చేతగాని దద్దమ్మ.. సీఎం జగన

ABN , First Publish Date - 2022-11-23T00:09:21+05:30 IST

సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వెధవలు అధికారంలో ఉంటే ఏ ఒక్కరికీ ఉపాధి దొరికే పరిస్థితి లేదన్నారు. చేతగాని దద్దమ్మ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని జగన పాలనపై విరుచుపడ్డారు

చేతగాని దద్దమ్మ.. సీఎం జగన
జాకీ పరిశ్రమ భూముల్లో నిరసన వ్యక్తం చేస్తున్న నాయకులు

ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బెదిరింపులతోనే వెళ్లిపోయిన జాకీ పరిశ్రమ

వెధవలు అధికారంలో ఉంటే ఉపాధి దొరకదు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

అనంతపురం, నవంబరు22 (ఆంధ్రజ్యోతి): సిగ్గులేని ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. వెధవలు అధికారంలో ఉంటే ఏ ఒక్కరికీ ఉపాధి దొరికే పరిస్థితి లేదన్నారు. చేతగాని దద్దమ్మ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడని జగన పాలనపై విరుచుపడ్డారు. కరువు జిల్లా అనంత నుంచి జాకీ పరిశ్రమ తెలంగాణకు తరలిపోవడంపై ఆయన తీవ్రంగా స్పందించారు. మంగళవారం జిల్లాకొచ్చిన ఆయన అనంతపురం నగర సమీపంలో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు సేకరించిన స్థలం, అక్కడ అర్ధంతరంగా ఆగిపోయిన పనులను స్థానిక ఆ పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా రామకృష్ణ మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన తరువాత ప్రజలందరూ ఏపీలో పారిశ్రామికరంగం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారన్నారు. ఆ క్రమంలో రాప్తాడులో జాకీ పరిశ్రమ ఏర్పాటుకు ఆ సంస్థ ముందుకొచ్చిందన్నారు. పరిశ్రమ ఏర్పాటుతో ప్రత్యక్షంగా... పరోక్షంగా 6 వేల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. అలాంటి పరిశ్రమ తెలంగాణకు తరలిపోవడానికి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకా్‌షరెడ్డి బెదిరింపులే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో తనకు రూ.25 కోట్లు ఖర్చయిందనీ, రూ.10 కోట్లు ఇవ్వాలని జాకీ పరిశ్రమ జీఎంను ఎమ్మెల్యే ప్రకా్‌షరెడ్డి బెదిరించడంతోనే పరిశ్రమ తెలంగాణకు వెళ్లిపోయిందన్నారు. పరిశ్రమల ఏర్పాటులో ఆలిండియాలో ఫస్ట్‌ ర్యాంకు వచ్చిందని గొప్పలుపోయే ముఖ్యమంత్రి జగన.. ఎక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేశారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. సొంత జిల్లా కడపలో ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేసి, వదిలేసిన ముఖ్యమంత్రి పరిశ్రమలను తెచ్చాడని చెబితే ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. చేతగాని దద్దమ్మ రాష్ర్టానికి సీఎంగా ఉన్నాడని జగనపై మండిపడ్డారు. రాష్ర్టానికి సంబంధించి ఏ ఒక్కటీ ప్రధానమంత్రిని అడగలేకపోతున్న అసమర్థ ముఖ్యమంత్రి జగన అన్నారు. కరువు జిల్లాలో పరిశ్రమలు పెట్టేందుకు జాకీ సంస్థ ముందుకొస్తే... వారి ఎమ్మెల్యే రూ.10 కోట్లు డిమాండ్‌ చేస్తుంటే నిలువరించలేకపోయిన దద్దమ్మ ముఖ్యమంత్రి జగన అన్నారు. ఈ విషయాన్ని రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా చేపడతామన్నారు. కియ అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడానికి అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బెదిరింపులే కారణమని ఆయన విమర్శించారు. కరువు కాటకాలతో జిల్లాప్రజలు వలసలు పోతుంటే... ఉపాధి అవకాశాలు పెంపొందించే పరిశ్రమలను వెల్లగొడుతున్నారంటే ప్రభుత్వ చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోందన్నారు. ప్రతి పరిశ్రమకు సైంధవుల్లా అధికార పార్టీ ప్రజాప్రతినిధులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి అటకెక్కిందని ధ్వజమెత్తారు. జాకీ పరిశ్రమ జిల్లా నుంచి వెళ్లిపోయిన అంశం రాష్ట్రవ్యాప్త సమస్యగా చర్చిస్తామన్నారు. అన్ని రాజకీయ, విద్యార్థి, యువజన సంఘాలతో త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి, ఉద్యమ కార్యచరణ రూపొందిస్తామన్నారు. ఈలోపు పరిశ్రమను తిరిగి అనంతకు తెప్పిస్తే సరి... లేకపోతే 2024 ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలన్నారు. లేపాక్షి నాలెడ్జి హబ్‌ భూములనూ కారుచౌకగా కొట్టేస్తున్న వ్యక్తి ఎవరో కాదన్నారు. స్వయానా సీఎం మేనల్లుడేనన్నారు.

Updated Date - 2022-11-23T00:09:21+05:30 IST

Read more