విత్తనం కొనలేదని దళారీల అక్కసు

ABN , First Publish Date - 2022-03-04T05:59:01+05:30 IST

జొన్న రైతులపై దళారులు పగబట్టారు. ఆరుగాలం శ్రమించి పండించే దిగుబడులను అతి తక్కువ ధరకు కొనేవారు.

విత్తనం కొనలేదని దళారీల అక్కసు
ఆరు బయట ఎండలో ఉన్న బస్తాలు

జొన్నరైతుపై పగ

దిగుబడులను కొనరు.. కొననివ్వరు

రైతులను వెంటాడి.. వేధిస్తున్న వైనం

హావళిగిలో మగ్గుతున్న  రూ.7 కోట్ల దిగుబడులు

దిక్కుతోచని స్థితిలో అన్నదాతలు


జొన్న రైతులపై దళారులు పగబట్టారు. ఆరుగాలం శ్రమించి పండించే దిగుబడులను అతి తక్కువ ధరకు కొనేవారు. పదిహేనేళ్లుగా దోపిడీ కొనసాగించారు. దీన్ని పసిగట్టిన రైతులు వారిని వదిలించుకోవాలని అనుకున్నారు. విత్తనాన్ని బయట కొని సాగు చేశారు. ప్రకృతి విపత్తులను జయించి, దిగుబడిని సాధించారు. మార్కెట్‌లో అమ్ముకుంటే.. తమకు ఈ ఏడాది అంతో ఇంతో మిగులుతుందని అనుకున్నారు. కానీ.. రైతుల కదలికలపై నిఘా వేసిన దళారులు, విషం చిమ్మడం ప్రారంభించారు. ఏ ఒక్కరూ సీడ్‌ జొన్నలను కొనకుండా కుట్ర చేస్తున్నారు. అవి కల్తీ విత్తులని, నాణ్యత లేదని విష ప్రచారం చేస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు నెలలుగా యాతన పడుతున్నారు. ఇది విడపనకల్లు మండలం హావళిగి రైతులకు వచ్చిన కష్టం. ఆ ఊరి పొలాలు, వామిదొడ్లు, రేకుల షెడ్లు.. ఎక్కడ చూసినా పేరుకు పోయిన దిగుబడులే కనిపిస్తున్నాయి. దాదాపు 16 వేల క్వింటాళ్ల నిల్వలు ఉంటాయి. వీటి విలువ రూ.7 కోట్లకు పైగా ఉంటుంది. 


విడపనకల్లు, మార్చి 3: మండల పరిధిలోని హావళిగి గ్రామ రైతులు 15 సంవత్సరాల నుంచి సీడ్‌ జొన్న సాగు చేస్తున్నారు. వీరు దళారుల వద్ద విత్తనం కొనేవారు. పంట దిగుబడులను దళారులకే అమ్మేవారు. దీనివల్ల దళారులకు తప్ప తమకు పెద్దగా ఆదాయం రావడం లేదని భావించిన రైతులు, ఈ ఏడాది బయటి ప్రాంతాల నుంచి విత్తనాన్ని కొని తెచ్చుకున్నారు. 15 వందల ఎకరాల్లో సీడ్‌ జొన్న సాగు చేశారు. ఎకరానికి 10 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి సాధించారు. ఏటా ఎకరాకు 20 క్వింటాళ్లకు పైగా దిగుబడి వచ్చేదని, ఈ ఏడాది వర్షాల ప్రభావంతో దిగుబడి పడిపోయిందని రైతులు తెలిపారు. రెండు నెలల క్రితం పంట కోశారు. మొత్తంగా దాదాపు 16 వేల క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. గత ఏడాదితో పోలిస్తే దిగుబడి సగానికి తగ్గిపోయింది.


రూ.7 కోట్ల దిగుబడి..

హావళిగిలో దాదాపు రూ.7 కోట్ల విలువైన జొన్న దిగుబడులు అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి. పొలాలు, వామిదొడ్లు, రేకుల షెడ్లలో వీటిని నిల్వ చేశారు. గాలి, ఎండ, వాన, పందికొక్కులు, ఎలుకల కారణంగా వీటికి నష్టం జరుగుతోంది. ఏసీ గోదాముల్లో నిల్వ చేయాలంటే క్వింటానికి రూ.20 ఖర్చు వస్తుంది. ఇంటి వద్ద అమ్ముకుంటే అంతో ఇంతో మిగులుతుంది. పంట దిగుబడి ఇంటికి రావటంతో ఇక  డబ్బు చేతికి వస్తుందని రైతులు ఆశించారు. కానీ దళారులు రైతులపై విషం కక్కడం మొదలు పెట్టారు. పంటను ఎవరూ కొనకుండా కుట్ర చేశారు. తమ వద్ద విత్తనం కొనలేదని కక్షగట్టారు. రైతులకు విత్తనం ఇచ్చి, దిగుబడులను తామే కొంటే, దళారులకు క్వింటాపై రూ.300 లాభం వచ్చేది. ఒక లారీకి 250 నుంచి 300 క్వింటాళ్ల విత్తనాన్ని లోడ్‌ చేస్తే, ఉత్తి పుణ్యానికి రూ.90వేలు లాభం వచ్చేది. దీనికి రైతులు గండి కొట్టడంతో వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రైతులపై నిఘాపెట్టి, ఒక్క గింజను కూడా అమ్ముకోలేని పరిస్థితిని కల్పించారు. 


వెంటాడి.. వేటాడి..

