పత్తికి కాయకుళ్లు

ABN , First Publish Date - 2022-11-25T00:17:10+05:30 IST

పత్తి పంటకు కాయకుళ్లు తెగులు సోకింది. పత్తి కాయల లోపలిభాగం కుళ్లిపోతోంది. గతంలో ఎప్పుడూ ఈ తెగులు రాలేదని రైతులు వాపోతున్నారు. పత్తి సాగుకోసం రైతులు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చుచేశారు. తెగులు కారణంగా ఎకరాకు అర క్వింటా పత్తి కూడా రావడంలేదని బాధిత రైతులు వాపోతున్నారు.

పత్తికి కాయకుళ్లు
కాయకుళ్లు తెగులు సోకిన పత్తి కమతం

వేల ఎకరాల్లో పంటనష్టం

పంటను తొలగిస్తున్న రైతులు

పెట్టుబడీ రాలేదని కంటతడి

గుంతకల్లు, నవంబరు 24: పత్తి పంటకు కాయకుళ్లు తెగులు సోకింది. పత్తి కాయల లోపలిభాగం కుళ్లిపోతోంది. గతంలో ఎప్పుడూ ఈ తెగులు రాలేదని రైతులు వాపోతున్నారు. పత్తి సాగుకోసం రైతులు ఎకరానికి రూ.40 వేల నుంచి రూ.50 వేల దాకా ఖర్చుచేశారు. తెగులు కారణంగా ఎకరాకు అర క్వింటా పత్తి కూడా రావడంలేదని బాధిత రైతులు వాపోతున్నారు. పత్తిని తొలగిస్తే వచ్చే డబ్బు కూలీలకూ సరిపోదని భావించి, పంటను పొలాల్లోకి కలియదున్నుతున్నారు. మరి కొందరు అలాగే వదిలేస్తున్నారు. గత సంవత్సరం మిర్చి ముంచిందని, ఇప్పుడు మిర్చితోపాటు, పత్తి కూడా నష్టాలను మిగిల్చిందని రైతులు కంటతడి పెడుతున్నారు.

భారీగా సాగు

గుంతకల్లు, ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు మండలాల్లో దాదాపు 11 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. గుత్తి, శింగనమల, పెద్దవడుగూరు, పామిడి, యాడికి మండలాల్లో మరో 38 వేల ఎకరాల్లో సాగైంది. పూత దశలో ఉండగానే గులాబి రంగు పురుగు సోకి నష్టం కలిగించింది. దీంతో దిగుబడులు భారీగా తగ్గిపోతాయని రైతులు ఆందోళన చెందారు. ఈ విపత్తును దాటుకుని, కాయ దశకు చేరుకోగానే కాయకుళ్లు దాడిచేసింది. ఈ నెల తొలి కోత కోయాల్సి ఉంది. సగం పంట దెబ్బతినింది. అరకొరగా వచ్చిన పత్తి ఎందుకూ పనికిరాకుండా పోతోందని రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

నీరు రాదని తెలిసి..

హంద్రీనీవా కాలువకు సమీపంలో కమతాలు ఉన్నవారు పత్తిని తొలగించి వేరే పంటలను పెట్టుకోవాలని భావించారు. కానీ హంద్రీనీవాకు జనవరిలో నీరు రాదని అధికారులు చెప్పడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. గత వారం రిలయన్స కంపెనీ ప్రతినిధులు గ్రామాలకు వచ్చి పంట కోత ప్రయోగాలు చేశారు. 6 క్వింటాళ్ల దిగుబడి వస్తే మంచి ఫలసాయంగా భావిస్తుండగా, కేవలం 2.3 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని తేలింది. మూడు క్వింటాళ్ల కంటే తక్కువ దిగుబడి నమోదైతే పంట నష్టం జరిగినట్లుగా నిర్ణయిస్తారు. ఈ లెక్కన పంటల బీమా వస్తుందని రైతులు ఆశిస్తున్నారు.

అధ్వానంగా ధర

మార్కెట్‌లో పత్తి ధర క్వింటం రూ.9 వేలు ఉంది. కానీ కాయ కుళ్లు సోకిన దిగుబడులు నాసి రకంగా ఉన్నాయి. దీన్ని ఆదోని, బళ్లారి మార్కెట్లకు తీసుకెళ్తే రూ.5,500 మాత్రమే ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. రమణా రెడ్డి అనే రైతు 12 ఎకరాలలో పత్తి సాగు చేశాడు. వారం క్రితం తొలి కోత కోశాడు. 5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. దీన్ని అమ్మితే కూలి ఖర్చులు కూడా రావని భావించి, డబ్బులకు బదులు పత్తినే తీసుకెళ్లమని కూలీలకు కోరాడు. కానీ వారు నిరాకరించారు. దీంతో వంద మందికి రూ.500 చొప్పున రూ.50 వేలు చెల్లించాడు. ఎకరానికి 15 క్వింటాళ్ల దిగుబడి రావాల్సిన చోట 12 ఎకరాలకు 5 క్వింటాళ్ల దిగుబడి వస్తే బతికేది ఎలా అని రమణా రెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. గులాబి పురుగుతో 10 శాతం నష్టం జరిగిందని, కాయకుళ్లు కారణంగా 70 శాతం దిగుబడులు తగ్గిపోయాయని రైతులు వాపోతున్నారు. ఎకరానికి రూ.50 వేలు పెట్టుబడి పెడితే.. రూ.3 వేలు చేతికి వస్తోందని కంటతడి పెడుతున్నారు.

ఏపుగా పెరిగినా..

నాకున్న 12 ఎకరాల్లో పత్తి పంటను పెట్టాను. మొక్కలు ఏపుగా పెరిగాయి. కానీ కాయకుళ్లు వల్ల దిగుబడి రాలేదు. తొలి కోతలో కనీసం 70 క్వింటాళ్ల దిగుబడి రావాల్సింది. 5 క్వింటాళ్లు మాత్రమే వచ్చింది. ఇక ప్రయోజనం లేదని మిగిలిన రెండు కోతల కోసం ఎదురుచూడకుండా పంటను దున్నేస్తున్నాను.

- రమణారెడ్డి, జి.కొట్టాల

పంటల బీమా ఇవ్వాలి..

కాయకుళ్లు తెగులు వల్ల పత్తి రైతులందరం నష్టపోయాము. చివరి వర్షాలకు వేసిన నా కమతం ఇప్పుడు కాయదశకు చేరుకుంది. పంట చేతికి వస్తుందా, లేక కాయకుళ్లు దెబ్బతీస్తుందా అని ఆందోళన చెందుతున్నారు. జరిగిన పంట నష్టానికి బీమా వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.

- తిరుమల రావు, కొట్టాల రైతు

కూలీలకు సరిపోయింది..

నాకున్న రెండెకరాలలో పత్తి పంటను పెట్టాను. తొలి కోత ఆరు క్వింటాళ్లు వచ్చింది. మార్కెట్‌లో అమ్మితే రూ.33 వేలు వచ్చింది. ఫలసాయాన్ని తీయడానికి 65 మంది కూలీలు పనిచేశారు. ఒక్కొక్కరికి రూ.500 లెక్కన వచ్చిన ఆదాయం కూలీలకే సరిపోయింది. ఇక ప్రయోజనం లేదని పంటను పాసేస్తున్నాను.

- ఎం చంద్రమౌళి, జి.కొట్టాల

Updated Date - 2022-11-25T00:17:10+05:30 IST

Read more