ఆ స్టేషనలో మళ్లీ వివాదం

ABN , First Publish Date - 2022-03-16T06:05:44+05:30 IST

సీకే పల్లి పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. గత నెలలో స్టేషనకు పిలిపించి ఓ వృద్ధుడిని చితకబాదారు.

ఆ స్టేషనలో మళ్లీ వివాదం
పీఎస్‌ మెట్లపై బాధితుడు

గత నెలలో వృద్ధుడిపై విరిగిన లాఠీ

మరోమారు స్టేషనకు రప్పించిన పోలీసులు

ఖాళీ కాగితాలపై సంతకాలు చేయించారు

చెన్నేకొత్తపల్లి, మార్చి 15: సీకే పల్లి పోలీసుల తీరు మరోసారి వివాదాస్పదమైంది. గత నెలలో స్టేషనకు పిలిపించి ఓ వృద్ధుడిని చితకబాదారు. మరోమారు బాధితుడిని, అతని కుమారులను స్టేషనకు పిలిపించారు. తమతో ఖాళీ కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని బాధితులు ఆరోపించారు. ఈ వ్యవహారాన్ని కొందరు ఫోనలో చిత్రీకరించారు. ఆ వీడియో వైరల్‌ అయింది.


గత నెలలో వివాదం..

సీకేపల్లి మండలం గంగినేపల్లికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు వెంకటరాముడు, వైసీపీ కార్యకర్త నరసింహులు మధ్య ఇంటి పునాది విషయంలో ఫిబ్రవరి 16న ఘర్షణ జరిగింది. వైసీపీ వారు ఫిర్యాదు చేయడంతో వెంకటరాముడును స్టేషనకు పిలిపించిన ఎస్‌ఐ శ్రీధర్‌, విచక్షణా రహితంగా కొట్టారు. దీంతో వృద్ధుడు స్టేషన ఆవరణలో స్పృహతప్పి పడిపోయాడు. పత్రికల్లో వచ్చిన కథనం ఆధారంగా హెచఆర్‌సీ సుమోటోగా కేసు తీసుకుంది. ఏప్రిల్‌ 6లోగా నివేదిక ఇవ్వాలని ఎస్పీని ఆదేశించింది. ఈ క్రమంలో బాధితుడు వెంకటరాముడుతోపాటు ఆయన కుమారులను పోలీసులు మంగళవారం స్టేషనకు పిలిపించారు. ఖాళీ కాగితాలపై సంతకాలు చేయాలని తమపై ఒత్తిడి చేశారని బాధితులు తెలిపారు. విషయం చెప్పకపోవడంతో తాము సంతకాలు చేసేందుకు నిరాకరించామని, దీంతో పోలీసులు బెదిరించి సంతకాలు పెట్టించుకున్నారని వాపోయారు. తమపట్ల పోలీసులు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై ఎస్‌ఐ శ్రీధర్‌ను వివరణ కోరగా, గంగినేపల్లి ఘర్షణ కేసులో వెంకటరాముడు, అతని కుమారులు నిందితులని, అందుకే స్టేషనకు పిలిపించి నోటీసులు ఇచ్చి సంతకాలు చేయించుకున్నామని తెలిపారు. పూచీకత్తును తెస్తే బెయిల్‌ కూడా ఇస్తామని వారికి తెలియజేశామని ఎస్‌ఐ అన్నారు.

Read more