డీజిల్‌ దందా

ABN , First Publish Date - 2022-09-29T05:44:07+05:30 IST

పెనుకొండ కేంద్రంగా భారీ డీజిల్‌ కుంభకోణం జరిగింది. ఆర్టీసీ బస్సులకు లక్షలాది లీటర్ల డీజిల్‌ను సరఫరా చేసి.. లెక్కలను చూపలేదు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు.

డీజిల్‌ దందా
పెనుకొండలోని పెట్రోల్‌ బంకు

ఆర్టీసీకి సరఫరా చేసి.. లెక్కలు కప్పిపెట్టారు

పెనుకొండ కేంద్రంగా భారీ కుంభకోణం

పన్నులశాఖ సీరియస్‌.. ఖాతా మూసివేత

రూ.5 కోట్లు చెల్లించాలని నోటీసులు

మరో రూ.5 కోట్లు జరిమానాకు సిద్ధం


అనంతపురం క్రైం, సెప్టెంబరు 28: పెనుకొండ కేంద్రంగా భారీ డీజిల్‌ కుంభకోణం జరిగింది. ఆర్టీసీ బస్సులకు లక్షలాది లీటర్ల డీజిల్‌ను సరఫరా చేసి.. లెక్కలను చూపలేదు. తద్వారా ప్రభుత్వానికి రూ.కోట్లలో పన్ను ఎగవేసినట్లు అధికారులు గుర్తించారు. పెనుకొండలోని ఓ పెట్రోల్‌ బంకు నుంచి ఆర్టీసీ బస్సు డిపోలకు లక్షల లీటర్ల డీజిల్‌ తరలినట్లు గుర్తించారు. కేవలం నాలుగు నెలల వ్యవధిలో ఏకంగా రూ.22 కోట్ల టర్నోవర్‌ జరిగింది.  ఇదంతా కేవలం ఒక్క పెట్రోల్‌ బంక్‌ నుంచే జరగడం గమనార్హం. పన్నుల శాఖ ఉన్నతాధికారుల చొరవతో ఈ వ్యవ హారం బయట పడింది. ఆర్టీసీకి రోజూ ఎన్ని లీటర్లు సరఫరా చేస్తున్నారని అడిగితే.. 2వేల లీటర్లు అని బుకాయించారట. కానీ లెక్కలన్నీ తీస్తే.. రోజుకు 13 వేల నుంచి 20 వేల లీటర్లు విక్రయించినట్లు తేలిందని సమాచారం. ఇలా రూ.కోట్లలో టర్నోవర్‌ చేశారు. పన్నుల శాఖకు తక్కువ మొత్తం చెల్లించారట. దీంతో తక్షణమే రూ.5 కోట్లు వ్యాట్‌ చెల్లించాలని పన్నుల శాఖ అధికారులు ఆ పెట్రోల్‌ బంకుకు నోటీసులు పంపించారు. గత నెలాఖరులో పంపిన ఈ నోటీసులకు బంకు యాజమాన్యం స్పందించలేదు. దీంతో వారి ఖాతాలను బంద్‌ చేశారు. మరో రూ.5 కోట్లు జరిమానా విధించడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


కర్ణాటక డీజిలేనా..?

కర్ణాటకలో డీజిల్‌ ఇక్కడి కన్నా తక్కువ ధరకు లభ్యమవుతోంది. ఉమ్మడి జిల్లాలో లీటర్‌ డీజిల్‌ రూ.108 ఉండగా, కర్ణాటకలో రూ.98కే లభిస్తోంది. ఈ క్రమంలో పెనుకొండ కర్ణాటకకు సమీపంలో ఉండటం అక్రమాలకు కలిసొచ్చినట్లు తెలుస్తోంది. పన్నుల శాఖ అధికారులు చేపట్టిన తనిఖీల్లో సరిహద్దు ప్రాంతాలతో పాటు పెనుకొండకూ అక్రమంగా కర్ణాటక నుంచి డీజిల్‌ తరలిస్తున్నట్లు తేలింది. అక్రమ డీజిల్‌ను ఆర్టీసీ డిపోలకు సరఫరా చేస్తే బాగా లబ్ధిపొందవచ్చని, కుంభకోణానికి తెరతీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆర్టీసీ బస్సులకు రోజూ లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగిస్తుంటారు. 



