష్ట్ర ఉన్నతాధికారులు

మరమ్మతులకు అధికంగా ఖర్చవుతుందనే వెనకడుగు


అనంతపురం ప్రెస్‌క్లబ్‌, అక్టోబరు 3: పాడైన ప్రభుత్వ భవనాలను బాగు చేసుకోలేక ప్రైవేట్‌ భవనాల కు అద్దెలు కడుతూ వసతిగృహాలు నిర్వహిస్తోంది జిల్లా ఎస్సీ సంక్షేమశాఖ. ఎకరాల్లో భూములు... విశాలమైన భవంతులు ఉన్నప్పటికీ వాటికి ఆలనాపాలనా కరువవడంతో ఏళ్లుగా నిరుపయోగంగా మారిపోయాయి. పైస్థాయి అధికారులకు ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలియజేస్తున్నా, అంచనాలు వేసి పంపుతున్నా స్పందన కరువైందని జిల్లా అధికారులు చెబుతున్నారు. ఆ భవనాలను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకు రావాలంటే రూ. కోట్లల్లో ఖర్చవుతుండటం, ప్రభుత్వం నుంచి ఆ మేరకు స్పందన లేకపోవడంతో ఆ శాఖ రాష్ట్ర అధికారులు సైతం మిన్నకుండిపోతున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా ప్రతినెలా రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకుపైనే అద్దెలు చెల్లిస్తూ అద్దె భవనాల్లో వసతిగృహాలు నిర్వహిస్తున్నారు.  


ఏళ్లుగా నిరుపయోగంగా...

   ఎస్సీ సంక్షేమశాఖ పరిధిలోని పలు వసతిగృహాలు ఏళ్లుగా నిరుపయోగంగా మారాయి. ప్రభుత్వం నుంచి  నిధులు రాకపోవడంతో శిథిలమైన వసతిగృహాల్లో ఉండలేక... ప్రైవేట్‌ భవనాల్లోకి పలు వసతిగృహాలు మార్చేసిన సంఘటనలు జిల్లాలో కోకొల్లలు. 

 జిల్లా కేంద్రంలో బాలుర కళాశాల వసతిగృహం ఐదేళ్ల కిందట శిథిలం కావడంతో దాన్ని మూసివేశారు. నగరం నడిబొడ్డున, ఎకరా స్థలం... విశాలమైన భవనాన్ని అభివృద్ధి చేయలేక మూతవేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆ వసతిగృహంలో 8 గదులు, లైబ్రరీ రూమ్‌, రీడింగ్‌ రూమ్‌, వంటశాల, డైనింగ్‌ హాల్‌, వార్డెన గదితో పాటు... విశాలమైన పరిసరాలు ఉన్నాయి. ఈ హాస్టల్లో దాదాపు 300 మందికిపైగానే విద్యార్థులు వసతి పొందే వెసులు బాటు ఉండేది. ఆలనాపాలనా కరువవడంతో ఆ వసతిగృహాన్ని అధికారులు మూసివేశారు. 


 ఆదిమూర్తినగర్‌లోని దివ్యశ్రీ ఆస్పత్రి ఎదురుగా మరో చిన్నపిల్లల ఎస్సీ వసతిగృహం ఉంది. అర ఎకరంలో విశాలమైన భవనాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 400 మందికిపైగా విద్యార్థులు వసతి పొందేలా ఆ వసతిగృహాన్ని నిర్మించారు. ఒకానొక దశలో విద్యార్థుల సంఖ్య ఎక్కువ ఉన్న సమయంలో రెండు వసతిగృహాలను ఆ భవనంలోనే నిర్వహించినట్లు అధికారులు పేర్కొంటు న్నారు. అయితే రానురాను రాష్ట్రశాఖ నుంచి మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన నిధులు రాకపోవడం... చేతినుంచి ఖర్చులు పెట్టుకోలేక వార్డెనలు పట్టించుకోక పోవడంతో ఆ వసతిగృహం శిథిలావస్థకు చేరింది. దీంతో ఆ శాఖ అధికారులు ఆ వసతిగృహాన్ని మూడేళ్ల క్రితం మూసివేశారు. 


