ఐసీడీఎస్‌లో గ్రేడ్‌-2 పోస్టుల భర్తీలో గందరగోళం

ABN , First Publish Date - 2022-09-30T05:44:19+05:30 IST

మహిళాభి వృద్ధి శిశు సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో మాయాజాలం చూపుతున్నారు. గ్రేడ్‌-2 సూపర్‌ వైజర్‌పోస్టుల భర్తీలో గందరగోళానికి తెరతీశారు. ఈ పోస్టుల భర్తీపై తొలి నుంచి లక్షలాది రూపాయలకు బేరసారాలు సాగు తుండటంతో కథ రోజుకో మలుపు తిరుగుతోంది

ఐసీడీఎస్‌లో గ్రేడ్‌-2 పోస్టుల భర్తీలో గందరగోళం

- 18న పరీక్షలు పూర్తి, కీ ఇవ్వకుండా జాప్యం

- ఇతర జిల్లాల్లో కోర్టుకు అభ్యర్థులు

- హడావుడిగా మార్కుల వివరాలు విడుదల 

- జిల్లాలో 36 పోస్టుల భర్తీపైనా నీలినీడలు 

అనంతపురం విద్య, సెప్టెంబరు 29: మహిళాభి వృద్ధి శిశు సంక్షేమ శాఖ పోస్టుల భర్తీలో మాయాజాలం చూపుతున్నారు. గ్రేడ్‌-2 సూపర్‌ వైజర్‌పోస్టుల భర్తీలో గందరగోళానికి తెరతీశారు. ఈ పోస్టుల భర్తీపై తొలి నుంచి లక్షలాది రూపాయలకు బేరసారాలు సాగు తుండటంతో కథ రోజుకో మలుపు తిరుగుతోంది. అభ్యర్థులను ఎంపిక చేయాల్సిన సమయంలో గురువా రం పరీక్షల్లో వచ్చిన మార్కుల వివరాలను విడుదల చేయడం కూడా అనేక అనుమానాలకు తావి స్తోంది.  పలు జిల్లాల్లో కొందరు అభ్యర్థులు ఈ పోస్టుల భర్తీపై కోర్టు మెట్లు ఎక్కడంతోనే ఈ పరీక్షల మార్కుల మెరిట్‌ జాబితా డ్రామాను అధికారులు తెరపైకి తీసుకోచ్చారన్న విమర్శలూ వస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ 36 గ్రేడ్‌ -2 సూపర్‌ వైజర్‌పోస్టుల భర్తీలో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 

కీ విడుదలలో జాప్యమెందుకో..!

అనంతపురం జిల్లాలో గ్రేడ్‌ -2 సూపర్‌ వైజర్‌ మంజూరు పోస్టులు 46 ఉండగా, అందులో  ఇప్పటికే 10 భర్తీ కావడంతో...ఇటీవల 36 పోస్టులకు ఉద్యోగోన్నతుల ప్రక్రియ నిర్వహించారు.  జిల్లాలోని అర్హుల నుంచి 594 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 592 దరఖాస్తులు అంగనవాడీ వర్కర్ల నుంచి మరో 2 కాంట్రాక్టు వర్కర్ల నుంచి వచ్చా యి. ఈ నెల 18న  కర్నూలులో పరీక్షలు నిర్వహించారు.  తర్వాత పరీక్షలకు సంబంధించి ఎలాంటి పరీక్షల కీ విడుదల చేయలేదు. తర్వాత పరీక్షలకు హాజరైన పలువురు అంగన్వాడీ వర్కర్లను వారి ఆంగ్ల భాషా ప్రావీణ్యాన్ని పరీక్షించే లా వారి రోజువారీ దినచర్యను తెలిపేలా ఇంగ్లీష్‌ మాట్లాడి వీడియో పంపాలం టూ... ఆదేశించారు. దీనికి 5 మార్కులుంటాయని చెప్పడంతో ...అభ్యర్థులు ఇంగ్లీష్‌లో మాట్లాడిన వీడియోలను అధికారులకు పంపారు. అయితే ఇటు రాత పరీక్షలకు కానీ, ఇటు వీడియోలకు కానీ ఎన్ని మార్కులు వచ్చాయో తెలియజేయలేదు. కానీ 47 మందిని మెరిట్‌ జాబితాలో ఉంచారు. కీ విడుదల చేయకుండా అశాస్ర్తీయంగా మెరిట్‌ లిస్టును విడుదల చేయ డంపైనా విమర్శలు వచ్చాయి.  ఇంతలోనే తెరవెనుక అభ్యర్థుల ఎంపి క జాబితా కూడా సిద్ధం అయ్యిందన్న ఉహాగానాలు వెలువడ్డాయి. దీంతో పలు జిల్లాల్లో అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. తాజాగా రాష్ట్ర శాఖ అధికారులు ఆగమేఘాల మీద మెరిట్‌ జాబితా విడుదల చేశారు. ఈ గందరగోళంపై, అశాస్త్రీయ ఎంపిక విధానంపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించడంతో మళ్లీ మొదటికొచ్చింది. ఫలితంగా జిల్లాలోనూ 36 పోస్టుల భర్తీపైనా నీలి నీడలు కమ్ముకున్నాయి.  


Updated Date - 2022-09-30T05:44:19+05:30 IST