పన్ను ఎగవేత..

డీజిల్‌, పెట్రోల్‌ జీఎస్టీ పరిధిలోకి రావు. వ్యాట్‌ పరిధిలోకి వర్తిస్తాయి. డీజిల్‌పై 31 శాతం వ్యాట్‌ చెల్లించాల్సి ఉంటంది. ఆ పెట్రోల్‌ బంకు యాజమాన్యం భారీగా పన్ను ఎగవేసినట్లు తెలిసింది. పన్నులశాఖ అధికారులను బురిడీ కొట్టించా లనుకుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 24న రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఒక సౌలభ్యం కల్పించింది. ఎక్కడి నుంచైనా డీజిల్‌ కొనేందుకు అనుమతి ఇచ్చింది. ఇదే అదనుగా రోజూ వేల లీటర్లు ఆర్టీసీ డిపోలకు సరఫరా చేశారని తెలిసింది. కానీ అధికారులకు వ్యాట్‌ పన్ను కేవలం 2వేల లీటర్లకే చెల్లించినట్లు తేలింది. అధికారులు తనిఖీలు చేపట్టి, ఆరా తీయడంతో పాటు అటు ఆర్టీసీ డిపోల ద్వారా విచారణ సాగించారు. ఆర్టీసీ డీజిల్‌ వినియోగం గణాంకాల ఆధారంగా తీగ లాగితే డొంక కదిలింది. రోజూ 15 వేల నుంచి 20 వేల వేల లీటర్లు సరఫరా చేసినట్లు తేలింది. మార్చి నుంచి జూన వరకు మొత్తం రూ.22 కోట్ల టర్నోవర్‌ జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఇంకా జూలై, ఆగస్టు లెక్కలు తీయాల్సి  ఉందని తెలుస్తోంది.


ఆర్టీసీ డిపోలకే..

పెనుకొండలోని సాయిశివ కేంద్ర పేరుతో నిర్వహించే పెట్రోల్‌ బంక్‌ నుంచి రోజూ 13 వేల నుంచి 20 వేల లీటర్ల  డీజిల్‌ను విక్రయిం చారు. ఒక్కో ఆర్టీసీ డీపోకు రెండు మూడు రోజులకు ఒక ట్యాంకర్‌ సరఫరా చేసినట్లు తెలిసింది. హిందూపురం, పెనుకొండ, మడకశిర, పుట్టపర్తి, కదిరి, కళ్యాణదుర్గం డిపోలకు డీజిల్‌ సరఫరా చేశారు. ఇందులో అత్యధికంగా హిందూపురం, కదిరి డిపోలకు సరఫరా చేసినట్లు తెలుస్తోంది. 


రూ.5 కోట్లు చెల్లించాల్సిందే..

ఎగ్గొట్టిన వ్యాట్‌ రూ.5 కోట్లు చెల్లించాల్సిందేనని పన్నుల శాఖ అధికారులు పట్టుపట్టారు. గత నెలాఖరులో ఆ పెట్రోల్‌ బంకు యాజమాన్యానికి ఈ మేరకు నోటీసులు పంపారు. స్పందించకపోవడంతో తాజాగా వారి ఖాతాలను బ్రేక్‌ చేశారు. ఆ పెట్రోల్‌ బంకుకు సంబంధించిన ఏ ఒక్క ఖాతాకూ ఒక్క రూపాయ వెళ్లడం లేదు. ఆ పెట్రోల్‌ బంకుకు చెల్లించాల్సిన మొత్తాన్ని పనులశాఖకు వ్యాట్‌ కింద చెల్లించాలని ఆర్టీసీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. పన్ను ఎగవేసినందుకు మరో రూ.5 కోట్లు జరిమానా వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-09-29T05:44:07+05:30 IST