నకిలీ నాణేలతో బురిడీ

ABN , First Publish Date - 2022-04-05T06:35:24+05:30 IST

నకిలీ బంగారు నాణేలను ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు తెలిపారు.

నకిలీ నాణేలతో బురిడీ
వివరాలను వెల్లడిస్తున్న సీఐ శ్యామరావు

ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు

గుత్తి, ఏప్రిల్‌ 4: నకిలీ బంగారు నాణేలను ఆశచూపి మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు సీఐ శ్యామరావు తెలిపారు. స్థానిక పోలీసు స్టేషనలో సోమవారం వివరాలు వెల్లడించారు. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం పి కొత్తపల్లికి చెందిన హరికృష్ణ, రమేష్‌.. హైదరాబాద్‌కు చెందిన శ్రీనివాసరావుకు ఫోన చేసి, పురాతన బంగారు నాణేలు ఉన్నట్లు తెలిపారు. పాత ఇంటిని పడగొట్టిన సమయంలో కేజీ బంగారు నాణేలు దొరికాయని, వాటిని తక్కువ ధరకే ఇస్తామని నమ్మబలికారు. ఈ నెల ఒకటో తేదీన అతన్ని గుత్తికి పిలిపించి, రెండు బంగారు నాణేలను ఇచ్చి, పరీక్షిం చుకోమన్నారు. దీంతో నమ్మిన శ్రీనివాసరావు, అన్ని నాణేలను కొనుగోలు చేయడానికి బేరం కుదుర్చుకున్నాడు. డబ్బులు ఇచ్చి, నాణేలను తీసుకునేందుకు శ్రీనివాసరావు సోమవారం గుత్తికి వచ్చాడు. డబ్బులు చేతులు మారే సమయంలో పోలీసు జీపు సైరన వినబడటంతో హరికృష్ణ, రమేష్‌ పారిపోయారు. దీంతో మోసపోయినట్లు గుర్తించిన శ్రీనివాసరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫోన లొకేషన ఆధారంగా గుత్తి ఆర్‌ఎస్‌లోని పత్తికొండ రోడ్డు బ్రిడ్జి వద్ద ఉన్న ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి కిలో నకిలీ బంగారు నాణేలు, రెండు మేలిమి బంగారు నాణేలు స్వాధీనం చేసుకున్నారు. కోర్టుకు హాజరుపరిచిన అనంతరం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.

Read more