వామ్మో.. ఆవుల దొంగలు..!

ABN , First Publish Date - 2022-09-25T05:38:27+05:30 IST

రైతులు కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతున్నారు. పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారు.

వామ్మో.. ఆవుల దొంగలు..!

రోడ్డుపక్కనున్న పాడి పశువులే టార్గెట్‌

వరస చోరీలతో రైతుల బెంబేలు

జీవనాధారం కోల్పోతున్న దుస్థితి


ఓబుళదేవరచెరువు


    రైతులు కొన్నేళ్లుగా అతివృష్టి, అనావృష్టితో పంటలు నష్టపోతున్నారు. పెట్టుబడులకు చేసిన అప్పులు తీర్చలేక నానా తంటాలు పడుతున్నారు. కుటుంబ పోషణ కూడా భారమై, విలవిల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో పాడిపశువులు పొషించి, వాటి పాలు అమ్ముకుంటూ ఆలి, బిడ్డలకు ఇంత ముద్ద పెడుతున్నారు. పాడిపశువులే అన్నదాతకు జీవనాధారంగా మారాయి. దొంగల కన్ను వాటిపై పడింది. రోడ్డు పక్కన పాడిపశువులు కనిపిస్తే చాలు.. అపహరిస్తున్నారు. ఆఖరుకు దొడ్లలో కట్టేసిన వాటిని సైతం అపహరించుకెళ్తున్నారు. దీంతో రైతులు జీవనాధారం కోల్పోయి, రోడ్డున పడుతున్నారు. ఎలా బతకాలోనని దిక్కులు చూస్తున్నారు. దొంగలు.. యథేచ్ఛగా పాడిపశువులను వాహనాల్లో ఎక్కించుకుని, తీసుకెళ్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతున్నారు. అయినా, వాటిని నియంత్రించడంలో పోలీసులు విఫలమవుతున్నారని బాధిత రైతులు విమర్శలు గుప్పిస్తున్నారు.


పోలీసులకు సవాల్‌

ఇటీవలిగా మండలంలో పాడి పశువుల అపహరణలు పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. రూ.లక్షలాది విలువ చేసే పాడి ఆవులను అపహరిస్తున్నారు. కొంతమంది ఉదయం పూట గ్రామాల్లో తిరుగుతూ చిరువ్యాపారాలు చేస్తూ, పాడి పశువులను గుర్తిస్తారు. అదేరోజు రాత్రికి చోరీలు చేస్తున్నారు. ఇందుకు ఇటీవల మిట్టపల్లి క్వార్టర్స్‌లో కొంతమంది వ్యక్తులు చిరు వ్యాపారాల పేరుతో వచ్చిన రాత్రే హైదర్‌ వలీకి చెందిన పాడి ఆవును అపహరించారు. దుండగులు ప్రత్యేక వాహనాల్లో రాత్రికిరాత్రే పాడి పశువులను అపహరించినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వాటిని ఛేదించడం పోలీసులకు సవాల్‌గా మారింది.


బీమా లేక నష్టం

పాడి ఆవులను దుండగులు అపహరించినపుడు వాటికి బీమా చేయించి ఉండుంటే రైతులకు ఉపశమనం దక్కుతుంది. బీమా చేయని కారణం గా పూర్తిగా నష్టపోతున్నారు. రైతులు చాలామంది.. పశువులకు బీమా చేయట్లేదు. బీమా చేసి ఉండుంటే పరిహారమైనా వచ్చేది. పశు వైద్య శాఖ.. పశువుల బీమాపై పాడి రైతులకు అవగాహన కల్పించడంలో విఫలమవుతోందన్నది నిర్వివాదాంశం. ఇటీవలిగా బీమా వస్తుందో.. రాదో.. అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీమాపై సంబంధిత అఽధికారులు.. పాడి రైతులకు అవగాహన కల్పించి, బీమా చేసుకునేలా చర్యలు చేపట్టాల్సి ఉంది.


జీవనాధారం కోల్పోయిన రైతులు

కుటుంబానికి ఆసరాగా ఉన్న పాడి పశువులను దుండగులు అపహరిస్తుండడంతో రైతులు జీవనాధారం కోల్పోతున్నారు. ఉదయం, సాయంత్రం వచ్చే పాల ఆదాయం కుటుంబ పోషణకు ఆసరాగా ఉండేది. వరుస చోరీలతో పలువురు బాధితులు తమ పాడి ఆవులను కోల్పోయి, కుటుంబ పోషణ భారమైంది. కాయ, కష్టం చేసి సంపాదించిన డబ్బుతోపాటు అప్పులు చేసి పాడి పశువులను కొనుగోలు చేస్తున్నారు. వాటిపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఒక్కసారిగా పాడి పశువులను అపహరిస్తుండడంతో అయోమయంలో రైతులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.


వరుస చోరీలతో బెంబేలు

ఆవుల దొంగలు రెచ్చిపోతున్నారు. వరుస చోరీలతో రైతులు బెంబేలెత్తుతున్నారు. ఇటీవలిగా ఆవుల అపహరణ ఎక్కువైంది. మండలంలోని మిట్టపల్లి కాలనీలో పి.హైదర్‌వలీకి చెందిన ఓ పాడి ఆవు, అదేరోజు గాజుకుంటపల్లికి చెందిన నాగరాజు, వేమారెడ్డిపల్లికి చెందిన బుద్దల చిన్నశివారెడ్డి పాడి ఆవును దుండగులు అపహరించారు. అంతకుముందు దాదిరెడ్డిపల్లికి చెందిన ఎద్దుల హనుమంతరెడ్డి షెడ్‌లో ఉన్న రెండు చొప్పున ఆవులు, ఎద్దులను అపహరించారు. సీసీ టీవీ ఫుటేజీలో ఆ విషయం స్పష్టమైంది.


దర్యాప్తు చేస్తున్నాం..

సీసీ టీవీ ఫుటేజీ, సాంకేతికతో పాడి పశువుల అపహరణలపై విచారిస్తున్నాం. అనుమానాస్పద ప్రాంతాల్లో రాత్రి వేళల్లో గస్తీ ఏర్పాటు చేస్తున్నాం. కొంతమంది యువత కూడా గ్రామాల్లో గస్తీ నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. గ్రామ సంరక్షణ కమిటీలను నియమించాం. దుండగులను పట్టుకుంటాం. గ్రామాల్లో కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలి.

గోపి, ఎస్‌ఐ

Read more