ప్రస్తుతం సీడ్‌ జొన్న ధర క్వింటం రూ.4,200 ఉంది. దళారులు రూ.2,500 నుంచి రూ.2,800కు అడుగుతున్నారని రైతులు వాపోయారు. గిట్టుబాటు కాదని భావించి, గ్రామానికి చెందిన ముగ్గురు రైతులు హైదరాబాద్‌కు తీసుకువెళ్లి అమ్మేందుకు ప్రయత్నించారు. 300 క్వింటాళ్ల సీడ్‌ జొన్నను హైదరాబాద్‌కు వాహనంలో తీసుకువెళ్లారు. దళారులు అక్కడి వ్యాపారులకు ఫోన చేసి, వాటిని కొనకుండా చేశారు. చేసేది లేక లారీ బాడుగ రూ.1.20 లక్షలు చెల్లించి, రైతులు దిగుబడిని తిరిగి గ్రామానికి తెచ్చుకున్నారు. పంట కోసి రెండు నెలలు అయిందని, ఇంకో 20 రోజులు ఇలాగే ఉంచితే పురుగు పట్టి దిబ్బలో పడేయాల్సి వస్తుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీడ్‌ జొన్నను గడ్డి పెంపకం కోసం ఢిల్లీ, రాజస్తాన, ఒడిసా, బిహార్‌, మధ్యప్రదేశ, హరియాణా రాష్ట్రాలవారు కొనుగోలు చేస్తారు. గ్రామంలో 15 వేల క్వింటాళ్ల సీడ్‌ జొన్న నిల్వలు ఉన్నాయి. ఇవి పాడైపోతే రైతులకు రూ.7 కోట్లకు పైగా నష్టం జరుగుతుంది. కలెక్టర్‌, జేడీఏ స్పందించి  తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.


ఆదుకోండి కలెక్టర్‌గారూ..

దళారుల కుట్రలను జయించలేక జొన్నరైతులు విలవిల లాడుతున్నారు. ఎకరం పొలంలో సీడ్‌ జొన్న సాగుకు రూ.25 వేల వరకూ ఖర్చు వస్తుంది. అదే కౌలు రైతుకు అయితే రూ.40 వేలు ఖర్చు అవుతుంది. ఎకరానికి విత్తనం, ఎరువులకు రూ.15 వేలు, పురుగు మందులకు రూ.5 వేలు, పంట కోతకు రూ.5 వేలు ఖర్చు అవుతుంది. కౌలు ఎకరానికి రూ.15 వేల నుంచి రూ.18 వేల వరకూ ఉంది. ప్రకృతి అనుకూలిస్తే ఎకరానికి 20 క్వింటాళ్ల దాకా దిగుబడి వస్తుంది. కానీ ఈ ఏడాది సగానికి తగ్గిపోయింది. క్వింటానికి కనీసం రూ.4 వేలు ధర లభిస్తే తప్ప రైతులకు గిట్టుబాటు కాదు. కానీ పగబట్టిన దళారులు.. కేవలం రూ.2,500 ఇస్తామని బేరం పెట్టారు. రైతుల చుట్టూ ఉచ్చు బిగించారు. కలెక్టర్‌ జోక్యం చేసుకుని దళారుల నుంచి తమను రక్షించాలని, జాప్యం జరిగితే జొన్న నిల్వలు పాడైపోతాయని కంటతడి పెడుతున్నారు.







రూ.5 లక్షలు అప్పు చేశా..

సీడ్‌ జొన్న సాగుకోసం 12 ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నా. పెట్టుబడులు, కౌలు కోసం రూ.5 లక్షలు అప్పు చేశాను. 150 క్వింటాళ్ల దిగుబడులను వామిదొడ్డిలో రాసిపోసి ఉంచాను. వర్షం కురిస్తే దిగుబడి సంగతి అంతే. మొత్తం కుళ్లిపోతుంది. రూ.లక్షల్లో నష్టపోతాను. ఏసీ గోదాముల్లో నిల్వ చేద్దామంటే, అప్పుల వారికి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు. ఎంతో కొంతకు అమ్మి అప్పు తీర్చాలని ఉంది. దళారుల మోసాన్ని ప్రభుత్వం అడ్డుకుని, మాకు న్యాయం చేయాలి.

- వడ్డే దేవేంద్ర, రైతు, హావళిగి



ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఐదు ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకున్నాను. ఎకరానికి రూ.18 వేలు కౌలు చెల్లించాను. 65 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఆరుబయట ఎండలోనే ఉంచాను. పంట చేతికి వచ్చిందనే ఆనందం తప్ప ఒక్కరూపాయి కూడా చేతికి రాలేదు. దిగుబడి అమ్ముడుపోతే అప్పులు కట్టి, మిగిలిన మొత్తాన్ని కుటుంబ పోషణకు వాడుకుందామని అనుకుంటున్నాను. ఎవరూ కొనకపోతే మాకు ఆత్మహత్యే శరణ్యం. 

- చంద్ర, రైతు, హావళిగి


దళారులు కుమ్మక్కయ్యారు..

20 ఎకరాల్లో సీడ్‌ జొన్న సాగు చేశాను. దళారులు కుమ్మక్కై మా నుంచి విత్తనాన్ని కొనడంలేదు. దీంతో రేకుల షెడ్డులో నిల్వ ఉంచాను. పంది కొక్కులు జొన్న సంచులను నాశనం చేస్తున్నాయి. దాదాపు 250 క్వింటాళ్ల జొన్నలు మూలన వేసి, కొనేవారి కోసం ఎదురు చూస్తున్నాను. ఎవరూ కొనకపోతే రూ.10 లక్షలకు పైగా నష్టపోతాను. అధికారులు, ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.

- ఓబులేసు, రైతు, హావళిగి




Updated Date - 2022-03-04T05:59:01+05:30 IST