అన్నీ సమస్యలే..

ABN , First Publish Date - 2022-05-18T06:42:13+05:30 IST

కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడి నెలన్నర దాటింది. కనీసం పాలన కూడా పూర్తిగా ప్రారంభం కాలేదు. జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసినా.. వాటిలో వసతుల్లేవు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. అర్థంకాని దుస్థితి. కొత్త జిల్లాలో అన్నీ సమస్యలే. వైసీపీ అధికారం చేపట్టాక పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. నీటి పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అన్నీ సమస్యలే..

అటకెక్కిన పారిశ్రామికాభివృద్ధి

ముందుకు కదలని నీటి పథకాలు

వెక్కిరిస్తున్న రోడ్లు

మొదలవ్వని ‘కొత్త’ పాలన

నేడు తొలి డీఆర్సీ సమావేశం

కొన్నింటికైనా పరిష్కారం చూపేరా?

పుట్టపర్తి 


కొత్తగా శ్రీసత్యసాయి జిల్లా ఏర్పడి నెలన్నర దాటింది. కనీసం పాలన కూడా పూర్తిగా ప్రారంభం కాలేదు. జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసినా.. వాటిలో వసతుల్లేవు. అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. అర్థంకాని దుస్థితి. కొత్త జిల్లాలో అన్నీ సమస్యలే. వైసీపీ అధికారం చేపట్టాక పారిశ్రామికాభివృద్ధి పడకేసింది. నీటి పథకాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రోడ్లకు మరమ్మతులు చేయక ఛిద్రమయ్యాయి. వ్యవసాయానికి భరోసా కరువైంది. పంట నష్టాలతో అప్పులపాలై, అన్నదాతలు ఆత్మహత్య లు చేసుకుంటున్నారు. కొత్త జిల్లాలో అన్నిరంగాల్లోనూ సమస్యలు ఉన్నాయి. వాటి నడుమ తొలిసారిగా డీఆర్సీ సమావేశం ఇనచార్జి మంత్రి గుమ్మనూరు జయరాం అధ్యక్షతన కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించనున్నారు. జిల్లా అభివృద్ధిపై ఏమేరకు చర్చిస్తారో, కొంతైనా ఊరట కల్పిస్తారా అని ప్రజలు ఎదురుచూస్తున్నారు.


అన్నదాత బలవన్మరణాలు

పంట పెట్టుబడులు పెరిగిన నేపథ్యంలో వ్యవసాయం గిట్టుబాటు కావట్లేదు. దీనికితోడు ప్రభుత్వం రైతుకు అందించే సబ్సిడీల్లో కోతలు పెడుతుండడం మరింత భారమవుతోంది. వ్యవసాయం గిట్టుబాటు కాక, నష్టాలు ఎదురై, అప్పులపాలై, అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి కుటుంబాలకు కనీసం పరిహారం కూడా అందకపోవడం శోచనీయం.


పారిశ్రామికం అంతేనా?

శ్రీసత్యసాయి జిల్లాలో ఎన్నెన్నో పరిశ్రమల ఏర్పాటుకు గతంలో అడుగులు పడ్డాయి. అవి అక్కడితోనే ఆగిపోయాయి. గోరంట్ల మండలం పాలసముద్రం వద్ద నాసెన, బెల్‌ ఏర్పాటుకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత వదిలేశారు. పరిశ్రమల ఏర్పాటుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో మూడేళ్లుగా గుర్తించిన భూములు ఖాళీగానే ఉన్నాయి. పరిశ్రమలు తీసుకువస్తే వేలాదిమంది యువతకు ఉపాధి లభిస్తుంది.




విద్య, వైద్యం కోసం పొరుగునకు..

కొత్త జిల్లాలో విద్య, వైద్యం కోసం పొరుగు జిల్లాతోపాటు కర్ణాటకకు పరుగులు పట్టాల్సిందే. పెనుకొండ వద్ద వైద్యకళాశాలతోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి స్థలం కేటాయించి ఏడాది గడచినా పునాదిరాయికే పరిమితమైంది. జిల్లాలో యూనివర్సిటీలు లేక ఉన్నత విద్య కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది.


వామ్మో.. రోడ్లు..

జిల్లాలో రోడ్లు నరకానికి నకల్లుగా మారాయి. మరమ్మతులు చేపట్టక ఛిద్రమయ్యాయి. మోకాలిలోతు గుంత లు ఏర్పడ్డాయి. వాటిలో వెళ్లేందుకు వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్ల మరమ్మతులు చేపట్టే దిశగా చర్చలు సాగాలని ప్రజలు ఆశిస్తున్నారు.


పాలన ఉమ్మడి జిల్లా నుంచే..

కొత్తగా ఏర్పడిన జిల్లాలో నెలన్నర దాటినా పూర్తిగా యంత్రాంగం కుదరుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో వసతులు లేక ఉద్యోగులు నానా ఇక్కట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా అనంత నుంచి పాలన కొనసాగే పరిస్థితి నెలకొంది. అన్ని ప్రభుత్వ విభాగాలకు నిధులు లేక ఖాతాలు ఖాళీగా ఉన్నాయి. అత్యవసరమైన వాటికి కూడా ప్రభుత్వం అందించే బిల్లులు కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. కనీసం స్టేషనరీకి కూడా సమకూర్చుకోలేని పరిస్థితి ఉంది. సమావేశంలో తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందా అని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు.


ముందుకు కదలని సాగునీటి ప్రాజెక్టులు

జిల్లాలో ప్రధానమైన సాగు నీటి ప్రాజెక్టు హంద్రీనీవా. ఇందులో జీడిపల్లి రిజర్వాయర్‌ నుంచి వచ్చే ప్రధాన కాలువతోపాటు మడకశిర ఉప కాలువతోపాటు మారాల, చెర్లోపల్లి రిజర్వాయర్‌కు వెళ్లే కాలువలు ముళ్ల పొదలతో కుంచించుకుపోయాయి. మూడేళ్ల కిందట చేసిన కాలువల నిర్మాణం తప్పా.. వైసీపీ పాలనలో ఒక్క పని చేపట్టిన పాపానపోలేదు. ఎత్తిపోతల పనులు చేపట్టకపోవడంతో వందలాది చెరువులకు నీరు అందట్లేదు. పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులు కృష్ణాజలాలతో నింపేందుకు జీఓ విడుదల చేశారే తప్ప.. ఇంతవరకు నిఽధులు విడుదల చేయలేదు. సోమందేపల్లి పందిపర్తి రిజర్వాయర్‌, చిలమత్తూరు ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రతిపాదన దశలోనే ఉన్నాయి. కదిరి హంద్రీనీవా మెయిన బ్రాంచ కాలువ పనులు అటకెక్కాయి. వీటన్నింటిపై సమగ్రంగా చర్చించి, నిధులు తీసుకురావాలని రైతులు కోరుతున్నారు.


Updated Date - 2022-05-18T06:42:13+05:30 IST