వసతిగృహాల సిబ్బందికి ఇవ్వని డీడీఓ కోడ్‌

ABN , First Publish Date - 2022-09-12T05:15:51+05:30 IST

సమస్య చిన్నదే... కానీ దాని ప్రభావం మాత్రం చెప్పలేనంతగా మారింది. అధికారుల అలసత్వమో... లేక అనాలోచిత నిర్ణయం కారణమో తెలీదుకానీ రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు రాక సతమతమవుతున్నారు

వసతిగృహాల సిబ్బందికి ఇవ్వని డీడీఓ కోడ్‌
ట్రెజరీ కార్యాలయం

సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి రాని అనుమతులు

రెండు నెలలుగా వర్కర్లకు అందని వేతనాలు  

ఎస్సీ సంక్షేమశాఖలో విచిత్ర పరిస్థితి

 

 అనంతపురం ప్రెస్‌క్లబ్‌ : సమస్య చిన్నదే... కానీ దాని ప్రభావం మాత్రం చెప్పలేనంతగా మారింది.  అధికారుల అలసత్వమో... లేక అనాలోచిత నిర్ణయం కారణమో తెలీదుకానీ రెండు నెలలుగా సిబ్బందికి వేతనాలు రాక సతమతమవుతున్నారు. ఎస్సీ సంక్షేమశాఖలో విచిత్రవైఖరితో ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. సీఎఫ్‌ఎంఎస్‌ నుంచి కోడింగ్‌, మ్యాపింగ్‌ రాకపోవడంతో గుత్తి, తాడిపత్రి డివిజన్లకు చెందిన ఏఎస్‌డబ్ల్యూతో పాటు వసతిగృహాల వర్కర్లు వేతనాలు ఖాతాల్లో జమ కాలేదు.  


  ఎస్సీ సంక్షేమశాఖలో కొత్తగా ఏర్పాటైన గుత్తి డివిజన ఏఎ్‌సడబ్ల్యూతో పాటు కొత్తగా మ్యాపింగ్‌ చేయాల్సిన వసతిగృహాల వర్కర్లకు వేతన వెతలు తప్పడం లేదు. రెండు నెలలుగా జీతాలు లేకపోవడంతో పలువురు వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా పాయింట్‌ అయితే ఏర్పాటు చేశారు. అయితే అందుకు సంబంధించిన సీఎ్‌ఫఎంఎస్‌ అనుమతులు రాష్ట్ర కార్యాలయం నుంచి రాకపోవడంతో జిల్లా ట్రెజరీ అధికారులు డీడీఓ కోడ్‌ను కొత్తగా ఏర్పాటైన గుత్తి పాయింట్‌కు ఇవ్వలేకపోయారు. దీంతో ఆ డివిజనలోని పర్యవేక్షణాధికారితో పాటు వసతిగృహాల్లోని వర్కర్లకు జీతాలు అందని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా తాడిపత్రి డివిజనలో సైతం కొత్తగా వసతిగృహాలు చేర్చడంతో, ఆ వసతిగృహాల్లోని వర్కర్ల జీతాల విషయంలోనూ మ్యాపింగ్‌ సమస్య ఏర్పడినట్లు తెలుస్తోంది. ఇలా ఎస్సీ సంక్షేమశాఖలోని కొత్తగా ఏర్పాటైన గుత్తి డివిజన, పలు డివిజన్లలోకి చేరిన వసతిగృహాల మ్యాపింగ్‌ జరగకపోవడంతో అందులో పనిచేస్తున్న సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు.  


కొత్తగా ‘గుత్తి’ సమస్య

జిల్లాల పునర్విభజనంలో నేపథ్యంలో శ్రీసత్యసాయి జిల్లాకు మూడు డివిజన్లను కేటాయించి ఆయా డివిజన్లకు సర్దుబాటు చేశారు. అదేవిధంగా అనంతపురం జిల్లాకు నాలుగు డివిజన్లను ఏర్పాటు చేసి వసతిగృహాలను సర్దుబాటు చేశారు. దీనికి తోడు అనంతపురం జిల్లాలో కొత్తగా గుత్తి ఏఎ్‌సడబ్ల్యూఓ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఉమ్మడి జిల్లాలో ఉన్న నేపథ్యంలో కొన్ని వసతిగృహాలు శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోకి చేరాయి. తర్వాత అధికారులు కొన్నింటిని తాడిపత్రి, గుత్తి ఏఎ్‌సడబ్ల్యూఓ పాయింట్లకు చేర్చారు. దిమ్మగుడి, యాడికి, పెద్దవడుగూరు బాల,బాలికలు హాస్టళ్లతో పాటు గడేకల్లు, కొనకొండ్ల, పామిడితో పాటు ధర్మవరంలోని కొన్ని వసతిగృహాలను గుత్తి పాయింట్‌లోకి చేర్చారు. అదేవిధంగా అనంతపురంలోని శింగనమల, తరిమెల, బుక్కరాయసముద్రంతో పాటు మరికొన్ని వసతిగృహాలను తాడిపత్రి ఏఎ్‌సడబ్ల్యూఓ పాయింట్‌లోకి మార్చారు. ఇక్కడే అసలు సమస్య ఏర్పడింది. కొత్తగా ఏర్పాటైన గుత్తి ఏఎ్‌సడబ్ల్యూఓ పాయింట్‌ను అయితే ఏర్పాటు చేశారు కానీ... ఆ పాయింట్‌కు డీడీఓ కోడ్‌ను ఇవ్వడంలో ఆశాఖ రాష్ట్ర అధికారులు విఫలమయ్యారు. కేవలం నిర్లక్ష్యం కారణంగానే కోడింగ్‌ ఇవ్వడం లేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. డీడీఓ కోడ్‌ ఏర్పాటు కావాలంటే ఆ డివిజనలో జీతభత్యాలకు సంబంధించి రాష్ట్రస్థాయిలో సీఎ్‌ఫఎంఎస్‌ అనుమతులు రావాల్సి ఉంది. ఆ మేరకే జిల్లా ట్రెజరీ అధికారులు డీడీఓ కోడ్‌ను కేటాయిస్తారు. అయితే ఆ మేరకు రాష్ట్రస్థాయి అనుమతులు రాకపోవడంతో ట్రెజరీ అధికారులు సైతం డీడీఓ కోడ్‌ను ఇవ్వలేదు. దీంతో జూలై, ఆగస్టు నెలలకు సంబంధించి ఆ పాయింట్‌ ఏఎ్‌సడబ్ల్యూఓతో పాటు, ఆ పాయింట్‌లోకి కొత్తగా చేరిన వసతిగృహాలు మ్యాపింగ్‌ చేయకపోవడంతో వర్కర్లకు జీతాలు అందకుండాపోయాయి. ఈ సమస్యను ఆశాఖ అధికారులు ఎప్పుడు, ఎలా అధిగమిస్తారో తెలియాల్సి ఉంది.


ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం : దామోదర్‌రెడ్డి, ఎస్సీ సంక్షేమశాఖ ఇనచార్జ్‌ డీడీ

గుత్తి సమస్యతో పాటు తాడిపత్రిలో పలు వసతిగృహాల మ్యాపింగ్‌ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశాం. వర్కర్ల వేతనాలకు సంబంధించి ఇప్పటికే ట్రెజరీ అధికారులతో సంప్రదించాం. తాడిపత్రిలో సమస్య కొలిక్కి వచ్చింది. అయితే గుత్తి సమస్యపై గురించి అధికారులతో చర్చిస్తున్నాం. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తాం.


Read more