 కణేకల్లులోని బాలికల వసతిగృహాన్ని నాలుగు నెలల క్రితం మూసివేశారు. మెయింటెనెన్స ఫండ్‌ కోసం రాష్ట్రశాఖకు జిల్లా అధికారులు కుప్పలు తెప్పలుగా నివేదికలు పంపినట్లు తెలుస్తోంది. అక్కడి నుంచి  స్పందన లేకపోవడంతో ఆ వసతిగృహాన్ని మూసివేసి అందులో ఉన్న విద్యార్థినులను స్థానికంగా పలు బీసీ, ఎస్సీ, మోడల్‌ స్కూళ్లకు పంపినట్లు తెలుస్తోంది. ఈ వసతిగృహం దాదాపు అరెకరం విస్తీర్ణంలో ఉంది. 9 గదులు, వంటశాల, డైనింగ్‌, రీడింగ్‌ రూములు మరో నాలుగు గదులు నిర్మించారు. అయితే పైకప్పు పెచ్చులూడటం వర్షాలు కురిసిన సమయంలో నీరు వసతి గృహంలో కారుతుండటంతో ఆ శాఖ అధికారులు మూతేశారు. 


 గుత్తిలో నాలుగేళ్ల కిందట రెండు బాలుర వసతి గృహాలను మూసివేశారు. తాజాగా బాలికల కాలేజీ వసతిగృహం పూర్తిగా శిథిలమవడంతో దాన్ని మూసివేసినట్లు ఆ శాఖ అధికారులు తెలిపారు. గుత్తిలో నడిబొడ్డున ఉన్న ఆ వసతి గృహానికి ఆలనాపాలనా కరువవడంతో మూతేశారు. అందులో ఉన్న విద్యార్థనులను పలు వసతిగృహాల్లోకి పంపినట్లు తెలిసింది. ఈ వసతి గృహం కూడా అరెకరం విస్తీర్ణంలో ఉంది. దాదాపు 7 వసతి గదులు, విశాలమైన పరిసరాలతో ఏర్పాటైంది. వీటితోపాటు జిల్లాలో మరికొన్ని భవనాలు శిథిలావస్థకు చేరుకున్నట్లు పలువురు వార్డెన్లు పేర్కొంటున్నారు. 


అధిక ఖర్చే కారణమా...?

ఇప్పటి వరకూ శాఖ పరిధిలో మూతపడిన ప్రభుత్వ భవనాలకు మరమ్మతులు చేయాలన్నా... వాటిని పడగొట్టి కొత్తవి నిర్మించాలన్న రూ. కోట్లల్లో ఖర్చవుతుండటంతోనే ఆ శాఖ రాష్ట్ర అధికారులు వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని రెండు వసతిగృహాలను మరమ్మతులు చేయాలన్నా, కొత్తవి నిర్మించాలన్నా దాదాపు రూ. 5 కోట్ల వరకూ ఖర్చయ్యే అవకాశముందని ఆ శాఖ అధికారులే పేర్కొంటున్నారు. ఈ లెక్కన గుత్తి, కణేకల్లులోని వసతిగృహాలు సైతం ఒక్కో వసతిగృహానికి పూర్వవైభవం తీసుకురావాలంటే దాదాపు రూ.ఒకటిన్నర నుంచి కోటి రూ.2 కోట్ల వరకూ ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. అంత మొత్తంలో నిధులు ప్రభుత్వం నుంచి రాబట్టడంలో ఆ శాఖ రాష్ట్ర అధికారులు సాహాసం చేయలే కపోతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో... శిథిలమైన భవనాలు మూసివేసి విద్యార్థులను అడ్జెస్ట్‌ మెంట్‌తో సరిపెడుతూ, మరికొన్ని చోట్ల విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటే... వారి కోసం ప్రైవేట్‌ భవనాలను అద్దెకు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 


Read more