ఉమ్మడి సమగ్రశిక్ష ప్రాజెక్టు విభజన

ABN , First Publish Date - 2022-10-11T05:35:56+05:30 IST

స్కూళ్లకైనా వెళ్తాం, కానీ పక్కనున్న శ్రీసత్యసాయి జిల్లాకు మాత్రం వెళ్లి పనిచేయలేం అంటున్నారు పలువురు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను రెండు జిల్లాలకు విభజించి కేటాయించారు

ఉమ్మడి సమగ్రశిక్ష ప్రాజెక్టు విభజన
సమగ్రశిక్ష ప్రాజెక్టు (ఫైల్‌)

పక్క జిల్లాకు వెళ్లేందుకు ఉద్యోగుల వెనుకంజ

అనంతకు 49, శ్రీ సత్యసాయి జిల్లాకు 52 మంది

రిపోర్ట్‌ చేసుకుంది 10 మందే!

సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్స్‌ ససేమిరా


అనంతపురం విద్య, అక్టోబరు 10: స్కూళ్లకైనా వెళ్తాం, కానీ పక్కనున్న శ్రీసత్యసాయి జిల్లాకు మాత్రం వెళ్లి పనిచేయలేం అంటున్నారు పలువురు సమగ్రశిక్ష ప్రాజెక్టు ఉద్యోగులు. ఉమ్మడి జిల్లా కేంద్రంగా ఉన్న సమగ్రశిక్ష ప్రాజెక్టులో పనిచేస్తున్న ఉద్యోగులను రెండు జిల్లాలకు విభజించి కేటాయించారు. ఈ నెల 4న జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఈ కేటాయింపుల ఉత్తర్వులు జారీ చేశారు. అయితే శ్రీసత్యసాయి జిల్లా ప్రాజెక్టుకు వెళ్లడానికి చాలామంది  వెనుకంజ వేస్తున్నారు. ఉమ్మడి జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టులో పని చేస్తున్న 101మందిని అనంతపురం జిల్లాకు 49 మందిని, శ్రీసత్య సాయి జిల్లాకు 52 మంది ఉద్యోగులను కేటాయించారు. ఇందులో సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు మొదలుకుని క్లరికల్‌ స్టాఫ్‌తోపాటు ఇతర సిబ్బందిని కూడా కేటాయించారు. అయితే శ్రీసత్యసాయి జిల్లా సమగ్రశిక్ష ప్రాజెక్టుకు కేటాయించిన ఉద్యోగుల్లో చాలా మంది అక్కడికి వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు.


శ్రీసత్యసాయి జిల్లాకు ఇలా..

ఉమ్మడి ప్రాజెక్టులో ప్రస్తుతం పనిచేస్తున్న వారి నుంచి ఈఈ శివకుమార్‌, డీఈ చిదంబరప్ప, సెక్టోరియల్‌ అధికారుల్లో సీఎంఓ ఓబుళపతి, ఐఈడీ  కో-ఆర్డినేటర్‌ దివాకర్‌రెడ్డి, ప్లానింగ్‌ కో-ఆర్డినేటర్‌ మదన్‌మోహన్‌, అసిస్టెంట్‌ ఏఎంఓ (జనరల్‌) నాగేంద్రను,అసిస్టెంట్‌ ఏఎంఓ (కన్న డ) మాధవరెడ్డి, అసిస్టెంట్‌ జీసీడీఓ కవిత, అసిస్టెంట్‌ ఐఈడీ కోఆర్డినేటర్‌ వెంకటరమణ, సూపరింటెండెంట్‌ ఫ్రాంక్లిన్‌, సీనియర్‌ అసిస్టెంట్లు షేకున్బీ, హాజీవలి, లక్ష్మిదే వి, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సుబ్బారెడ్డి, డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాఘవేంద్రనాయుడు, నూర్‌ మహమ్మద్‌, చంద్రబాబు, ఆఫీసర్‌ సబార్డినేట్స్‌ నాగన్న గౌడ్‌, ఆదినారాయణ, వెంకటలక్ష్మి, లక్ష్మిదేవితో పాటు, మరో 17 మంది సైట్‌ ఇంజనీర్లను శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. 


మేం వెళ్లం.. మేం వెళ్లం..

శ్రీ సత్యసాయి జిల్లాకు వెళ్లేందుకు చాలా మంది వెనకంజ వేస్తున్నారు. జిల్లా ప్రాజెక్టు నుంచి పక్కనున్న జిల్లాకు 52 మందిని కేటాయిస్తే....ఇప్పటి వరకూ 10 మంది మాత్రమే రిపోర్ట్‌ చేసుకున్నారు. ఐఈడీ  కో-ఆర్డినేటర్‌ దివాకర్‌రెడ్డి, సీనియర్‌ అసిస్టెంట్లు షేకున్బీ, హాజీవలి, లక్ష్మిదేవితోపాటు, జూనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ సుబ్బారెడ్డి, ఇద్దరు  కంప్యూటర్‌ ఆపరేటర్లతోపాటు, మరో ముగ్గురు అటెండర్లు రిపోర్టు చేసుకున్నారు. అయితే ప్రధానంగా సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌గా ప్రాజెక్టుకు వచ్చి పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో చాలా మంది పక్క జిల్లాకు వెళ్లేందుకు ససేమిరా అంటున్నారు. తమను వెంటనే స్కూళ్లకైనా పంపండి అంటూ ఉన్నతాధికారులకు లేఖలు ఇచ్చారు. 


ఇప్పుడు స్కూళ్లే బెటర్‌ అంట...!

ప్రాజెక్టులో పనిచేస్తున్న వారిలో పలువురు సెక్టోరియల్‌, అసిస్టెంట్‌ సెక్టోరియల్‌ అధికారులు, ఇతర క్లరికల్‌ స్టాఫ్‌ను శ్రీసత్యసాయి జిల్లాకు కేటాయించారు. పక్క జిల్లాలోని ప్రాజెక్టు ఆఫీ్‌సలో విధులకు వెళ్లి రావాలంటే నిత్యం ఉదయం, సాయంత్రం సుమారు 2 గంటల నుంచి 3 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ప్రయాణ బడలికతో ఒళ్లు హూనం అవుతుందన్న తదితర కారణాలతో పక్క జిల్లాకు వెళ్లడా నికి అంగీకరించడం లేదు. ప్రాజెక్టులోకి ఫారిన్‌ సర్వీసు ద్వారా వచ్చి మూడేళ్లు పూర్తి చేసుకున్న టీచర్లు తమను వెంటనే మాతృశాఖకు రీ ప్యాట్రేట్‌ చేయాలంటూ కోరుతున్నారు. ఈ ్చమేరకు ఉన్నతాధికారులకు లేఖలు కూడా ఇచ్చారు. మూడేళ్లు ఇంకా పూర్తికాని ఉపాధ్యా యులు మాత్రం ఇదెక్కడి గొడవరా బాబూ అంటూ పెదవి విరుస్తూ...ఆలోచనలో పడ్డారు.  ఇతర క్లరికల్‌ స్టాఫ్‌ మరింత సంకటంలో పడ్డారు. తమకు ఇచ్చే రూ. 13 వేలు, 17 వేలు, రూ. 21 వేలు వేతనాలకు అక్కడికి వెళ్లి ఎలా చేయగలం అంటూ గగ్గోలు పడెతున్నారు. ఇచ్చే జీతంలోనే సగం తిరగడానికి ఖర్చు అవుతుందని, ఒక వేళ అక్కడే అద్దె ఇళ్లు తీసుకుని ఉందామంటే...చాలీచాలని జీతంతో ఎట్లాగంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more