పాఠశాలలపై కరోనా పడగ

ABN , First Publish Date - 2022-01-28T05:31:50+05:30 IST

పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. రోజూ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయలు కరోనా బారిన పడుతున్నారు.

పాఠశాలలపై కరోనా పడగ

నార్పల మండలంలో 

39 మంది విద్యార్థులకు వైరస్‌

విడపనకల్లు మండలంలో 

11 మంది టీచర్లకు... 

ఉపాధ్యాయులు, 

తల్లిదండ్రుల్లో ఆందోళన

ప్రభుత్వ వైఖరిపై పలువురి ఆగ్రహం

మళ్లీ మొదలైన కొవిడ్‌ మరణాలు 

ఒక్క రోజులో 980 పాజిటివ్‌ కేసులు


అనంతపురం వైద్యం, జనవరి27: పాఠశాలల్లో కరోనా విజృంభిస్తోంది. రోజూ జిల్లాలోని వివిధ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయలు కరోనా బారిన పడుతున్నారు. వారం రోజులుగా అనేక పాఠశాలలు, కళాశాలల్లో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతూనే ఉన్నాయి. గురువారం నార్పల ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో 60 మంది విద్యార్థులకు పరీక్షలు చేయించగా.. 31 మందికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆ పాఠశాలలో అలజడి రేగింది. డీఈఓ ఆదేశాల మేరకు సెలవులు ప్రకటించారు. అదే మండలంలోని బండ్లపల్లి జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలోనూ 8 మంది విద్యార్థులు, ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చింది. గోరంట్ల కేజీబీవీలో ముగ్గురు విద్యార్థులకు, రాగిమేకలపల్లి పాఠశాలలో ఒక టీచర్‌కు పాజిటివ్‌ వచ్చింది. పుట్లూరు మండలం కడవకల్లు పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులకు పాజిటివ్‌ వచ్చింది. విడపనకల్లు మండలం పాల్తూరు జిల్లా పరిషత ఉన్నపాఠశాలలో 11 మంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్‌ రాగా.. సెలవులు ప్రకటించారు. ఇప్పటికే గుత్తి, ఉరవకొండ, రాయదుర్గం, గుమ్మఘట్ట, బొమ్మనహాళ్‌, మడకశిర ప్రాంతాల్లోని అనేక పాఠశాలలు, కేజీబీవీల్లో విద్యార్థులు, ఉపాధ్యాయు లు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వం మాత్రం పాఠశాలల్లో కరోనా కేసులపై ఉదాసీనత చూపుతోంది. ఎక్కడైనా కేసులు వస్తే అక్కడ మాత్రమే ఒకట్రెండురోజులు సెలవులు వదిలేస్తున్నారు. అంతేగానీ ముందస్తుగా ఎలాంటి కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టడం లేదు. కనీసం శానిటైజ్‌ కూడా చేయడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఒక్కరోజులో 980 కేసులు... ఇద్దరు మృతి..

జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 980 పాజిటివ్‌ కేసులు నమోదైనట్టు అధికారులు గురువారం వెల్లడించారు. మూడు నెలలకుపైగా జిల్లాలో కరోనా మరణాలు నమోదు కాలేదు. తాజాగా జిల్లాలో కరోనా బారిన పడి చికిత్స పొందుతున్న ఇద్దరు మరణించినట్లు అధికారులు తెలిపారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా 172242 మంది కరోనా బారిన పడ్డారు. ఇందులో 161432 మంది ఆరోగ్యంగా కోలుకున్నారు. 1095 మంది మరణించగా ప్రస్తుతం 9715 మంది చికిత్స పొందుతున్నట్లు అధికారులు వెల్లడించారు.


మండలాల వారీగా కేసుల నమోదు ఇలా..

జిల్లాలో గురువారం 49 మండలాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ఇందులో అనంతపురం 294, నల్లచెరువు 133, ధర్మవరం 75, పుట్టపర్తి 59, గుంతకల్లు, కదిరి 31, బుక్కపట్నం 30, పెనుకొండ, తాడిపత్రి 24, గుత్తి, ఉరవకొండ 19, బత్తలపల్లి, బుక్కరాయసముద్రం 17, సీకేపల్లి 16, మడకశిర 15, కూడేరు 14, తనకల్లు 13, చిలమత్తూరు 12, అగళి, నల్లమాడ, రొద్దం 11, తాడిమర్రి 9, గోరంట్ల, గుడిబండ 8, కొత్తచెరువు, యాడికి 7,  విడపనకల్లు 6, ఓడీ చెరువు, శింగనమల 5, డీ.హీరేహాళ్‌, కంబదూరు, నా ర్పల, పెద్దపప్పూరు, రొళ్ల 4, ఆత్మకూరు, పామిడి, పుట్లూరు 3, అమడగూరు, కళ్యాణదుర్గం, ముదిగుబ్బ, ఎనపీకుంట 2, గార్లదిన్నె, కణేకల్లు, లేపాక్షి, రామగిరి, రాప్తాడు, సోమందేపల్లి, తలుపుల మండలాల్లో ఒక్కో కేసు నమోదయ్యాయి. మిగిలిన ఐదు కేసుల్లో ఇతర జిల్లాలు, రాషా్ట్రలకు చెందినవారున్నారు.
Read more