సందిగ్ధం

ABN , First Publish Date - 2022-09-28T05:36:48+05:30 IST

సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందన్న వాదనలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

సందిగ్ధం

సహకార ఎన్నికలపై రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన

నిర్వహించాలని కేంద్రం ఒత్తిడి

ఫలితాలపై వైసీపీలో సందేహాలు

వ్యతిరేకంగా వస్తే సాధారణ ఎన్నికలపై 

ప్రభావం ఉంటుందన్న ఆందోళన

ధర్మవరం


సహకార సంఘాల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందన్న వాదనలు రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. వెంటనే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తెస్తున్నా.. ముందుకెళ్లేందుకు అధికార వైసీపీ తర్జన భర్జన పడుతోందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం ప్రజల్లో అంత సానుకూలత లేనందున ఎన్నికలకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్న వాదన వినిపిస్తోంది. 2023లో సాధారణ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్న వాదనల నేపథ్యంలో ఇప్పట్లో సహకార సాహసం చేయలేకపోతుందని తెలుస్తోంది. కరోనా సాకుతో రెండేళ్లపాటు ఎన్నికలకు వెళ్లకుండా ఉండిపోయిన రాష్ట్ర ప్రభుత్వం.. సాధారణ ఎన్నికల వరకు వాయిదాలు వేసుకుంటూ వెళ్లే అవకాశం ఉందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.


ఫలితాలపై సందేహాలు

సహకార సంఘాలను పూర్తిగా కంప్యూటరీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం నిధులిస్తోంది. దీంతో సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించాలని షరతు విధించింది. ఇందుకు అయిష్టంగానే రాష్ట్ర ప్రభుత్వం తలూపింది. ఎన్నికల నిర్వహణ దిశగా అడుగు మాత్రం ముందుకు పడడం లేదు. నియోజకవర్గాల పరిధిలోగల సహకార సంఘాల సభ్యుల జాబితాలను అధికార పార్టీ నాయకులు, సమన్వయకర్తలు సేకరించినట్లు సమాచారం. ఆ జాబితాలను పరిశీలించి, వైసీపీకి అనుకూలురెవరు? వ్యతిరేకులెవరు? అనేది అంచనా వేసి, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని ఎమ్మెల్యేలకు ప్రభుత్వ పెద్దలు సూచించినట్లు తెలిసింది. ప్రస్తుతం గ్రామాల్లో వైసీపీకి అంత అనుకూల వాతావరణం లేదనీ, ఈ పరిస్థితుల్లో సహకార ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు ఎలా వస్తాయోనని ఆ పార్టీకి చెందిన కొందరు నాయకులు ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. జిల్లాలో 54 సహకార సంఘాలున్నాయి. ఇందులో 1,86,589 మంది ఓటర్లున్నారు. ఓటర్ల జాబితా వివరాలను అధికారులు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికలు ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఉంటాయా, కొత్తజిల్లాకు ప్రత్యేకంగా నిర్వహిస్తారా? అన్న దానిపై స్పష్టత లేదు.


2013 తరువాత..

2013లో జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ఎన్నికలు నిర్వహించారు. అప్పట్లో ఎన్నికైన పాలకవర్గ పదవీకాలం 2018తో ముగిసింది. అప్పటి నుంచి నామినేటెడ్‌ పాలకవర్గాలు కొనసాగుతున్నాయి. 2019 నుంచి వైసీపీ ప్రభుత్వం సొసైటీలు, డీసీసీబీ, డీసీఎంఎ్‌సలకు పాలకవర్గాలను నామినేట్‌ చేస్తూ వస్తోంది. ఆరు నెలలకోసారి పాలకవర్గాలను పొడిగిస్తూ వస్తోంది. ఎన్నికలకు మాత్రం వెళ్లట్లేదు.


సభ్యుడి అర్హత

సహకార ఎన్నికల్లో పోటీచేసే సభ్యుల అర్హతను ఇంకా నిర్ణయించలేదు. గతంలో సభ్యుడు కనీసం రూ.వెయ్యి విలువైన ఎరువులు, పిండికట్టలు కొనుగోలు చేసి ఉండాలి. సహకార సంఘం నుంచి రుణం తీసుకుని, సకాలంలో చెల్లించి ఉండాలి. సొసైటీలో డిపాజిట్లు చేసి ఉండాలి. నిబంధనల ప్రకారం సకాలంలో రుణాలు తిరిగి చెల్లించాలి. దీని ప్రకారం ప్రతి సహకార సంఘంలో వందల సంఖ్యలో సభ్యులను తొలగించాల్సి ఉంటుంది. డిపాల్టర్లు, రుణాలు తీసుకోని సభ్యులకు ఓటు హక్కు కల్పించాలని పలువురు ఎమ్మెల్యేలు.. ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిసింది. ఎన్నికలు జరిగితే  ఒక సహకార సంఘానికి 13 మంది డైరెక్టర్లు ఎన్నికవుతారు. వారిలో ఒకరు చైర్మనగా, మరొకరు వై్‌సచైర్మనగా ఎన్నికవుతారు.


చట్టం చెబుతోంది ఇదీ..

1984 సహకార చట్టం ప్రకారం సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలంటే మూడు నెలలు ముందుగా సొసైటీల వారీగా సభ్యుల జాబితాలు ప్రదర్శించాలి. అనంతరం అభ్యంతరాలు స్వీకరించి, మార్పులు, చేర్పులు చేయాలి. సహకార చట్టం ప్రకారం వెళ్లాలంటే ఈ వారంలో సభ్యుల జాబితాలు ప్రదర్శిస్తే డిసెంబరు ఆఖరుకు ఎన్నికలు నిర్వహించుకునే అవకాశం ఉంది. ప్రభుత్వంకూడా డిసెంబరులో నిర్వహించలేని పక్షంలో సాధారణ ఎన్నికల తరువాతే సహకార ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోందన్న ప్రచారం ఉంది. త్వరలో ఈ ఎన్నికలకు సంబంధించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


సిద్ధంగా ఉండాలని ఆదేశాలు అందాయి..

జిల్లావ్యాప్తంగా సహకార సంఘాల్లో ఓటరు జాబితాలు సిద్ధం చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఈ మేరకు ఓటరు జాబితాను సిద్ధం చేస్తున్నాం. ఎన్నికలు ఎప్పుడు ఉంటాయి? కొత్త జిల్లా ప్రాతిపదికన ఉంటాయా? ఉమ్మడి జిల్లాకు నిర్వహిస్తారా? అనే అంశాలపై ఇంకా ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందలేదు.

కృష్ణానాయక్‌, జిల్లా సహకార శాఖాధికారి


Read more